Home Latest News Bandi Sanjay | యువతను బీజేపీకి దూరం చేసేందుకే నోటిఫికేషన్లు: బండి సంజయ్‌

Bandi Sanjay | యువతను బీజేపీకి దూరం చేసేందుకే నోటిఫికేషన్లు: బండి సంజయ్‌

Bandi Sanjay | విశాఖ ఉక్కు గురించి మాట్లాడే తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిజాం చక్కెర పరిశ్రమను ఎందుకు పునరుద్ధరించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. పోలవరంపై కేసీఆర్‌ వైఖరి ఏంటో చెప్పాలన్నారు. యువతను బీజేపీకి దూరం చేసేందుకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు జాతీయ అధ్యక్షుడు లేకుండానే ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారో అర్థం కావడం లేదన్నారు. దీన్ని బట్టే బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏందో ప్రజలకు అర్థమవుతుందన్నారు.

ఏపీ నేతలను కేసీఆర్‌ పిలిపించుకుని బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. వారిని తీసుకొచ్చేందుకు దాదాపు వందకుపైగా కార్లను పంపించారన్నారు. గత ఎన్నికలకు ముందు తెలంగాణ సెంటిమెంట్‌ రగల్చి ఆంధ్రావాళ్లను కేసీఆర్‌ తిట్టలేదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌తో ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

యువతను బీజేపీకి దూరం చేసేందుకే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో బండి మీడియాతో మాట్లాడారు. రైతులకు ఉచిత గురించి మాట్లాడే కేసీఆర్‌.. తెలంగాణలో ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెంచలేదా ? కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగింది నిజం కాదా? అన్నారు. ఏపీ సీఎం జగన్‌తో కుమ్మక్కై కేఆర్‌ఎంబీ సమావేశానికి కేసీఆర్‌ వెళ్లట్లేదని ఆరోపించారు. పోలవరంపై కేసీఆర్‌ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని బండి డిమాండ్‌ చేశారు. పోలవరం ఎత్తు పెంచాలో, తగ్గించాలో కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు.

తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని బండి అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు 18 లక్షల వ్యవసాయ బోర్లు ఉంటే ఇప్పుడు 23 లక్షల బోర్లు ఉన్నాయన్నారు. పాఠశాల విద్యలో తెలంగాణ 21వ స్థానంలో ఉందన్న బండి సంజయ్. నిరుద్యోగంలో నాలుగో స్థానంలో ఉందని గుర్తు చేశారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉందన్నారు.

Exit mobile version