Home Latest News NZ vs ENG | కివీస్‌ కొత్త చరిత్ర.. ఫాలోఆన్‌ నుంచి కోలుకొని ఇంగ్లండ్‌ను చిత్తు...

NZ vs ENG | కివీస్‌ కొత్త చరిత్ర.. ఫాలోఆన్‌ నుంచి కోలుకొని ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌

NZ vs ENG | టైమ్‌ 2 న్యూస్‌, వెల్లింగ్టన్‌: 146 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమం అనదగ్గ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ అద్వితీయ విజయం సాధించింది. ‘బజ్‌ బాల్‌ క్రికెట్‌’ పేరుతో దంచికొట్టడమే పరమావధిగా దూసుకెళ్తున్న ఇంగ్లిష్‌ జట్టును.. కివీస్‌ నేలకు దించింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో సంయమనం ఎంత ముఖ్యమో ఈ మ్యాచ్‌ మరోసారి నిరూపించింది. టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిందనే వాళ్లకు న్యూజిలాండ్‌.. సుదీర్ఘ ఫార్మాట్‌లోని అసలు సిసలు మజా చూపింది. టెస్టు క్రికెట్‌ హిస్టరీలో ఫాలోఆన్‌లో నుంచి కోలుకొని విజయం సాధించిన మూడో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. గతంలో ఇంగ్లండ్, భారత్‌ మాత్రమే ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు న్యూజిలాండ్‌ ఆ జాబితాలో చోటు దక్కించుకుంది. ఒక పరుగు తేడాతో టెస్టు గెలువడం ఇది రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా మంగళవారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్‌ అద్వితీయ విజయం సాధించింది. క్రీడాభిమానులకు పసందైన విందు పంచిన పోరులో కివీస్‌ ఒక పరుగు తేడాతో ఇంగ్లిష్‌ జట్టును చిత్తు చేసింది.

ఇంగ్లండ్‌ అతివిశ్వాసం..

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. 435/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 209 పరుగులకు ఆలౌటైంది. భారీ ఆధిక్యం మూటగట్టుకున్న ఇంగ్లండ్‌.. ప్రత్యర్థిని ఫాలోఆన్‌కు ఆహ్వానించగా.. తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన కివీస్‌ ఆటగాళ్లు.. ఈసారి దుమ్మురేపారు. సీనియర్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ సెంచరీతో చెలరేగగా.. మిగిలినవాళ్లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఫలితంగా న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగులు చేసింది. ఇక 258 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌.. చివరకు 256 పరుగులు చేసి ఆలౌటైంది. జో రూట్‌ (95) ఒంటరి పోరాటం చేయగా.. బెన్‌ స్టోక్స్‌ (33), బెన్‌ ఫోక్స్‌ (35), బెన్‌ డకెట్‌ (33), క్రాలీ (24) ఓ మాదిరిగా ఆడారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో నీల్‌ వాగ్నర్‌ 4, కెప్టెన్‌ టిమ్‌ సౌథీ 3 వికెట్లు పడగొట్టారు. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ 1-1తో సమమైంది. కేన్‌ విలియమ్సన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’… ఇంగ్లండ్‌ ప్లేయర్‌ హ్యారీ బ్రూక్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కించుకున్నారు.

1-టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఓ జట్టు ఒక పరుగు తేడాతో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 1993లో అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ పరుగు తేడాతో గెలుపొందింది.

4-ఫాలోఆన్‌ ఆడిన జట్టు టెస్టు నెగ్గడం 146 ఏండ్ల క్రికెట్‌ చరిత్రలో ఇది నాలుగోసారి మాత్రమే. 1894 సిడ్నీ టెస్టులో ఫాలోఆన్‌ నుంచి బయటపడి కంగారూలను చిత్తుచేసిన ఇంగ్లండ్‌.. 1981 లీడ్స్‌లో సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేసింది. ఇక ఆ తర్వాత భారత జట్టు 2001 కోల్‌కతా టెస్టులో ఫాలోఆన్‌ ఆడి ఆసీస్‌ను ఓడించింది.

Exit mobile version