Home Latest News CSK vs RR | రాజస్థాన్‌ టాపార్డర్‌కు చెన్నై స్పిన్‌ త్రయం సవాల్‌.. ఇవాల్టి మ్యాచ్‌లో...

CSK vs RR | రాజస్థాన్‌ టాపార్డర్‌కు చెన్నై స్పిన్‌ త్రయం సవాల్‌.. ఇవాల్టి మ్యాచ్‌లో గెలిచేది ఎవరో?

CSK vs RR | టైమ్‌ 2 న్యూస్‌, చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై తిరుగులేని ఫామ్‌ కనబరుస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌.. బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో అమీతుమీకి రెడీ అయింది. లీగ్‌లో ఇప్పటి వరకు మూడేసి మ్యాచ్‌లాడిన ఈ రెండు జట్లూ.. చెరో రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి నాలుగేసి పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి.బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా ఏ రంగంలో చూసుకున్నా.. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నా.. చెన్నైలో ఆడనుండటం ధోనీ సేనకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ఫుల్‌ ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌ టాపార్డర్‌కు చెన్నై స్పిన్‌ త్రయంతో హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది.

యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ మంచి టచ్‌లో ఉండటం రాజస్థాన్‌కు కలిసిరానుంది. వీరిద్దరూ చెరో రెండు అర్ధశతకాలతో మంచి టచ్‌లో ఉండగా.. సంజూ శాంసన్‌, రియాన్‌ పరాగ్‌, షిమ్రాన్‌ హెట్‌మైర్‌, ధ్రువ్‌ జొరేల్‌, జాసెన్‌ హోల్డర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రాజస్థాన్‌ ఈ లీగ్‌లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లన్నీ బ్యాటింగ్‌ వికెట్‌లపైనే ఆడటంతో వారి టాపార్డర్‌ చక్కటి ప్రదర్శన కనబర్చింది. దీంతో ఆ జట్టు మూడింట రెండు విజయాలు ఖాతాలో వేసుకుంది. తొలి సారి చెన్నై చెపాక్‌ స్టేడియంలో బరిలోకి దిగనున్న రాయల్స్‌కు.. చెన్నై స్పిన్నర్ల నుంచి ముప్పు పొంచి ఉంది. ప్రధానంగా రవీంద్ర జడేజా, మిషెల్‌ శాంట్నర్‌, మోయిన్‌ అలీ చెపాక్‌లో విజృంభించే అవకాశాలున్నాయి. కాగా.. రాజస్థాన్‌కు కూడా నాణ్యమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌, మురుగన్‌ అశ్విన్‌, యుజ్వేంద్ర చాహల్‌ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు రాయల్స్‌ వద్ద ఉండగా.. చెన్నైలో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న అశ్విన్‌ మరోసారి కీలకం కానున్నాడు. ట్రెంట్‌ బోల్ట్‌, జాసెన్‌ హోల్డర్‌ పేస్‌ బాధ్యతలు మోయనున్నారు.

ధోనీనే బలం.. బలగం

మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీనే కొండంత అండ. యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఫుల్‌ ఫామ్‌లో ఉండగా.. న్యూజిలాండ్‌ ప్లేయర్‌ కాన్వే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరముంది. ఇప్పటికే గాయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌, బెన్‌ స్టోక్స్‌ సేవలను కోల్పోనుంది. వీరిద్దరూ గాయాల కారణంగా అందుబాటులో లేకుండా పోయారు. అయితే టెస్టు ప్లేయర్‌గా ముద్రపడ్డ అజింక్యా రహానే గత మ్యాచ్‌లో సునామీ సృష్టించడం చెన్నై అభిమానుల్లో జోష్‌ నింపింది. క్రీజులో అడుగుపెట్టిందే తడువు.. ప్రత్యర్థి బౌలర్లపై యుద్ధం ప్రకటించిన రహానే.. అదే జోరు కొనసాగించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తున్నది. అంబటి రాయుడు, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్రసింగ్‌ ధోనీ, ప్రిటోరియస్‌తో మిడిలార్డర్‌ బలంగా ఉంది. అయితే సొంతగడ్డపై వీరు సమిష్టిగా రాణించాల్సిన అవసరముంది.

స్పిన్‌ విభాగంలో చెన్నైకి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. పేస్‌లో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పరుగులకంటే ఎక్స్‌ట్రాలే ఎక్కువ ఇస్తున్న తుషార్‌ దేశ్‌పాండే, సిమర్‌జీత్‌ సింగ్‌, సిసండా మగలా ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. గత మ్యాచ్‌లో అందుబాటులో లేని మోయిన్‌ అలీ తుదిజట్టులో ఉండటం ఖాయమే కాగా.. పేస్‌ ఆల్‌రౌండర్‌గా బెన్‌స్టోక్స్‌ స్థానాన్ని ప్రిటోరియస్‌ భర్తీ చేయనున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sunil Gavaskar | రోహిత్‌కు సలహా.. వార్నర్‌కు వార్నింగ్‌.. ముంబై, ఢిల్లీ సారథులకు సునీల్‌ గవాస్కర్‌ క్లాస్‌

Duplessis | డుప్లెసిస్‌కు జరిమానా.. అవేశ్‌ఖాన్‌కు మందలింపు

RCB vs LSG | బెంగళూరులో పూరన్‌ సునామీ.. సీజన్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు.. ఆర్సీబీపై లక్నో ఉత్కంఠ విజయం

Sunrisers Hyderabad | ఎట్టకేలకు సన్‌రైజర్స్‌ బోణీ-ఉప్పల్‌ పోరులో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం

GT vs KKR | రింకూ రచ్చ రంబోలా.. ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు-ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై కోలకతా జయభేరి

Exit mobile version