Home Latest News Prithvi Shaw | పృథ్వీ షాకు ప్రోత్సాహం సరే.. టీమిండియా జట్టులో చోటు మాటేంటి?

Prithvi Shaw | పృథ్వీ షాకు ప్రోత్సాహం సరే.. టీమిండియా జట్టులో చోటు మాటేంటి?

Image Source : Twitter/ANI-Digital

Prithvi Shaw | టైమ్ టు న్యూస్, ముంబై: బుడి బుడి అడుగుల వయసులోనే అనితర సాధ్యమైన రికార్డులు ఖాతాలో వేసుకొని భవిష్యత్తు సచిన్‌ టెండూల్కర్‌ అనిపించుకున్న ముంబై యువ ఓపెనర్‌ పృథ్వీ షా.. టీమిండియాలో సుస్థిర స్థానం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. తనకంటే వెనుక వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి వాళ్లు భారత జట్టులో పాగా వేస్తుంటే.. ఈ ముంబైకర్‌ మాత్రం రేసులో వెనుకబడిపోయాడు. జాతీయ జట్టు తరఫున ఆడిన తొలి టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న పృథ్వీ ఆ తర్వాత ఫిట్‌నెస్‌, ఫామ్‌ లేమి, సరైన గైడెన్స్‌ లేని కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. క్రీజులో కుదురుకుంటే మంచి నీళ్ల ప్రాయంగా బౌండరీలు బాదగల సామర్ధ్యం ఉన్న ఈ మరాఠా ఓపెనర్‌.. రంజీ ట్రోఫీలో విశ్వ రూపం కనబర్చాడు. భారత జట్టులోకి ఎందరో కొత్త ఆటగాళ్లు వచ్చి పోతున్నా.. సెలెక్టర్లు తనను పట్టించుకోకపోవడంతో గతంలో సామాజిక మాధ్యమాల వేదికగా చలోక్తులు విసిరిన ఈ ఓపెనర్‌.. తాజాగా అస్సాంతో జరిగిన పోరులో రంజీల్లో రెండో అత్యధిక స్కోరు తన పేరిట రాసుకున్నాడు.

సుడిగాలి ఇన్నింగ్స్‌..

దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ గ్రూప్‌-‘బి’లో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా వీరవిహారం చేశాడు. హెచ్చరికలు లేని సునామీలా విరుచుకుపడి అస్సాం బౌలర్ల అనుభవ రాహిత్యాన్ని సొమ్ము చేసుకుంటూ 383 బంతుల్లో 379 పరుగులు చేశాడు. అందులో 49 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. క్రీజులో కాలు పెట్టిందే తడవు బౌలర్ల పై యుద్ధం ప్రకటించే ఈ ముంబై బుడ్డోడు.. అస్సాం బౌలర్లను ఊచకోత కోశాడు. టీ20 తరహా ఆటతీరుతో వంద, రెండొందలు, మూడొందలు ఇలా దంచుతూ పోయాడు. క్వాట్రపుల్‌ సెంచరీ చేయడం ఖాయం అనుకుంటున్న దశలో వికెట్ల ముందు దొరికిపోయిన పృథ్వీ షా.. భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీకి మరింత పని పెంచాడు. ఇప్పటికే పృథ్వీని పదే పదే విస్మరించడంపై విమర్శలు ఎదురవుతుండగా.. దేశవాళీల్లో ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడిన తరువాత సెలెక్షన్‌లో అతడి పేరును పరిశీలించకపోతే పెద్ద దుమారమే రేగే అవకాశాలున్నాయి. గువాహటి వేదికగా జరుగుతున్న పోరులో పృథ్వీతో పాటు పాతకాపు అజింక్యా రహానే (302 బంతుల్లో 191; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో ముంబై 687/4 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రశంస..

రంజీ ట్రోఫీలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన పృథ్వీ షా ఇన్నింగ్స్‌ చూసి గర్వపడుతున్నానని బీసీసీఐ సెక్రటరీ జైషా ట్వీట్‌ చేశాడు. ‘రికార్డు పుస్తకాల్లోకి మరో పేరు చేరింది. పృథ్వీ షా ఇన్నింగ్స్‌ అధ్బుతంగా ఉంది. అపార సామర్థ్యం అతడి సొంతం. రంజీ ట్రోఫీలో రెండో అత్యధిక స్కోరు చేసిన పృథ్వీకి శుభాకాంక్షలు, అతడిని చూస్తే గర్వంగా ఉంది’ అని ట్వీట్టర్‌ వేదికగా పేర్కొన్నాడు. దీనిపై పృథ్వీ షా స్పందిస్తూ.. ‘మీ మాటలు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. నేను అనుకున్నది సాధించేవరకు కష్టపడుతూనే ఉంటా’ అని బదులిచ్చాడు. అయితే క్రీడా విశ్లేషకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. జాతీయ జట్టు ఎంపికకు దేశవాళీ ప్రదర్శనే ప్రమాణికం అయినప్పుడు పృథ్వీని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన పృథ్వీని ఓపెనర్‌గా మరోసారి పరీక్షిస్తే తప్పేంటనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్లో రన్‌ రేట్‌ కారణంగానే ఇటీవల భారత జట్టు పరాజయాలు పాలవుతున్న నేపథ్యంలో పృథ్వీ లాంటి డేరింగ్‌ బ్యాటర్‌ టాపార్డర్‌లో ఉంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

India Vs Sri Lanka | సిరీస్‌ మనదే.. మెరిసిన మిడిలార్డర్‌.. శ్రీలంకపై భారత్‌ విక్టరీ

Hockey World Cup | హాకీ ప్రపంచకప్‌లో ఈసారైనా భారత్‌ సత్తా చాటుతుందా.. స్పెయిన్‌తో తొలి మ్యాచ్‌

KL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్‌ రాహుల్

Virat Kohli Daughter | కూతురితో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేసుకున్న విరాట్, అనుష్క శర్మ.. ఈసారి కూడా అదే ట్విస్ట్

Exit mobile version