Home Latest News ICC Rankings | అగ్రస్థానానికి భారత ఆఫ్‌ స్పిన్నర్‌.. ఐసీసీ టాప్‌ ర్యాంక్‌ దక్కించుకున్న రవిచంద్రన్‌...

ICC Rankings | అగ్రస్థానానికి భారత ఆఫ్‌ స్పిన్నర్‌.. ఐసీసీ టాప్‌ ర్యాంక్‌ దక్కించుకున్న రవిచంద్రన్‌ అశ్విన్‌

ICC Rankings | టైమ్‌ 2 న్యూస్‌, దుబాయ్‌: భారత అగ్రశ్రేణి ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరాడు. ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు (న్యూఢిల్లీ వేదికగా)లో దుమ్మురేపిన అశ్విన్‌ నంబర్‌వన్‌ ప్లేస్‌కు దూసుకెళ్లాడు. గత వారం నాలుగు పదుల వయసులో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌కు చేరి అరుదైన ఘనత సాధించిన ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌.. రెండో స్థానానికి పడిపోయాడు.

ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ఆడుతుండగా.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ పరుగు తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలంగా భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న 36 ఏళ్ల అశ్విన్‌ 2015లో తొలిసారి సుదీర్ఘ ఫార్మాట్‌లో నంబర్‌వన్‌ స్థానానికి చేరాడు. ఆ తర్వాత చాలాసార్లు తొలి ర్యాంక్‌ దక్కించుకున్న అశ్విన్‌ ప్రస్తుతం.. 864 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జేమ్స్‌ అండర్సన్‌ (859 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. టాప్‌-10 టీమిండియా నుంచి అశ్విన్‌తో పాటు జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా చోటు దక్కించుకున్నారు. గాయం కారణంగా చాన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంటున్న ఏస్‌ పేసర్‌ బుమ్రా 795 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. జడేజా ఓ స్థానం మెరుగు పర్చుకొని 8వ ర్యాంక్‌కు చేరాడు. ఆస్ట్రేలియా రెగ్యులర్‌ కెప్టెన్‌ కమిన్స్‌ (858 పాయింట్లు) మూడో ప్లేస్‌లో ఉన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మన బౌలర్లు సత్తాచాటినా.. బ్యాటర్లు మాత్రమ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తాజా సిరీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడలో విఫలమవుతున్న టీమిండియా బ్యాటర్లు టాప్‌-5లో చోటు దక్కించుకోలేకపోయారు. భారత్‌ నుంచి అత్యుత్తమంగా రిషబ్‌ పంత్‌ ఎనిమిదో ర్యాంక్‌లో ఉండగా.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో సెంచరీ చేసిన రోహిత్‌ శర్మ తొమ్మిదో ప్లేస్‌లో నిలిచాడు. ఆసీస్‌ వన్‌డౌన్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ నంబర్‌వన్‌ ప్లేస్‌లో ఉండగా.. స్టీవ్‌ స్మిత్‌, జో రూట్‌ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ ఏకంగా 15 స్థానాలు మెరుగు పర్చుకొని భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో కలిసి సంయుక్తంగా 16వ ప్లేస్‌లో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో మాత్రం మనవాళ్లు ప్రభావం కొనసాగించారు. రవీంద్ర జడేజా టాప్‌లో ఉండగా.. అశ్విన్‌ రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్‌ స్టార్‌ జో రూట్‌ ఎనిమిదో ప్లేస్‌కు చేరాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Jasprit Bumrah | ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ సీజన్‌కు దూరమైన స్టార్ పేసర్..

Lionel Messi | రోనాల్డోను సమం చేసిన అర్జెంటీనా సాకర్ దిగ్గజం.. ఫిఫా బెస్ట్ ప్లేయర్‌గా లియోనల్ మెస్సీ

NZ vs ENG | కివీస్‌ కొత్త చరిత్ర.. ఫాలోఆన్‌ నుంచి కోలుకొని ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌

Sachin Tendulkar | సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం.. వాంఖడేలో మాస్టర్ నిలువెత్తు విగ్రహం

Exit mobile version