Home Latest News Uppal Match | హోంగ్రౌండ్‌లో బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌.. గల్లీబాయ్‌కు...

Uppal Match | హోంగ్రౌండ్‌లో బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌.. గల్లీబాయ్‌కు అండగా రోహిత్‌ శర్మ

Uppal Match | టైమ్‌ టు న్యూస్‌, హైదరాబాద్‌: సొంతగడ్డపై తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసలు కురిపించాడు. మూడు ఫార్మాట్లలో కీలక ప్లేయర్‌గా ఏడాది కాలంగా విజృంభణ కొనసాగిస్తున్న సిరాజ్‌.. హోంగ్రౌండ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని హిట్‌మ్యాన్‌ ఆకాంక్షించాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా.. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తొలి వన్డే జరుగనున్న నేపథ్యంలో మంగళవారం రోహిత్‌ మీడియాతో మాట్లాడాడు.

“సిరాజ్‌ మంచి ఊపుమీదున్నాడు. రోజురోజుకు అతడి గ్రాఫ్‌ పెరుగుతూ వస్తోంది. కొత్త బంతితో అద్భుతాలు చేస్తున్నాడు. నిలకడగా వికెట్లు పడగొడుతూ జట్టు విజయాల్లో కీలకమవతున్నాడు. తొలిసారి హోమ్‌గ్రౌండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న అతడికి ఆల్‌ ది బెస్ట్. మూడు ఫార్మాట్లలో కీలక ప్లేయరైన సిరాజ్‌పై వర్క్‌లోడ్‌ పడకుండా చూసుకుంటాం. ఆస్ట్రేలియాతో బోర్డర్‌-గవాస్కర్ టెస్టు సిరీస్‌తో పాటు, ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో జాగ్రత్తలు అవసరం” అని అన్నాడు.

ఇక గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌ జట్టుకు దూరం కాగా.. తాను ఆడిన చివరి వన్డేలో డబుల్‌ సెంచరీతో రాణించిన ఇషాన్‌ కిషన్‌కు తుదిజట్టులో అవకాశం కల్పించనున్నట్లు రోహిత్‌ వెల్లడించాడు. ‘శ్రీలంకతో సిరీస్‌లో తుది జట్టులో అవకాశం దక్కని ఇషాన్‌ కిషన్‌ ఈ సారి మిడిలార్డర్‌లో బరిలోకి దిగుతాడు’ అని పేర్కొన్నాడు.

కష్టాల కడలి దాటి వచ్చిన సిరాజ్‌..

కష్టాల కడలి దాటి.. నిరుపేద కుటుంబంలో పుట్టి.. ప్రతిభే పెట్టుబడిగా అంచలంచెలుగా ఎదిగిన మహమ్మద్‌ సిరాజ్‌.. సొంతగడ్డపై ఆడనున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో సత్తాచాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. కరోనా కష్టకాలంలో తండ్రి మృతిచెందినా.. ఆంక్షల నడుమ జాతీయ జట్టుకు ఆడటమే ముఖ్యమని తండ్రి కడచూపు కూడా నోచుకోలేదు సిరాజ్‌. ఎన్నో ఆటంకాలను దాటుకుంటూ ఇప్పుడున్న స్థాయికి చేరాడు. గతేడాది టీమిండియా తరఫున అత్యధిక వన్డే వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు ‌. ఇప్పుడు హోంగ్రౌండ్‌లో తొలి మ్యాచ్‌కు రెడీ అవుతున్నాడు. దేశవాళీల్లో తన వేగంతో ఆకట్టుకొని ఐపీఎల్‌కు ఎంపికైన సిరాజ్‌.. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో రాటుదేలి.. జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

హైదరాబాదీ బౌలర్‌ స్పెషాలిటీ ఇదే..

పొట్టి ఫార్మాట్‌లో ఒకటి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కించుకున్నా సిరాజ్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. టెస్టు సిరీస్‌లో తన దమ్మేంటే చూపాడు. ఆస్ట్రేలియా గడ్డపై అద్వితీయ ఆటతీరు కనబర్చి సుదీర్ఘ ఫార్మాట్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. బుమ్రా గైర్హాజరీలో వన్డేల్లోనూ రెగ్యులర్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. కొత్త బంతితో నిప్పులు చెరగడంతో పాటు.. అదును దొరికితే స్వింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టే ఈ హైదరాబాదీ.. ఈ ఏడాది ఆఖర్లో సొంతగడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Junior NTR | యంగ్‌ టైగర్‌ని కలిసిన టీమిండియా ఆటగాళ్లు..ఎక్కడంటే!

UPPAL STADIUM | ఉప్పల్‌ ఉప్పొంగేనా.. రేపు భారత్‌, న్యూజిలాండ్‌ తొలి వన్డే

Hockey World Cup 2023 | హాకీ వరల్డ్ కప్‌లో భారత్ – ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా

India Vs Sri Lanka | శ్రీలంక ఘోర పరాజయం.. 317 పరుగుల తేడాతో భారత్ రికార్డు విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

Hockey World Cup | ఆరంభం అదుర్స్‌.. స్పెయిన్‌పై భారత్‌ ఘనవిజయం.. హాకీ ప్రపంచకప్‌

Amartya Sen | బీజేపీకి ఎదురులేదు అనుకోవద్దు.. 2024లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర.. నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కీలక వ్యాఖ్యలు

Women’s Under 19 T20 World Cup | మహిళల అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత్ విజయం.. దంచికొట్టిన ఓపెనర్లు

Exit mobile version