Home Latest News Jio Airfiber | మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైన జియో.. ఈసారి ACT, Hathway కూడా...

Jio Airfiber | మరో బాంబు పేల్చేందుకు సిద్ధమైన జియో.. ఈసారి ACT, Hathway కూడా దిగిరావాల్సిందేనా!

Jio Airfiber | టెలికం రంగంలోకి వచ్చి రాగానే జియో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా తక్కువ ధరలకే అపరిమిత కాల్స్‌, ఇంటర్నెట్‌ సదుపాయాలను కస్టమర్లకు అందించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అప్పటిదాకా కాల్స్‌ చేయాలన్నా.. ఇంటర్నెట్‌ వినియోగించుకోవాలన్నా కస్టమర్ల నుంచి వందలకు వందలు దండుకునే టెలికం కంపెనీలను కుదేలు చేసింది. జియో దెబ్బతో నష్టాలను భరించలేక పలు టెలికం కంపెనీలు మూసేసే స్థితికి వచ్చేశాయి. అప్పుడు టెలికం రంగంలో చేసినట్టుగానే.. ఇప్పుడు ఇంటర్నెట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల్లోనూ మళ్లీ అలాంటి ప్రభంజనమే సృష్టించేందుకు జియో సిద్ధమైంది. ఎలాంటి కేబుల్‌ వైర్‌ కనెక్షన్‌ లేకుండానే హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందించేందుకు జియో ఎయిర్‌ఫైబర్‌ను తీసుకురాబోతోంది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 19వ తేదీన జియో ఎయిర్‌ఫైబర్‌ సర్వీసును ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది.

జియో ఎయిర్‌ఫైబర్‌ అంటే ఏంటి?

జియో ఎయిర్‌ఫైబర్‌ అనేది వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సర్వీస్‌. అంటే ఎలాంటి ఆప్టికల్‌ ఫైబర్‌ కనెక్షన్‌ లేకుండానే హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందించే సాధనం అన్నమాట. సాధారణంగా బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌తో పోలిస్తే వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ తక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ఇండ్లలో, ఆఫీసుల్లో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌నే వినియోగిస్తుంటారు. కానీ జియో ఎయిర్‌ఫైబర్‌లో అలా ఉండదు. ఇది ఆప్టికల్‌ ఫైబర్‌ కంటే కూడా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందిస్తుంది. 5జీ టెక్నాలజీ సహాయంతో ఇది దాదాపు 1.5జీబీపీఎస్‌ వరకు స్పీడ్‌తో ఇంటర్నెట్‌ను అందిస్తుంది. పైగా మామూలు ఇంటర్నెట్‌ రూటర్లతో పోలిస్తే దీని రేంజ్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. దాదాపు వెయ్యి చదరపు అడుగుల వరకు ఇది కవర్‌ చేయగలదు. కాబట్టి కేవలం ఇంట్లో కాకుండా ఆఫీసుల్లో కూడా ఈజీగా వీటిని ఉపయోగించుకోవచ్చు.

జియో ఫైబర్‌ ఉండగా.. ఎయిర్‌ఫైబర్‌ ఎందుకు?

ఈ అనుమానం చాలామందికే వచ్చి ఉంటుంది. జియో ఫైబర్‌ ఉండగా ఎయిర్‌ఫైబర్‌ను రిలయన్స్‌ ఎందుకు తీసుకొస్తుందంటే దానికి ఓ కారణం ఉంది. నిజానికి జియోఫైబర్‌కు దేశవ్యాప్తంగా మంచి డిమాండే ఉంది. ఇప్పటికే కోటి మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు. కానీ దేశవ్యాప్తంగా అందరికీ ఈ సేవలు అందించడం సాధ్యపడటం లేదు. హైదరాబాద్‌ వంటి మహానగరాల శివారులతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇప్పటికీ జియో ఫైబర్‌ సేవలు అందుబాటులోకి రాలేదు. ఇక మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయా ప్రాంతాలకు ఆప్టికల్‌ కేబుల్స్‌ను వేయడం ఒక సవాలుగా మారింది. అందుకే రిలయన్స్‌ కంపెనీ జియో ఎయిర్‌ఫైబర్‌ను తీసుకొచ్చింది. ఈ ఎయిర్‌ఫైబర్‌తో కస్టమర్లను సునాయసంగా చేరుకోవచ్చు.

