Home Entertainment Love You Ram Review | లవ్‌ యూ రామ్‌ రివ్యూ

Love You Ram Review | లవ్‌ యూ రామ్‌ రివ్యూ

Love You Ram Review | సంతోషం, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కె.దశరథ్‌. కుటుంబ బంధాల విలువలను తెలుపుతూ అద్భుతమైన సినిమాలు తీసిన ఈయన ఇప్పుడు నిర్మాతగా మారాడు. తన స్నేహితుడు డీవై చౌదరితో కలిసి లవ్‌ యూ రామ్‌ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు దశరథ్‌ కథ అందిస్తే.. డీవై చౌదరి దర్శకత్వం వహించాడు. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఒకసారి చూద్దాం..

కథేంటి?

దివ్య ఓ పల్లెటూరి అమ్మాయి. చిన్నప్పుడు పరిచయమైన రామ్‌ అనే అబ్బాయిని ఇష్టపడుతుంది. నలుగురితో మాట్లాడాలన్న తెలియని ఆత్మన్యూనత భావంతో బాధపడే తనను మార్చినందుకు అతన్ని ఆరాధిస్తుంది. అతను చెప్పిన మాటలను ఫాలో అవుతూ అందరికీ సాయం చేస్తూ ఉంటుంది. అయితే చిన్నతనంలోనే దివ్యకు దూరమైన రామ్‌.. నార్వేలో సెటిలవుతాడు. అక్కడే హోటల్‌ బిజినెస్‌లు చేస్తూ దివ్యను మరిచిపోతాడు. ఈ క్రమంలో అనుకోకుండా రామ్‌ నుంచి దివ్యకు మ్యారేజి రిక్వెస్ట్‌ వస్తుంది. చిన్నతనం నుంచి తాను ఎంతగానో ఇష్టపడుతున్న రామ్‌ నుంచే పెళ్లి సంబంధం రావడంతో మురిసిపోయి.. అతనితో పెళ్లికి ఓకే చెబుతోంది. కానీ పెళ్లికి కొద్ది క్షణాల ముందు రామ్‌ గురించి ఓ నిజం తెలుసుకుంటుంది. చిన్నతనంలో తనకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన రామ్‌.. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని తెలుస్తోంది. తనతో పెళ్లి ప్రపోజల్‌ వెనుక కూడా పెద్ద కుట్ర ఉందని తెలిసి దివ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రామ్‌లో మళ్లీ మార్పు తీసుకొచ్చిందా? ఇంతకీ ప్రేమే జీవితం అని చెప్పిన రామ్‌.. నమ్మించడమే జీవితం అనేలా ఎందుకు మారాడు? అనేది మిగతా కథ!

ఎలా ఉందంటే..

నేను బాగుంటే చాలు అని స్వార్థంతో బతికే హీరో.. చుట్టూ ఉన్న వాళ్లంతా నా వాళ్లే అనుకునే హీరోయిన్‌.. వాళ్లిద్దరూ కలుసుకోవడం.. హీరోయిన్‌తో కొద్ది రోజుల ట్రావెల్‌ తర్వాత హీరోలో మార్పు రావడం చాలా సినిమాల్లోనే చూశాం. ముఖ్యంగా దశరథ్‌ డైరెక్షన్‌లో గతంలో వచ్చిన మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, గ్రీకువీరుడు వంటి సినిమాలు ఈ కాన్సెప్ట్‌తోనే వచ్చాయి. ఇప్పుడు ఇదే లైన్‌ను కొంచెం అటు ఇటుగా మార్చి కొత్త కథను సిద్ధం చేశాడు దశరథ్‌. ఆవు పాలిస్తుంది.. కోడి గుడ్డు పెడుతుంది.. కానీ ఏ ప్రయోజం లేని కుక్కను వాటికంటే ఎక్కువగా ఎందుకు ఇష్టపడతాం.. ఎందుకంటే అది మనపై చూపించే అన్‌కండీషనల్‌ లవ్‌ దానికి కారణం. మనిషి కూడా అంతే ఎదుటివారిపై నిస్వార్థంగా ప్రేమను చూపిస్తేనే తనను వాళ్లు ఇష్టపడతారు. అన్న ఒక్క లైన్‌తో లవ్‌ యూ రామ్‌ సినిమా స్టోరీని ప్రిపేర్‌ చేశాడు దశరథ్‌.

