Home Lifestyle Do you know Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత...

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

Brain Eating Amoeba | ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తుంటే దక్షిణ కొరియాలో మరో వ్యాధి కలవరం పుట్టిస్తోంది. రెండున్నరేళ్లుగా కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటివరకు కరోనా తగ్గిపోయిందనే అందరూ అనుకున్నారు. కానీ చైనాలో ఒమిక్రాన్‌ సబ్ వేరియంట్ బీఎఫ్‌.7 విజృంభించడంతో కోట్లలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి భయాందోళనలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దక్షిణ కొరియాలో వెలుగు చూసిన కొత్త వ్యాధి ఇప్పుడు భయపెట్టేలా ఉంది. దీని వల్ల మెదడు పూర్తిగా దెబ్బతిని మనిషి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన వ్యాధి పేరు నాయ్‌గ్లేరియా ఫౌలోరీ లేదా బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా. ఈ వ్యాధికి కారణమైన అమీబాను తొలిసారి 1965లో ఆస్ట్రేలియాలో గుర్తించినట్లు అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ ( CDC ) తెలిపింది. అయితే 1962 నుంచి 2021 వరకు అమెరికాలో ఇలాంటి కేసులు 154 నమోదైతే కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని సీడీసీ వెల్లడించింది. అంటే 97 శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2018 నాటికి 381 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. ముఖ్యంగా అమెరికా, చైనా, భారత్‌లోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ఇప్పుడు దక్షిణ కొరియాలో మరోసారి వెలుగులోకి రావడం.. బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా సోకిన వ్యక్తి 10 రోజుల్లోనే మరణించడం ఇప్పుడు కలవరానికి గురిచేస్తోంది.

ఇంతకీ ఏంటీ Brain Eating Amoeba

నైగ్లేరియా ఫౌలోరీ ( Naegleria fowleri ) అనేది ఒక అమీబా. దీన్ని బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా ( Brain Eating Amoeba ) అని కూడా పిలుస్తున్నారు. ఏక కణజీవి అయిన ఈ
అమీబా వల్ల మెదడుకు ఇన్ఫెక్షన్‌ సోకుతుంది. సాధారణంగా ఇలాంటి అమీబాలు నదులు, చెరువులు, సరస్సులు, వాగుల్లో ఉంటాయి. ఏక కణ జీవులు ప్రాణాంతకమైనవి కాకపోయినా ఇది మాత్రం ప్రమాదకరమైనదే అని సీడీసీ పేర్కొంది. ఇది ముక్కు, చెవి ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుతుంది. తర్వాత అక్కడే మకాం వేసి మెదడు నరాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా ప్రైమరీ అమీబిక్‌ మెనింజోఎన్‌సెఫిలైటిస్‌ ( PAM ) అనే వ్యాధికి దారితీస్తుంది. ఇది అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడే ఈ అమీబా నీళ్ల నుంచి ముక్కు, చెవి ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మెదడుకు సోకుతుంది. అయితే ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు మాత్రం తక్కువేనని నిపుణులు చెప్పారు. అయినా అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు.

మనుషులకు ఎలా సంక్రమిస్తుంది?

కాలువలు, చెరువులు, నదుల్లో ఉండే ఈ అమీబా ముక్కు, చెవుల ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత మెదడుకు చేరుకుంటుంది. ఈ అమీబాలు ఉన్న నీటిలో ఈత కొట్టినప్పుడు కానీ అలాంటి నీటిలో తల ముంచినప్పుడు మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఈ అమీబా ఉన్న అపరిశుభ్రమై నీటితో ముఖం శుభ్రం చేసుకున్నా ముక్కు ద్వారా శరీరంలోకి చేరిపోతుంది. అయితే నీటి ఆవిరి ద్వారా నైగ్లేరియా ఫౌలోరీ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలైతే లేవని శాస్త్రవేత్తలు చెప్పారు. ఒకసారి ఇది మెదడులోకి వెళ్తే మాత్రం మెదడులోని కణాలను తినేస్తుందన్నారు. ఫలితంగా అమీబిక్‌ మెనింజోఎన్‌సెఫలైటిస్‌ (PAM) ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందన్నారు.

PAM లక్షణాలేంటి ?