జియో ఎయిర్‌ఫైబర్‌ కస్టమర్లను ఆకట్టుకుంటుందా?

జియో ఫైబర్‌ మాత్రమే కాదు వేరే ఏ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ తీసుకోవాలన్నా ముందు సదరు బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీకి రిక్వెస్ట్‌ పెట్టుకోవాలి. అప్పుడు ఒక టెక్నీషియన్‌ వచ్చి మన ఇంటి వరకు వైరింగ్‌ లాగుతారు. మరో టెక్నీషియన్‌ వచ్చి ఇన్‌స్టాలేషన్‌ చేసి వెళ్తారు. దీనికి చాలా సమయం పడుతుంది. కానీ ఎయిర్‌ఫైబర్‌తో అలాంటి ఇబ్బందులేవీ లేదు. నేరుగా జియో స్టోర్‌కు వెళ్లి డివైజ్‌ను కొనుక్కొని వచ్చి ప్లగ్‌ ఇన్‌ చేస్తే సరిపోతుంది. దగ్గరలో ఉన్న సెల్‌ఫోన్ టవర్‌ సిగ్నల్‌ను ఉపయోగించుకుని 5జీ టెక్నాలజీ సహాయంతో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ప్లగ్‌ అండ్‌ ప్లే నే కాబట్టి జియో ఎయిర్‌ఫైబర్‌ను కేవలం ఇంట్లోనే కాకుండా ఎక్కడికైనా తీసుకెళ్లి ఉపయోగించుకునే ఛాన్స్‌ ఉంటుంది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర డివైజ్‌లతో పోలిస్తే దీని ధర 20 శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి కస్టమర్లను ఈజీగా ఆకట్టుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బెనిఫిట్స్‌ ఇవే..

హైస్పీడ్‌ ఇంటర్నెట్‌తో పాటు సురక్షితమైన బ్రౌజింగ్‌ కోసం జియో ఎయిర్‌ఫైబర్‌ ఇతర సర్వీసులను కూడా అందిస్తున్నది. వాటిలో ముఖ్యమైనది పేరేంట్‌ కంట్రోల్‌ టూల్‌. దీని ద్వారా తమ నెట్‌వర్క్‌లో ఎలాంటి కంటెంట్‌ చూడాలి? ఏ వెబ్‌సైట్‌లకు చూడకూడదనేది మేనేజ్‌ చేయొచ్చు. నిర్దిష్ట వెబ్‌సైట్లను డివైజ్‌లను బ్లాక్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పైగా ఇది వైఫై 6 టెక్నాలజీతో పనిచేస్తుంది కాబట్టి దీనికి కనెక్ట్‌ అయిన డివైజ్‌లు మరింత మెరుగ్గా ఇంటర్నెట్‌ సేవలు పొందవచ్చు. జియో ఎయిర్‌ఫైబర్‌లో జియో సెట్‌టాప్‌ బాక్స్‌ కూడా సమ్మిళితమై ఉంటుంది. కాబట్టి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉపయోగించుకోవడంతో పాటు టీవీ ఛానల్స్‌నుచూసే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ డివైజ్‌ ధరను రిలయన్స్‌ కంపెనీ ఇప్పటివరకు ప్రకటించలేదు కానీ. దీని ధర. దాదాపు రూ.6వేలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇతర కంపెనీలకు ఎందుకంత ఇబ్బంది?

టెలికం రంగంలోకి జియో వచ్చినప్పుడు ఎయిర్‌టెల్‌, ఐడియా, వోడాఫోన్‌ వంటి టెలికం సంస్థలు ఎలా అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నాయో.. ఇప్పుడు యాక్ట్‌, హాత్‌వే, ఎయిర్‌టెల్‌ వంటి బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు కూడా అలాంటి గడ్డు పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎయిర్‌ఫైబర్‌ జియోకి సంబంధించి తమ సొంత 5జీ టెక్నాలజీని వాడుకుంటుంది. A నిర్మాణంపై పనిచేస్తూ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. కానీ భారతీ ఎయిర్‌టెల్‌ వంటివి 4జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో NSA విధానంపై పనిచేస్తుంది. కాబట్టి జియో అందించింనంత హైస్పీడ్‌తో విశ్వసీయతను మిగిలిన కంపెనీలు ఇవ్వడం సాధ్యపడదు. దీంతో మిగిలిన బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీలకు జియో గట్టి పోటీగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version