Home Lifestyle Health Corona | చైనాలోని ఆ ఒక్క నగరంలోనే రోజుకు 10 లక్షలకు పైగా కరోనా కేసులు.....

Corona | చైనాలోని ఆ ఒక్క నగరంలోనే రోజుకు 10 లక్షలకు పైగా కరోనా కేసులు.. చేతులెత్తేసిన అధికారులు

Corona | చైనాలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా తయారవుతున్నాయి. ఇప్పుడా దేశంలో కోట్లలో కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఎఫ్‌.7 విజృంభనతో వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. బీజింగ్ సహా ఏ నగరంలో చూసినా శ్మశనవాటికల్లో స్థలం లేక రోడ్ల మీద మృతదేహాల క్యూలు కనిపిస్తున్నాయి. ఒక్కో నగరంలో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి.

జెజియాంగ్‌లో అయితే అధికారులు చేతులెత్తేశారు. అక్కడ రోజుకు 10 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే కాదు వారం రోజులుగా లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. స్వయంగా జెజియాంగ్‌ ప్రావిన్స్‌ ప్రభుత్వమే ఇంత భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇక కొత్త సంవత్సర వేడుకల నాటికి కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

మరోవైపు జిన్‌పింగ్‌ ప్రభుత్వం మాత్రం అక్కడి పరిస్థితులను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపేందుకు మరణాలను గణించే ప్రక్రియలోనే మార్పులు చేసింది. ఆస్పత్రులు నిండుతున్నా, శ్మశనవాటికల వద్ద మృతదేహాల క్యూ కనిపిస్తోంది. అయినా సరే.. చైనా మొత్తంగా వేలల్లోనే కేసులు నమోదవుతున్నాయని చెబుతోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసినా చైనా మాత్రం నిమ్మకునీరెత్తినట్లే ఉంటోంది.

Exit mobile version