Home Latest News Sunrisers Hyderabad | ఎట్టకేలకు సన్‌రైజర్స్‌ బోణీ-ఉప్పల్‌ పోరులో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం

Sunrisers Hyderabad | ఎట్టకేలకు సన్‌రైజర్స్‌ బోణీ-ఉప్పల్‌ పోరులో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం

Sunrisers Hyderabad | టైమ్‌ 2 న్యూస్‌, హైదరాబాద్‌: ఎట్టకేలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో బోణీ కొట్టింది. గత మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌ వైఫల్యాలతో పరాజయాలు ఎదుర్కొన్న రైజర్స్‌.. ఆదివారం ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తుచేసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ (66 బంతుల్లో 99 నాటౌట్‌; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. సహచరులంతా విఫలమైన చోట శిఖర్‌ ఒంటరి పోరాటంతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. శిఖర్‌తో పాటు సామ్‌ కరన్‌ (22) ఒక్కడే రెండంకెల స్కోరు చేయగా.. ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌ (0), షార్ట్‌ (1), జితేశ్‌ శర్మ (4), సింకందర్‌ రజా (5), షారుక్‌ ఖాన్‌ (4) విఫలమయ్యారు. హైదరాబాద్‌ బౌలర్లలో మయాంక్‌ మార్కండే 4.. మార్కో జాన్సెన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఒక ఎండ్‌లో వరుస వికెట్లు పడుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గని శిఖర్‌ ధవన్‌ బౌండ్రీలే లక్ష్యంగా దంచికొట్టాడు. సారథి ముందుండి నడిపించాలనే మాటను నిజం చేస్తూ.. ఒంటరి పోరాటం చేశాడు. చివరి వికెట్‌కు మోహిత్‌ రాఠి (1 నాటౌట్‌)తో కలిసి ధవన్‌ అభేద్యమైన పదో వికెట్‌కు 55 పరుగులు జోడించడం విశేషం. ఐపీఎల్లో చరిత్రలో ఆఖరి వికెట్‌కు ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం కావడం విశేషం.

త్రిపాఠి అదుర్స్‌

గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ యూనిట్‌ ఈ మ్యాచ్‌లో సమిష్టిగా సత్తాచాటింది. భారీ ధర పెట్టి కొనుగోలు చేసుకున్న ఇంగ్లండ్‌ యువ సంచలనం హ్యారీ బ్రూక్‌ను ఓపెనింగ్‌కు దింపిన సన్‌రైజర్స్‌ ఫలితం రాబట్టింది. స్వల్ప లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌ 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి (48 బంతుల్లో 74 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (37 నాటౌట్‌; 6 ఫోర్లు) రాణించారు. సాధించాల్సిన పరుగులు ఎక్కువ లేకపోవడంతో పాటు సొంతగడ్డపై అభిమానుల ప్రోత్సాహం మధ్య హైదరాబాద్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది. బౌలింగ్‌కు పెట్టింది పేరైన రైజర్స్‌.. ఈ మ్యాచ్‌లో తమపై ఉన్న గుర్తింపునకు న్యాయం చేసింది. ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకున్న పంజాబ్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 35 వేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియంలో ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో సన్‌రైజర్స్‌ పాయింట్ల ఖాతా తెరిచింది. సోమవారం జరుగనున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడనుంది.

Exit mobile version