ఈ వ్యాధి సోకిన 12 రోజుల్లో లక్షణాలు బయపడతాయని సీడీసీ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తలనొప్పి, వికారం, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు లక్షణాలు ముందుగా కనిపిస్తాయి. క్రమంగా జ్వరం, వాంతులు, మెడ గట్టిగా మారడం, మూర్చరావడం, గందరగోళానికి గురవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత పరిస్థితి మరింత విషమిస్తే కోమాలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి వేగంగా వ్యాపించే అవకాశం ఉందని సీడీసీ తెలిపింది. ఈ వ్యాధి కారకం మెదడు వరకు వెళ్లిన తర్వాత ఐదు రోజుల్లోనే మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయని అమెరికన్‌ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ తెలిపింది. 1962 నుంచి 2021 వరకు అమెరికాలో దీనికి సంబంధించిన కేసులు 154 నమోదైతే కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని సీడీసీ గుర్తు చేసింది.

ఎలా బయటపడింది ?

దక్షిణ కొరియాకు చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి ఈనెల 10న థాయ్‌లాండ్‌ నుంచి వచ్చాడు. అంతకుముందు నాలుగు నెలలపాటు థాయ్‌లాండ్‌లోనే ఉన్నాడు. అయితే దక్షిణ కొరియాకు వచ్చిన మరునాడే ఆస్పత్రిలో చేరాడు. గత వారం మృతి చెందాడు. తలనొప్పి, జ్వరం, వాంతులతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయే సరికి కారణం ఏంటని వైద్యలు సందేహపడ్డారు. పరీక్షలు చేశారు. పరీక్షల్లో సంచలన విషయం బయటపడింది. అతను బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా వల్లే చనిపోయాడని దక్షిణ కొరియా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ నిర్ధారించింది. దేశంలో ఈ తరహా కేసు నమోదవడం, ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఈ వ్యక్తి నివసించే ప్రాంతంలోని ప్రజలు.. చెరువులు, కాలువల్లో దిగి ఈత కొట్టవద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

దీనికి చికిత్స ఉందా ?

నైగ్లేరియా ఫౌలోరీ ఇన్ఫెక్షన్‌ అనేది అరుదైన వ్యాధి అని, ఇది సోకిన వాళ్లలో తక్కువ సమయంలోనే మెదడుపై ప్రభావం పడుతుందని సీడీసీ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు దీనికి పూర్తి స్థాయి చికిత్స అయితే అందుబాటులో లేదని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాధిని నయం చేయడానికి మాత్రం ఆంఫోటెరిసిన్‌ బీ, అజిత్రోమైసిన్‌, ఫ్లూకోనాజోల్‌, రిఫాంపిన్‌, మిల్టేఫోసిన్‌, డెక్సామీథాసోన్‌ లాంటి కొన్ని మందులను వైద్యులు ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.

వాతావరణ మార్పుల వల్లే వ్యాపిస్తుందా ?

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ఆధారంగా నైగ్లేరియా ఫౌలోరీ ఇన్ఫెక్షన్‌ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీడీసీ తెలిపింది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడే ఈ అమీబా నీటిలో వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. ఈ అమీబా 46 డిగ్రీల ఉష్గోగ్రతను కూడా తట్టుకుని విస్తరించే అవకాశం ఉందని సీడీసీ తెలిపింది. ఒక్కోసారి అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదైనా బతికే ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు పెరిగినప్పుడు నదులు, చెరువులు, సరస్సుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు ఇటీవల జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది. అలా వాతవారణంలో, నీటిలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే ఈ అమీబా వేగంగా పెరుగుతుందని సీడీసీ వెబ్‌సైట్లో పేర్కొంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Cancer | భయపెడుతున్న ఊపిరితిత్తుల కేన్సర్లు .. ఆ రాష్ట్రాల్లోనే అత్యధికం

Corona nasal spray | నాజల్ స్ప్రే వ్యాక్సిన్ ధర నిర్ణయించిన భారత్ బయోటెక్.. ప్రైవేటు ఆస్పత్రుల్లో బూస్టర్ డోస్ కోసం అంత చెల్లించాల్సిందే

Corona | చైనాలోని ఆ ఒక్క నగరంలోనే రోజుకు 10 లక్షలకు పైగా కరోనా కేసులు.. చేతులెత్తేసిన అధికారులు

Postpartum Hair loss | డెలివరీ తర్వాత జుట్టు ఊడిపోతుందా? ఈ టిప్స్‌ మీకోసమే..

Exit mobile version