Home Entertainment Sushant singh rajput | సుశాంత్‌ సింగ్‌ది హత్యనే.. పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

Sushant singh rajput | సుశాంత్‌ సింగ్‌ది హత్యనే.. పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

Pic Credit: Wikipedia

Sushant singh rajput | సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయి రెండేళ్లు అయిపోతుంది.. ఇంకా అతని మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. ఎంతో యాక్టివ్‌గా ఉంటూ.. నలుగురికీ ఇన్‌స్పిరేషన్‌గా ఉండే మనిషి హఠాత్తుగా శవమై కనిపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. సుశాంత్‌ మరణంపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. మానసిక ఒత్తిడి తట్టుకోలేక డిప్రెషన్‌కు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటే.. లేదు బాలీవుడ్‌లో నెపోటిజం కారణంగానే బలయ్యాని మరికొందరు వాదించారు. ఏదైనా సరే ఈ చావు వెనుక కారణాలను నిగ్గుతేల్చడానికి సీబీఐకి అప్పగించారు. కానీ ఏం లాభం లేకుండా పోయింది. నాలుగు రోజులు హడావుడి చేసి బాలీవుడ్‌ డ్రగ్‌ కేసును తెరమీదకు తీసుకొచ్చారు. ఇద్దరు ముగ్గురు ప్రముఖుల పేర్లను చూపిస్తూ సెన్సేషన్‌ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే కేసును మూలకు పడేశారు. ఇదంతా జరిగిన రెండున్నరేళ్లకు ఇప్పుడు సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే అన్న వాదన తెరపైకి వచ్చింది. సుశాంత్‌పై దాడి చేసి చంపేసి ఉంటారని స్వయంగా అతని మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యుడే బయటపెట్టడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

2020 జూన్‌ 14న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. కానీ అది ఆత్మహత్య కాదు.. హత్యేనని కూపర్ ఆస్పత్రి వైద్యుడు రూప్‌కుమార్‌ షా సంచలన విషయాలు బయటపెట్టాడు. ‘ సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయినప్పుడు కూపర్‌ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం ఐదు మృతదేహాలు వచ్చాయి. వాటిలో ఒకటి వీఐపీ బాడీ. మేం పోస్టుమార్టం కోసం వెళ్లినప్పుడు సుశాంత్ అని మాకు తెలిసింది. అతని బాడీపై కొన్ని గాయాలను మేం గుర్తించాం. మెడపై మూడు గాయాలను గుర్తించాం. బలంగా కొట్టడం వల్ల కాళ్లు, చేతులు విరిగిపోయినట్టు కూడా గమనించాం. ఇదే విషయాన్ని సీనియర్ల దగ్గరకు వెళ్లి చెప్పాను. ‘ అని రూప్‌కుమార్‌ షా తెలిపాడు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యేనని పై అధికారులకు చెబితే దీని గురించి తర్వాత మాట్లాడదామని తప్పించుకున్నాడని పేర్కొన్నాడు. ‘ వాస్తవానికి పోస్టుమార్టం మొత్తాన్ని రికార్డు చేయాల్సి ఉంటుంది.. కానీ సుశాంత్ విషయంలో కేవలం డెడ్‌ బాడీ ఫొటోలను మాత్రమే తీయాలని పై అధికారులు ఆదేశించారు. వీలైనంత తొందరగా పోస్టుమార్టం పూర్తి చేసి డెడ్‌బాడీని పోలీసులకు అప్పగించాలన్నారు. అందుకే హడావుడిగా రాత్రిపూటనే శవపరీక్ష చేశాం’ అంటూ అప్పటి విషయాలను బయటపెట్టాడు.

‘సుశాంత్ డెడ్‌ బాడీ ఫొటోలు చూసిన ఎవరైనా సరే అతనిది హత్యే అని చెబుతారు. సుశాంత్ సింగ్‌కు న్యాయం జరగాలి. ఒకవేళ దర్యాప్తు అధికారులు నాకు కాల్‌ చేసినా కూడా ఇదే విషయం చెబుతాను’ అంటూ రూప్‌కుమార్‌ షా చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆంధేరి వెస్ట్‌ ఎమ్మెల్యే ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో సుశాంత్‌ మృతి విషయం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

Exit mobile version