దశరథ్‌ మనసులో నుంచి వచ్చిన కథను సినిమాగా తెరకెక్కించడంలో డీవై చౌదరి కూడా సక్సెస్‌ అయ్యాడనే చెప్పొచ్చు. డీవై చౌదరి డైరెక్టర్‌ అయినప్పటికీ సినిమా చూస్తున్నంతసేపు దశరథే ఈ సినిమా డైరెక్ట్‌ చేశారేమో అన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఫస్టాఫ్‌ అంతా కామెడీగా సాగిపోతుంది. తన వ్యాపారంలో లాభం కోసం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం.. అందుకోసం మ్యాట్రిమోని వెబ్‌సైట్లు వెతికి టాప్‌ 5 అమ్మాయిలను సెలెక్ట్‌ చేసుకోవడం వంటి సీన్లు నవ్వు తెప్పిస్తాయి. చాలావరకు సీన్లు ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది. ఫస్టాప్‌లో కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్‌కి వచ్చేసరికి మళ్లీ కథ ఊపందుకుంటుంది. రామ్ ఎలా మారతాడు? దివ్య ప్రేమను అర్థం చేసుకుంటాడా అని క్యూరియాసిటీతో ఉన్న ప్రేక్షకులకు సెకండాఫ్ నిరాశ పరిచిందనే చెప్పొచ్చు. రామ్, దివ్య మధ్య కొన్ని సీన్లు బాగానే ఉన్నాయి. కానీ మరిన్ని బలమైన సీన్లు పడాల్సింది. సెకండాఫ్‌ నిడివి తక్కువగా ఉండటంతో ఇంత తొందరగానే సినిమా అయిపోయిందా అనే ఫీలింగ్‌ వస్తుంది. క్లైమాక్స్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. సినిమా మేకింగ్‌లో డైరెక్టర్‌ అక్కడక్కడా తడబడ్డప్పటికీ ఓవరల్‌గా ఫర్వాలేదనిపిస్తుంది. డైలాగులు బాగున్నాయి. పాటలు మళ్లీ మళ్లీ వినేలా లేకపోయినప్పటికీ.. కథలో అలా సాగిపోతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఎవరెలా చేశారంటే..

కొత్త నటీనటులు అయినప్పటికీ రోహిత్‌ బెహల్‌, అపర్ణ బాగా చేశారు. రోహిత్‌ చూడ్డానికి బాగున్నాడు. యాక్టింగ్‌పరంగా కూడా ఫర్వాలేదనిపించాడు. అపర్ణ కూడా అందంగా కనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. బెనర్జీ కూడా తన క్యారెక్టర్‌కు న్యాయం చేశాడు. వ్యసనాలకు బానిసైన బాధ్యతలేని తండ్రి పాత్రలో లీనమయ్యాడు. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దశరథ్‌ గురించి. ఈ సినిమా మొత్తంలో ఆయన చేసిన కేసీ క్యారెక్టరే గుర్తుండిపోతుంది. గతంలో బ్రహ్మానందం చేసిన పాత్రలను ఇన్‌స్పైరై ఈ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేసినట్టు అనిపిస్తుంది. అమాయకపు పార్టనర్‌ కేసీగా జీవించాడు. హీరో కనిపించిన దాదాపు ప్రతి సీన్‌లోనూ దశరథ్‌ కనిపిస్తాడు. తాను స్క్రీన్‌పై ఉన్న ప్రతి సీన్‌లోనూ నవ్వించే ప్రయత్నం చేశాడు.

బలాలు

+ స్టోరీ

+ దశరథ్ కామెడీ

బలహీనతలు

– క్లైమాక్స్

చివరగా.. దశరథ్‌ మార్క్‌ సినిమా ఇదీ..!

Exit mobile version