Home Latest News IND vs AUS | బెడిసి కొట్టిన భారత వ్యూహం.. స్పిన్‌ ఉచ్చులో చిక్కి తొలి...

IND vs AUS | బెడిసి కొట్టిన భారత వ్యూహం.. స్పిన్‌ ఉచ్చులో చిక్కి తొలి ఇన్నింగ్స్‌లో 109 ఆలౌట్‌

IND vs AUS | టైమ్‌ 2 న్యూస్‌, ఇండోర్‌: ‘ఎవరు తీసిన గోతిలో వారే పడుతారు’ అన్న చందంగా టీమిండియా స్పిన్‌ ఉచ్చులో చిక్కుకొని విలవిల్లాడింది. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు నెగ్గిన రోహిత్‌ సేన.. బుధవారం ఇండోర్‌ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పూర్తిగా విఫలమైంది. తొలి రోజు నుంచే అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. స్టార్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఇండోర్‌ టెస్టులో టీమ్‌ఇండియా రెండు సెషన్లు కూడా నిలువలేకపోయింది. సిరీస్‌లో తొలిసారి టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ మొదట బ్యాటింగ్‌ ఎంచుకోగా.. మనవాళ్లు కనీస పోరాటం కనబర్చకుండా పెవిలియన్‌కు వరుస కట్టారు. 22 పరుగులు చేసిన మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టాప్‌ స్కోరర్‌ కాగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (12), శుభ్‌మన గిల్‌ (21), చతేశ్వర్‌ పుజారా (1), రవీంద్ర జడేజా (4), శ్రేయస్‌ అయ్యర్‌ (0), శ్రీకర్‌ భరత్‌ (17), అక్షర్‌ పటేల్‌ (12 నాటౌట్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌ (3) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కునేమన్‌ 5, లియాన్‌ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌.. బుధవారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా (60) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. లబుషేన్‌ (31), స్టీవ్‌ స్మిత్‌ (26) ఫర్వాలేదనిపించారు. మన బౌలర్లలో జడేజా 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. చేతిలో 6 వికెట్లు ఉన్న ఆసీస్‌.. ప్రస్తుతం భారత స్కోరు కంటే 47 పరుగుల ఆధిక్యంలో ఉంది. పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (7), కామెరూన్‌ గ్రీన్‌ (6) క్రీజులో ఉన్నారు.

పూజారా ఒక్కడు తప్ప..

సాధారణంగా ఇండోర్‌ పిచ్‌ తొలిరోజు పేసర్లకు సహకరిస్తుందనే అంచనాలు వెలువడగా.. అందుకు పూర్తి భిన్నంగా తొలి ఓవర్‌ నుంచే ఈ వికెట్‌పై స్పిన్నర్లు ప్రభావం చూపారు. తొలి ఓవర్‌లోనే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ కునేమన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు క్రీజు వదిలి బయటకు వచ్చి స్టంపౌట్‌ అయ్యాడు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. కేఎల్‌ రాహుల్‌ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఎక్కువసేపు నిలువలేకపోయాడు. స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. ఇక సీనియర్‌ ప్లేయర్‌ చతేశ్వర్‌ పుజారా.. లియాన్‌కు దొరికిపోయాడు. భారత ఇన్నింగ్స్‌లో ఈ ఒక్క బంతే ఊహించని విధంగా టర్న్‌ అయిందని వ్యాఖ్యతలు సైతం పేర్కొనగా.. మిగిలిన వాళ్లు కాస్త నిలదొక్కుకుంటే పరుగులు చేయడం పెద్ద కష్టం కాని పిచ్‌పై అప్పనంగా వికెట్‌ సమర్పించుకున్నారు. ఇక ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా.. కోహ్లీ క్రీజులో కుదురుకోవడంతో అభిమానుల్లో ఏమూలో చిన్న ఆశ. రన్‌మెషీన్‌ అదుకోక పోతాడా అనుకుంటే.. మార్ఫే బౌలింగ్‌లో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈసారి లోయర్‌ ఆర్డర్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

ICC Rankings | అగ్రస్థానానికి భారత ఆఫ్‌ స్పిన్నర్‌.. ఐసీసీ టాప్‌ ర్యాంక్‌ దక్కించుకున్న రవిచంద్రన్‌ అశ్విన్‌

Jasprit Bumrah | ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ సీజన్‌కు దూరమైన స్టార్ పేసర్..

Lionel Messi | రోనాల్డోను సమం చేసిన అర్జెంటీనా సాకర్ దిగ్గజం.. ఫిఫా బెస్ట్ ప్లేయర్‌గా లియోనల్ మెస్సీ

NZ vs ENG | కివీస్‌ కొత్త చరిత్ర.. ఫాలోఆన్‌ నుంచి కోలుకొని ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌

Sachin Tendulkar | సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం.. వాంఖడేలో మాస్టర్ నిలువెత్తు విగ్రహం

Exit mobile version