Home Latest News India Vs Sri Lanka | శ్రీలంక ఘోర పరాజయం.. 317 పరుగుల తేడాతో భారత్...

India Vs Sri Lanka | శ్రీలంక ఘోర పరాజయం.. 317 పరుగుల తేడాతో భారత్ రికార్డు విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

Image Source: Indian Cricket Team Facebook

India Vs Sri Lanka | శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ రికార్డు విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. 391 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక మూడంకెల స్కోరు కూడా చేయలేక చేతులెత్తేసింది. 22 ఓవర్లలో 73 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. గాయం కారణంగా వాండర్సే బ్యాటింగ్‌కు దిగలేదు. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. సిరాజ్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. భారత బౌలర్ల దాటికి శ్రీలంక బ్యాటర్లు టపటపా వికెట్లు సమర్పించుకున్నారు. రజిత (13 ) ఫెర్నాండో ( 19), శనక ( 11 ) తప్పితే శ్రీలంక బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో 317 పరుగుల తేడాతో శ్రీలంక ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే మొదటి రెండు వన్డేల్లో ఓటమితో శ్రీలంక సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు మూడో వన్డేలోనూ ఓటమి పాలైంది.

భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు, షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంకను సిరాజ్ దెబ్బతీశాడు. మ్యాచ్ రెండో ఓవర్లోనే సిరాజ్ దెబ్బతీశాడు. ఫెర్నాండో ఒక్క పరుగుకే ఔటయ్యాడు. నాలుగో ఓవర్‌లో సిరాజ్ బంతితో మరోసారి మాయ చేశాడు. నాలుగో ఓవర్ చివరి బంతికి కుశాల్ మెండిస్ ( 4) వికెట్ తీయడంతో శ్రీలంక కష్టాల్లో పడింది. ఏడో ఓవర్లో షమీ బౌలింగ్‌లో అసలంక ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఇక ఎనిమిదో ఓవర్‌లో నువనిదు ఫెర్నాండో ( 19 )ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పదో ఓవర్‌లో హసరంగ ( 1 ) ను కూడా సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో శ్రీలంక 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక 12వ ఓవర్లో సిరాజ్ అద్భుతమైన త్రోతో కరుణ రత్నెను రనౌట్ అయ్యాడు. 15 వ ఓవర్లో శనకను ( 11 ) కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 15 ఓవర్లకే ఏడు వికెట్లు కోల్పోయింది. 16 ఓవర్లో షమీ బౌలింగ్‌లో వెల్లలగే ( 3 ) పరుగులకే ఔటయ్యాడు.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగిపోయారు. కోహ్లీ 110 బంతుల్లో 166 పరుగులతో శ్రీలంకకు విశ్వరూపం చూపించాడు. వీటిలో 13 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 97 బంతుల్లో 116 పరుగులతో రెచ్చిపోయాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 42 పరుగలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 38 పరుగులు, కేఎల్ రాహుల్ 7 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 4 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార, రజిత తలో రెండు వికెట్లు తీశారు. కరుణ రత్నె ఒక వికెట్ తీశాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Amartya Sen | బీజేపీకి ఎదురులేదు అనుకోవద్దు.. 2024లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర.. నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కీలక వ్యాఖ్యలు

Women’s Under 19 T20 World Cup | మహిళల అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత్ విజయం.. దంచికొట్టిన ఓపెనర్లు

Rajamouli | ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్.. బాలీవుడ్ హీరోపై చేసిన కామెంట్స్‌పై రాజమౌళి వివరణ

CM KCR | టీచర్లకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక.. రెండు రోజుల్లో షెడ్యూల్

Exit mobile version