Home Latest News Joginder Sharma | వరల్డ్‌ కప్‌ వీరుడి వీడ్కోలు.. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన జోగిందర్‌ శర్మ

Joginder Sharma | వరల్డ్‌ కప్‌ వీరుడి వీడ్కోలు.. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన జోగిందర్‌ శర్మ

Joginder Sharma | టైం2న్యూస్‌: వెటరన్‌ పేసర్‌ జోగిందర్‌ శర్మ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. పొట్టి ఫార్మాట్‌ పరిచయమైన తొలినాళ్లలోనే భారత జట్టు విశ్వ విజేతగా నిలువడంలో కీలక పాత్ర పోషించిన ఈ మీడియం పేసర్‌.. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం వెల్లడించాడు. 2007లో దక్షిణాఫ్రికా వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆఖరి ఓవర్‌ వేయడం ద్వారా ఎనలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జోగిందర్‌ శర్మ.. కెరీర్‌లో 4 వన్డేలు, 4 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్న జోగిందర్‌ శర్మ ఆ తర్వాత పెద్దగా ఎక్కువ కాలం జట్టులో చోటు నిలబెట్టుకోలేకపోయాడు.

ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌..

ఐసీసీ తొలి సారి ప్రవేశపెట్టిన టీ20 ప్రంపచకప్‌ ఫైనల్లో చివరి ఓవర్‌ వేసిన జోగిందర్‌ శర్మ.. ఆ తర్వాత భారత జట్టు తరఫున మరో మ్యాచ్‌ ఆడలేకపోయాడు. పరిమిత వనరులతోనే సఫారీ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టులో.. చివరి ఓవర్‌ వేసేందుకు ఇతర బౌలర్లు అందుబాటులో లేని సమయంలో అప్పటి కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బంతిని జోగిందర్‌ శర్మ చేతిలో పెట్టాడు. నరాలు తెగే ఉత్కంఠ పరిస్థితుల్లో బౌలింగ్‌ చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన జోగిందర్‌ ‘ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌’ లాగే మిగిలిపోయాడు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

ఐపీఎల్లో చెన్నైకి ప్రాతినిధ్యం..

2007 టీ20 ప్రపంచకప్‌తో దేశంలో పొట్టి ఫార్మాట్‌కు విపరీతమైన క్రేజ్‌ రాగా.. మరుసటి సంవత్సరమే క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ పుట్టుకొచ్చింది. ఈ లీగ్‌ ఆరంభం నుంచి 2012 వరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కొనసాగిన జోగిందర్‌ శర్మ అడపా దడపా మంచి ప్రదర్శనలు చేశాడు. అయితే నిలకడ కొనసాగించడంలో ఆకట్టుకోలేక జట్టుకు దూరమయ్యాడు.

హర్యానాలో డీఎస్పీగా..

పొట్టి ప్రపంచకప్‌ ప్రదర్శనతో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అతడికి పోలీస్‌ శాఖలో ఉద్యోగం కల్పించగా.. ప్రస్తుతం జోగిందర్‌ డిప్యూటీ సుపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. క్రమశిక్షణాయుత జీవితమే విజయానికి అసలైన మార్గమని ఎప్పుడూ చెప్పే జోగిందర్‌.. అత్యుత్తమ స్థాయిలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని అన్నాడు.

అందరికీ వందనాలు..

‘ఇవాళ నేను ఆనందంతో అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. 2002 నుంచి 2017 వరకు సాగిన క్రికెట్‌ ప్రయాణం నా జీవితంలో మరుపురాని అనుభవాలను మిగిల్చింది. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ఈ అవకాశమిచ్చిన బీసీసీఐ, హరియాణ క్రికెట్‌ అసోసియేషన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, హరియాణా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు కోచింగ్‌ ఇచ్చిన గురువులు, సహచరులు, మెంటార్స్‌కు సదా రుణపడి ఉంటా. అభిమానుల అండదండలకు కృతజ్ఞుడిని’ అని జోగిందర్‌ శర్మ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు.

ఆ మ్యాచ్‌ గుర్తుందా..

