Home Latest News RCB vs LSG | బెంగళూరులో పూరన్‌ సునామీ.. సీజన్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు.. ఆర్సీబీపై...

RCB vs LSG | బెంగళూరులో పూరన్‌ సునామీ.. సీజన్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు.. ఆర్సీబీపై లక్నో ఉత్కంఠ విజయం

RCB vs LSG | టైమ్‌ 2 న్యూస్‌ బెంగళూరు: క్రైమ్‌ థ్రిల్లర్‌కు మించిన మలుపులతో సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజేతగా నిలిచింది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఒత్తిడికి చిత్తయింది.

సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పోరులో లక్నో ఒక వికెట్‌ తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (46 బంతుల్లో 79 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. క్రీజులో అడుగుపెట్టిందే తడవు ప్రత్యర్థి బౌలర్లపై యుద్ధం ప్రకటించిన ఆర్సీబీ బ్యాటర్లు.. బౌండ్రీల (12) కంటే సిక్సర్లే (15) ఎక్కువ కొట్టడం విశేషం. లక్నో బౌలర్లలో అమిత్‌ మిశ్రా, మార్క్‌వుడ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో సరిగ్గా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. మార్కస్‌ స్టొయినిస్‌ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (19 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. బెంగళూరు బౌలర్లలో సిరాజ్‌, పార్నెల్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

కొట్టుడే కొట్టుడు

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు అదిరిపోయే ఆరంభం లభించింది. అవేశ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో 6,4తో దంచుడు ప్రారంభించిన కోహ్లీ.. అతడి మరుసటి ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాదాడు. కృనాల్‌ ఓవర్‌లో సిక్సర్‌ అరుసుకున్న విరాట్‌.. మార్క్‌వుడ్‌కు 4,6తో స్వాగతం పలికాడు. ఫలితంగా పవర్‌ ప్లే ముగిసేసరికి బెంగళూరు 55/0తో నిలిచింది. స్పిన్నర్ల రాకతో స్కోరు వేగం తగ్గగా.. కోహ్లీ 35 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కృనాల్‌ ఓవర్‌లో 6,4 కొట్టిన అనంతరం కోహ్లీ ఔట్‌ కాగా.. మ్యాక్స్‌వెల్‌ రాకతో మ్యాచ్‌ గమనం మారిపోయింది. అమిత్‌ మిశ్రా ఓవర్‌లో 4,6తో మ్యాక్స్‌వెల్‌ తన ఆగమనాన్ని చాటుకుంటే.. మరుసటి ఓవర్‌లో డుప్లెసిస్‌ రెండు, మ్యాక్స్‌ ఒక సిక్సర్‌ బాదారు. డుప్లెసిస్‌ కొట్టిన ఒక బంతి చిన్నస్వామి స్టేడియం బయట (115 మీటర్లు) పడటం విశేషం. మాజీ సారథి బాటలోనే డుప్లెసిస్‌ 35 బంతుల్లో అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. ఉనాద్కట్‌ వేసిన 18వ ఓవర్లో 6,6,4 కొట్టగా.. 19వ ఓవర్లో రెండు సిక్సర్లతో మ్యాక్స్‌వెల్‌ ఫిఫ్టీ మార్క్‌ దాటాడు.

ఇది కదా ఛేదన అంటే..

భారీ లక్ష్యఛేదనలో లక్నో ఆకట్టుకుంది. టాపార్డర్‌ రాణించకపోయినా.. మిడిలార్డర్‌ వీర లెవల్లో విజృంభించింది. తొలి ఓవర్‌ మూడో బంతికే విధ్వంసక ఆటగాడు మయేర్స్‌ను సిరాజ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. పార్నెల్‌ వేసిన నాలుగో ఓవర్‌లో హుడా, కృనాల్‌ కూడా వెనుదిరగడంతో పవర్‌ప్లే (6 ఓవర్లు) ముగిసే సరికి లక్నో 37/3తో నిలిచింది. క్రీజులో కుదురుకున్న రాహుల్‌ పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బందిపడగా.. మరో ఎండ్‌లో స్టొయినిస్‌ భారీ షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. హర్షల్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో 6,4,4 కొట్టిన అతడు.. కరణ్‌ శర్మ బౌలింగ్‌లో సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేశాడు. షాబాజ్‌ ఓవర్లో రెండు సిక్సర్లతో 25 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగు బంతుల వ్యవధిలో స్టొయినిస్‌తో పాటు రాహుల్‌ను ఔట్‌ చేసిన ఆర్సీబీ తిరిగి పుంజుకునే ప్రయత్నం చేయగా.. పూరన్‌ వచ్చీరావడంతోనే బెంగళూరు బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. కరణ్‌ శర్మ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు దంచిన పూరన్‌.. హర్షల్‌కు 6,4,6 రుచి చూపించాడు. పార్నెల్‌ బౌలింగ్‌లో 4,6,4తో 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇదే వేగవంతమైన హాఫ్‌సెంచరీ కావడం విశేషం. లక్నో విజయానికి 19 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన దశలో పూరన్‌ ఔట్‌ కావడంతో ఉత్కంఠ నెలకొన్నా.. ఒత్తిడిని అధిగమించిన లక్నో గెలుపు గీత దాటింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sunrisers Hyderabad | ఎట్టకేలకు సన్‌రైజర్స్‌ బోణీ-ఉప్పల్‌ పోరులో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం

GT vs KKR | రింకూ రచ్చ రంబోలా.. ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు-ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై కోలకతా జయభేరి

Exit mobile version