Home Latest News Duplessis | డుప్లెసిస్‌కు జరిమానా.. అవేశ్‌ఖాన్‌కు మందలింపు

Duplessis | డుప్లెసిస్‌కు జరిమానా.. అవేశ్‌ఖాన్‌కు మందలింపు

Duplessis | టైమ్‌ 2 న్యూస్‌, బెంగళూరు: ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు’.. చేతిలోకి వచ్చిన మ్యాచ్‌లో ఓటమి పాలైన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)కి మరో షాక్‌ తగిలింది. సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జాయింట్స్‌తో జరిగిన పోరులో బెంగళూరు ఒక వికెట్‌ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లను ముగించలేకపోవడంతో.. ఆ జట్టు సారథి ఫాఫ్‌ డుప్లెసిస్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు రెఫరీ వెల్లడించారు. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి కాకపోవడంతో సోమవారం జరిగిన పోరులో అంపైర్లు.. ఫీల్డ్‌ రిస్ట్రిక్షన్స్‌ను కూడా అమలు చేశారు. దీంతోనే లక్నో చివరి ఓవర్లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బెంగళూరు కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే 30 గజాల సర్కిల్‌ బయట నిలబెట్టింది.

ఇక సోమవారం ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో లక్నో జయభేరి మోగించిన విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కోహ్లీ (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్‌ (46 బంతుల్లో 79 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు. లక్నో బౌలర్లలో అమిత్‌ మిశ్రా, మార్క్‌వుడ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో సరిగ్గా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. స్టొయినిస్‌ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పూరన్‌ (19 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. ఆయుష్‌ బదోని (30) రాణించాడు.

అవేశ్‌కు మందలింపు..

ఈ మ్యాచ్‌లో చివరి బంతికి అదనపు పరుగు తీసి లక్నో సూపర్‌ జెయింట్స్‌కు చిరస్మరణీయ విజయం అందించిన పేస్‌ బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ను రిఫరీ మదలించాడు. గెలుపు సంబరంలో అవేశ్‌ క్రీజు దాటగానే తన హెల్మెట్‌ను నేలకేసి కొట్టి సంబురాల్లో మునిగిపోయాడు. కీలక సమయంలో తీవ్ర ఒత్తడిలో క్రీజులో అడుగుపెట్టటిన అవేశ్‌ ఖాన్‌.. హర్షల్‌ బంతిని బ్యాట్‌కు తాకించలేకపోయాడు. అయినే ముందే నిర్ణయించుకున్నట్లు బై కోసం పరుగు అందుకున్నాడు. నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న రవిబిష్ణోయ్‌ మెరుపు వేగంతో క్రీజు దాటగా.. వికెట్ల వెనక దినేశ్‌ కార్తీక్‌ తడబడ్డాడు. ఈ వెటరన్‌ కీపర్‌ బంతిని అందుకోలేకపోవడంతో లక్నో విజయతీరాలకు చేరింది. ఈ ఆనందంలో ఉన్న అవేశ్‌ ఖాన్‌ హెల్మెట్‌ నెలకేసి కొట్టగా.. దీనిపై రిఫరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌ నియమావలి 2.2 ప్రకారం అవేశ్‌ చేసిన తప్పిదం లెవల్‌ -1 కిందికి వస్తుందని.. ఐపీఎల్‌ నిర్వహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అవేశ్‌ తప్పు ఒప్పుకోవడంతో తొలి పొరపాటుగా భావించి అతడికి జరిమానా విధించలేదని తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

RCB vs LSG | బెంగళూరులో పూరన్‌ సునామీ.. సీజన్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు.. ఆర్సీబీపై లక్నో ఉత్కంఠ విజయం

Sunrisers Hyderabad | ఎట్టకేలకు సన్‌రైజర్స్‌ బోణీ-ఉప్పల్‌ పోరులో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం

GT vs KKR | రింకూ రచ్చ రంబోలా.. ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు-ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై కోలకతా జయభేరి

Exit mobile version