2007, సెప్టెంబర్‌ 24.. జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో దాయాది పాకిస్థాన్‌తో భారత్‌ అమీతుమీ తేల్చుకుంటోంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ (54 బంతుల్లో 75; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. యూసుఫ్‌ పఠాన్‌ (15), యువరాజ్‌ సింగ్‌ (14) తలా కొన్ని పరుగులు చేశారు. రాబిన్‌ ఊతప్ప (8), సారథి ధోనీ (6) విఫలం కాగా.. ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చివర్లో 16 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో అజేయంగా 30 పరుగులు చేసి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. అనంతరం లక్ష్యఛేదనలో మిస్బావుల్‌ హక్‌ (43), ఇమ్రాన్‌ నజీర్‌ (33) రాణించడంతో 19 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్‌ 145/9తో నిలిచింది.

ఆ ఓవర్‌.. లక్ష సూపర్‌ ఓవర్లకు సమానం!

చివరి ఓవర్‌లో పాక్‌ విజయానికి 13 పరుగుల అవసరం కాగా.. అప్పటికే ప్రధాన పేసర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, ఆర్పీ సింగ్‌, శ్రీశాంత్‌ ఓవర్లు ముగిశాయి. దీంతో ధోనీ జోగిందర్‌ శర్మ చేతికి బంతినిచ్చాడు. క్రీజులో ఫుల్‌ ఫామ్‌ లో ఉన్న మిస్బావుల్‌ హక్‌ ఉండటంతో.. మైదానం మొత్తం పిన్‌ డ్రాప్‌ సైలెన్స్‌.. తీవ్ర ఒత్తిడిని అధిగమిస్తూ రనప్‌ ప్రారంభించిన జోగిందర్‌ తొలి బంతిని ఆఫ్‌ సైడ్‌ వైడ్‌గా వేశాడు. దీంతో వికెట్ల వెనుక నుంచి పరిగెత్తుకు వచ్చిన ధోనీ.. ఒత్తిడికి గురికావొద్దని జోగిందర్‌లో ధైర్యాన్ని నింపాడు. దీంతో మరోసారి వేసిన తొలి బంతికి పరుగు రాలేదు. పాక్‌ విజయ సమీకరణం 5 బంతుల్లో 12కు చేరింది. అయితే జోగిందర్‌ రెండో బంతికి ఫుల్‌ టాస్‌ వేయగా.. దానిపై విరుచుకుపడిన మిస్బా భారీ సిక్సర్‌ అరుసుకున్నాడు. దీంతో భారతీయ అభిమానులతో నిండిన మైదానం మొత్తం ఒక్కసారిగా నైరాశ్యంలోకి వెళ్లింది. పాక్‌ సమీకరణం 4 బంతుల్లో ఆరు పరుగులకు చేరడంతో ఇంకేముందు పాక్‌ విజయం ఖాయమే అనిపించింది. అయితే ఈ దశలోనే జోగిందర్‌ జాదూ చేశాడు. మూడో బంతికి అతడు నేరుగా వికెట్లకు గురిపెట్టగా.. స్కూప్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో మిస్బా షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లో శ్రీశాంత్‌ చేతికి చిక్కాడు. ఇంకేముందు టీమిండియా సంబురాల్లో మునిగిపోయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hardik Pandya | ధోనీ అడుగుజాడల్లో హార్దిక్‌.. సారథ్య బాధ్యతతో తగ్గిన పాండ్యా స్ట్రయిక్‌రేట్‌

Hanuma Vihari | మణికట్టు విరిగినా.. వెరవకుండా విహారి బ్యాటింగ్‌.. రంజీలో అద్భుతం

Sachin Tendulkar | సచిన్‌ చేతుల మీదుగా.. అండర్‌-19 జట్టుకు సన్మానం.. 5 కోట్ల చెక్‌ అందజేత

Shubman Gill | విరుచుకుపడుతున్న శుభ్‌మన్‌ గిల్‌.. విరాట్‌ కోహ్లీ రికార్డు బ్రేక్‌

IND vs NZ | భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన న్యూజిలాండ్.. సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా

Exit mobile version