Home Latest News IND vs AUS | రసకందాయంలో రెండో టెస్టు.. భారత్ తొలి ఇన్నింగ్స్ 262; ఆస్ట్రేలియా...

IND vs AUS | రసకందాయంలో రెండో టెస్టు.. భారత్ తొలి ఇన్నింగ్స్ 262; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 61/1

IND vs AUS | టైమ్ 2 న్యూస్, న్యూఢిల్లీ: బ్యాటర్ల పట్టుదలకు.. బౌలర్ల సహకారం తోడవడంతో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి టెస్టులో మంచి స్కోరుచేసిన ఆసీస్.. బౌలింగ్లోనూ రాణించి భారత్ను కట్టడి చేసింది. సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఐదు వికెట్లతో చెలరేగడంతో రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్లో 262 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 139/7తో పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను ఆల్రౌండర్లు అక్షర్ పటేల్ (115 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), రవిచంద్రన్ అశ్విన్ (71 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు 114 పరుగులు జోడించడంతో రోహిత్సేన ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (44), తాజా సారథి రోహిత్ శర్మ (32) ఫర్వాలేదనిపించినా.. మంచి ఆరంభాలను భారీ ఇన్నింగ్స్లుగా మలచలేకపోయారు. కేలె రాహుల్ (17) వైఫల్యాల పరంపర కొనసాగించగా.. వందో టెస్టు ఆడుతున్న చతేశ్వర్ పుజారా (0) ఏడు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరాడు. మైలురాయి మ్యాచ్లో మైమరిపిస్తాడు అని ఆశిస్తే.. అసలుకే ఎసరొచ్చింది. ఇక శ్రేయస్ అయ్యర్ (4), శ్రీకర్ భరత్ (6) విఫలం కాగా.. రవీంద్ర జడేజా (26) కాస్త పోరాడాడు. ఆసీస్ బౌలర్లలో లియాన్ 5, మార్ఫే, కునెమన్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.

ఇద్దరూ.. ఇద్దరే..

బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారీ విజయం మూటగట్టుకున్న టీమిండియాకు ఢిల్లీలో శుభారంభం దక్కలేదు. టాపార్డర్ విఫలమవడంతో రోహిత్ సేన ఒక దశలో 139/7తో నిలిచింది. మరి కొన్ని పరుగులు చేసి ఆలౌట్ కావడం ఖాయమే అని ఆసీస్ ఉత్సాహపడుతున్న సమయంలో అశ్విన్, అక్షర్ జోడీ వారి ఆశలపై నీళ్లు చల్లింది. మొదట క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యతినిచ్చిన ఈ జోడీ.. కుదురుకున్నాక ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపింది. రోహిత్, రాహుల్, పుజారా, శ్రేయస్ వంటి ప్రధాన ఆటగాళ్లు విఫలమైన చోట.. తమ విలువేంటో చాటుకుంటూ నాణ్యమైన ఇన్నింగ్స్లు ఆడారు. ఆత్మరక్షణకు పోకుండా.. కంగారూలపై ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టారు. దీంతో ఆసీస్ కెప్టెన్ కమిన్స్ గత్యంతరం లేక అటాకింగ్ ఫీల్డ్ తీసి.. డిఫెన్సివ్ ఫీల్డ్ పెట్టాల్సి వచ్చింది. ముఖ్యంగా అక్షర్ టాపార్డర్ బ్యాటర్ను తలపిస్తూ చూడ చక్కటి షాట్లతో అలరించాడు. క్రమం తప్పకుండా స్ట్రయిక్ రొటేట్ చేసిన ఈ జోడీ.. ఎనిమిదో వికెట్కు రికార్డు స్థాయిలో 114 పరుగులు జోడించింది. ఈ క్రమంలో అశ్విన్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 5 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఇక భారత్కు ఆధిక్యం దక్కడం ఖాయమే అనుకుంటున్న సమయంలో రెండో కొత్త బంతి అందుకున్న ఆస్ట్రేలియా.. పేసర్లను బరిలోకి దింపి టీమిండియా ఇన్నింగ్స్కు తెరదించింది.

దంచుడే.. దంచుడు..

అక్షర్ ఇన్నింగ్స్ స్ఫూర్తితో ఢిల్లీ పిచ్పై ఎలా బ్యాటింగ్ చేయాలో గమనించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్లో దాన్ని ఆచరణలో పెట్టింది. వన్డే తరహా ఆటతీరుతో ధాటిగా ఆడుతూ శనివారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 61/1తో నిలిచింది. గాయం కారణంగా వార్నర్ మ్యాచ్ నుంచి తప్పుకోగా.. ఓపెనర్గా అవకాశం దక్కించుకున్న ట్రావిస్ హెడ్ (39 బ్యాటింగ్), మార్నస్ లబుషేన్ (16 బ్యాటింగ్) వేగంగా ఆడారు. దాదాపు గంట పాటు క్రీజులో గడిపిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 5.08 రన్రేట్తో పరుగులు సాధించడం విశేషం. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ప్రస్తుతం ఆసీస్.. రోహిత్ సేన కంటే 62 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే మ్యాచ్ మంచి రసపట్టుకు చేరగా.. ఆదివారం తొలి సెషన్లో భారత స్పిన్ త్రయం (అశ్విన్, అక్షర్, జడేజా)ను ఆసీస్ ఎలా ఎదుర్కొంటుందనేదానిపైనే ఈ మ్యాచ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bao missing | మొన్న జాక్‌మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్‌.. చైనాలో ఏం జరుగుతోంది?

Twitter | ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లోని రెండు ఆఫీసులను మూసేసిన ట్విట్టర్‌

Chetan Sharma | మంట రేపిన మాటలు.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామ చేసిన చేతన్ శర్మ

Actor Nandu | సింగర్ గీతా మాధురి భర్త నందూకి యాక్సిడెంట్.. షాక్‌లో ఫ్యాన్స్

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Exit mobile version