Home Latest News Srisailam | శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Srisailam | శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Srisailam | టైం2న్యూస్‌, శ్రీశైలం : భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శ్రీశైల పర్యటన ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్న రాష్ట్రపతికి ఏపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధానాలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి దేవాలయ అధికారులు, అర్చ కులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా రత్నగర్భ గణపతి స్వామిని ముర్ము దర్శించుకున్నాక.. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవార్లకు కుంకుమార్చన చేశారు. మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు.

కాగా, పర్యటనలో భాగంగా నంది సర్కిల్ సమీపంలోని టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్‌లో రూ. 43.08 కోట్లతో చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్ట్‌ను రాష్ట్రపతి ముర్ము ప్రారంభించారు. ఆమె వెంట తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్రపతి కుమార్తె ఉన్నారు. అనంతరం శివాజీస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్రపతి.. చెంచు మహిళలతో మాట్లాడారు. గిరిజన విద్యార్థులతో ముచ్చటించారు. తర్వాత శ్రీశైలపర్యటనను ముగించుకుని సాయంత్రం 4 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ మంత్రులు, అధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు.

Exit mobile version