Home Latest News Womens T20 World Cup | అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌కు వేళాయే.. తొలిపోరులో దక్షిణాఫ్రికాతో...

Womens T20 World Cup | అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌కు వేళాయే.. తొలిపోరులో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఢీ .. జట్టులో భద్రాచలం అమ్మాయి

Womens T20 World Cup | టైమ్‌2న్యూస్‌, న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ.. ‘ఫ్యాబ్‌-4’గా గుర్తింపు సాధించిన విరాట్‌ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌.. ఈ నలుగురు అంతకుముందు తమ తమ జట్ల తరఫున అండర్‌-19 మ్యాచ్‌లు ఆడినవాళ్లే. జాతీయ జట్టులోకి రావాలంటే ఇప్పుడంటే ఐపీఎల్‌ వంటి చక్కటి వేదిక ఉంది కానీ.. ఒకప్పుడు దేశవాళీలతో పాటు ఇలా అండర్‌-19 స్థాయిలో రాణించిన వాళ్లకే ఎక్కువ అవకాశాలు దక్కేవి.

విరాట్‌ కోహ్లీ, సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజా, ఇర్ఫాన్‌ పఠాన్‌, పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌, శివమ్‌ మావి ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ లిస్ట్‌ చాంతాడంత అవడం ఖాయం! అయితే 1988 నుంచే పురుషుల విభాగంలో అండర్‌-19 ప్రపంచకప్‌ నిర్వహిస్తున్న ఐసీసీ.. మహిళల కోసం మాత్రం ఇప్పుడే తొలిసారి మెగాటోర్నీ ఏర్పాటు చేసింది.

Womens T20 World Cup shafali verma

షెడ్యూల్‌ ప్రకారం రెండేండ్ల క్రితమే మహిళల తొలి అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ జరుగాల్సి ఉండగా.. కరోనా కారణంగా అది కాస్తా ఆలస్యమైంది. ఎట్టకేలకు దక్షిణాఫ్రికా వేదికగా శనివారం మెగాటోర్నీకి తెరలేవనుంది. 11 ఐసీసీ శాశ్వత సభ్య దేశాలతో పాటు.. మరో ఐదు జట్లు కలిపి మొత్తం 16 టీమ్‌లో ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాయి. ఆతిథ్య దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్‌, యూఏఈతో కలిసి భారత జట్టు గ్రూప్‌-‘డి’ నుంచి పోటీ పడుతోంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.

గ్రూప్‌ దశలో టాప్‌-3లో నిలిచిన జట్లు.. సూపర్‌-6కు అర్హత సాధిస్తాయి. ఇందులో రెండు గ్రూప్‌లుగా మ్యాచ్‌లు నిర్వహిస్తారు. వాటిలో టాప్‌-2లో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరుతాయి. ఈ నెల 29న ఫైనల్‌ జరుగనుంది. మెరికల్లాంటి అమ్మాయిలతో కూడిన టీమిండియాకు షఫాలీ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

జట్టులో భద్రాచలం అమ్మాయి

పదేండ్ల ప్రాయం నుంచే పరుగుల వరద పారిస్తూ.. ఆడిన ప్రతి మ్యాచ్‌లో రాణిస్తూ.. అంచలంచెలుగా ఎదిగిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష.. అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడంతో పాటు అవసరమైతే బంతితోనూ మాయ చేయగల త్రిష.. మిథాలీరాజ్‌ వారసత్వాన్ని కొనసాగించాలని చూస్తోంది. ఇక ఈ జట్టుకు నాయకత్వం వహిస్తున్న షఫాలీ వర్మ.. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు సాధించింది. సీనియర్‌ జట్టు తరఫున ఎన్నో మ్యాచ్‌లాడిన షఫాలీ అండర్‌-19 జట్టుకు టైటిల్‌ అందించాలని కృతనిశ్చయంతో ఉంది. బిగ్‌ హిట్టింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ కూడా జట్టులో ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి మహమ్మద్‌ షబ్నమ్‌ బౌలర్‌గా ఎంపికైంది.

సచిన్‌ ఏమన్నాడంటే..

అమ్మాయిల కోసం ఐసీసీ నిర్వహిస్తున్న మెగాటోర్నీ యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కొనియాడాడు. ‘అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే అవకాశం రావడం ఆనందంగా ఉంది. మన అమ్మాయిల్లో టైటిల్‌ నెగ్గే సత్తా ఉంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో చక్కటి నైపుణ్యం ఉన్న ప్లేయర్లు జట్టులో ఉన్నారు. మహిళల కోసం తొలిసారి అండర్‌-19 ప్రపంచకప్‌ నిర్వహించడం ఆనందంగా ఉంది. ఇది యువ క్రీడాకారిణులకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని సచిన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. భారత జట్టుకు విజయావకాశాలున్నాయన్న మాస్టర్‌.. మిగిలిన జట్లకు కూడా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. మెగాటోర్నీలో పాల్గొంటున్న 16 జట్ల కెప్టెన్లు జొహన్నెస్‌బర్గ్‌లో నెల్సన్‌ మండేలా స్క్వేర్‌లో నిర్వహించిన ఫొటో షూట్‌లో పాల్గొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hockey World Cup | ఆరంభం అదుర్స్‌.. స్పెయిన్‌పై భారత్‌ ఘనవిజయం.. హాకీ ప్రపంచకప్‌

Rajashree Swain | ఇద్దరు క్రికెటర్లు మృతి.. అడవిలో అనుమానస్పదంగా మహిళా క్రికెటర్ మృతదేహం.. ఆత్మహత్యా ? హత్యా ?

KL Rahul | దేనికైనా రెడీ.. ఐదోస్థానంలో బ్యాటింగ్‌పై కేఎల్ రాహుల్‌ స్పందన

Prithvi Shaw | పృథ్వీ షాకు ప్రోత్సాహం సరే.. టీమిండియా జట్టులో చోటు మాటేంటి?

Exit mobile version