Home Lifestyle Do you know Coral Reefs | మాయమైపోతున్న పగడపు దీవులు.. ఇక చందమామ కథలకే పరిమితమైపోతాయా?

Coral Reefs | మాయమైపోతున్న పగడపు దీవులు.. ఇక చందమామ కథలకే పరిమితమైపోతాయా?

Image by Yaroslav Danylchenko on Freepik

Coral Reefs | చిన్నప్పుడు చందమామ కథలు, బాలమిత్ర కథలు చదివిన వాళ్లందరికీ పగడపు దీవులు తెలిసే ఉంటాయి. సముద్రపు అడుగున ఉండే ఇవి ముత్యాలు, పగడాలతో పొదగబడి ధగధగ మెరిసిపోతుంటాయి. రంగు రంగుల మొక్కలు, అందమైన జీవులతో చూడముచ్చటగా కనిపిస్తుంది. వీటిని చూసిన ఎవరికైనా సరే అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. అంత సౌందర్యంగా కనిపించే ఈ పగడపు దీవులు ఇప్పుడు క్రమంగా అంతరించిపోతున్నాయి. ఇంకొన్ని రోజులు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే చందమామ కథల్లో చెప్పుకోవడానికి తప్ప ఈ భూమ్మీద పగడపు దిబ్బలు చూడ్డానికి కనిపించవని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పగడపు దీవులు నిజంగా మెరుస్తుంటాయా?

సముద్ర తీరాల్లో నీటికి అడుగున ఈ పగడపు దీవులు ఉంటాయి. అక్కడ రంగు రంగు రాళ్లు మెరుస్తూ కనిపిస్తుంటాయి. వాటినే మనం పగడాలు, రత్రాలు, వజ్రాలు అని భ్రమ పడుతుంటాం. కానీ అవి రత్నాలు కాదు. ప్రాణం ఉన్న జీవులు. సముద్రపు అడుగున జీవించే పాలిప్స్ అనే జీవులతో జూజాంతలీ అని పిలిచే ఆల్గేలు కలిసి సహజీవనం చేస్తుంటాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వాటికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ఈ ప్రక్రియలోనే అవి రంగు రంగులో మెరుస్తూ కనిపిస్తుంటాయి. అందుకే సముద్రపు జీవులు ఇక్కడ ఎక్కువగా జీవిస్తుంటాయి. భూమిపై 0.5 శాతం ప్రాంతంలోనే పగడపు దిబ్బలు ఉన్నాయి. కానీ పావు వంతు సముద్రపు జీవులు ఇక్కడే మనుగడ సాగిస్తుంటాయి. రంగు రంగుల చేపలు ఇక్కడే జీవిస్తుంటాయి.

ఇవి ఎక్కడ ఉన్నాయి?

పగడపు దీవులు ఏర్పటం అంత సులువైన ప్రక్రియ కాదు. ఒక ప్రాంతంలో పగడపు దిబ్బలు ఏర్పడాలంటే పాలిప్స్‌తో కలిసి జూజాంతలి కొన్ని వేల సంవత్సరాలు సహజీనవం చేయాలి. అలా చేసిన క్రమంలో పగడపు దీవులు ఏర్పడి ధగధగ మెరుస్తుంటాయి. అంతరిక్షం నుంచి భూమిపై చూసినప్పుడు ఈ పగడపు దీవులు కూడా మెరుస్తూ అందంగా కనిపిస్తుంటాయి. ఇవి భూమ్మీద దాదాపు 100కి పైగా దేశాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్‌లో ఇవి పగడపు దిబ్బలు అధికంగా ఉన్నాయి. వీటిని చూసేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. భారత్‌లో అయితే గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ మయన్మార్, అండమాన్ నికోబార్, లక్షదీవుల్లో పగడపు దీవులు కనిపిస్తాయి. కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి సముద్ర తీరాల్లోనూ పగడపు దిబ్బలు ఉన్నాయి.

ఎందుకు మాయమవుతున్నాయి?

పెరుగుతున్న భూతాపం, కాలుష్యం కారణంగా పాలిప్స్‌ను విడిచి జూజాంతలి వెళ్లిపోతుంది. దీంతో పగడపు దిబ్బలు తమ మెరుపును కోల్పోయి నిర్జీవంగా కనిపిస్తున్నాయి. గడిచిన మూడు దశాబ్దాల్లో దాదాపు సగం పగడపు దీవులు ఇలాగే అంతరించిపోయాయి. ఈ శతాబ్దం మధ్య కల్లా అది 90 శాతానికి చేరవచ్చని శాస్త్రవేత్తలుఅంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని అతి పెద్ద గ్రేట్ బారియర్ రీఫ్‌పై ఇప్పటికే వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తుంది.

పగడపు దీవులతో లాభమేంటి?

చూడ్డానికి అందంగా కనిపించే పగడపు దిబ్బలు మానవాళికి ఎంతో మేలు చేస్తుంటాయి. సముద్రంలో బలమైన అలలు, తుఫాన్లు వచ్చినప్పుడు వాటిని పగడపు దిబ్బలు కంట్రోల్ చేస్తాయి. అలల తరంగశక్తిని 97 శాతం వరకు ఇవి అడ్డుకుని తీర ప్రాంతాలకు రక్షణగా ఉంటున్నాయి. తుఫాన్ల తీవ్రతను అడ్డుకోవడంలో ఇవి కీలక పాత్రను పోషిస్తున్నాయి. దీంతో పరోక్షంగా 20 కోట్ల మందిని ఈ పగడపు దిబ్బలు రక్షిస్తున్నాయి. అంతేకాదు ఏటా 1.8 లక్షల కోట్ల డాలర్ల నష్టాన్ని ఈ పగడపు దిబ్బలు అడ్డుకుంటున్నాయని అమెరికాకు చెందిన భూగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర జీవుల్లో 25 శాతం వరకు ఇక్కడే మనుగడ సాగిస్తుంటాయి. ఇక్కడ ఉండే సముద్ర జీవుల నుంచి రకరకాల ప్రాణాంతక వ్యాధులకు ఔషధాలను తయారు చేస్తున్నారు.

అలాంటి పగడపు దిబ్బలు అంతరించిపోతే ఔషధాలకు కొరత ఏర్పడుతుంది. తరచూ తుఫాన్లతో తీర ప్రాంతాలు నష్టపోతుంటాయి. అలాగే పర్యాటకంగా కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే పగడపు దిబ్బలు పూర్తిగా అంతరించిపోయేలోపే జాగ్రత్తపడాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపం తగ్గించేందుకు చెట్లను పెంచాలని సూచిస్తున్నారు. దీంతో పాటు తీరప్రాంతాల్లో పగడపు దీవుల రక్షణకు కఠిన చర్యలు అమలు చేయాలని అభిప్రాయపడుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Bath | పెళ్లయిన ఆడవాళ్లు ఈ రోజుల్లో తలస్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవు

Vasthu Tips | మంచంపై కూర్చొని భోజనం చేస్తున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా!

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Exit mobile version