Home Latest News Hardik Pandya | ధోనీ అడుగుజాడల్లో హార్దిక్‌.. సారథ్య బాధ్యతతో తగ్గిన పాండ్యా స్ట్రయిక్‌రేట్‌

Hardik Pandya | ధోనీ అడుగుజాడల్లో హార్దిక్‌.. సారథ్య బాధ్యతతో తగ్గిన పాండ్యా స్ట్రయిక్‌రేట్‌

Hardik Pandya | టైమ్‌ 2 న్యూస్‌: క్లిష్ట సమయాల్లో ఒత్తిడిని ఎలా అధిగమించాలో.. గడ్డు పరిస్థితుల్లో జట్టును ముందుండి ఎలా నడిపించాలో మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ నుంచి నేర్చుకున్నానని భారత టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు. తీరికలేని క్రికెట్‌ వల్ల ఇటీవలి కాలంలో టీమిండియా ఆడిన టీ20 సిరీస్‌లకు రోహిత్‌ శర్మ అందుబాటులో లేకపోగా.. సీనియర్లు లేని జట్టును హార్దిక్‌ నాయకుడిగా ముందుండి నడిపించాడు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ గైర్హాజరీలో సారథ్య బాధ్యతలు భుజానెత్తుకున్న పాండ్యా.. స్వదేశంలో శ్రీలంకపై, న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌లు అందించాడు. తాజాగా బుధవారం ముగిసిన కివీస్‌తో సిరీస్‌లో ఈ ఆల్‌రౌండర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు కైవసం చేసుకున్నాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన చివరి పోరులో నాలుగు వికెట్లు తీసి తన బౌలింగ్‌తో పదును తగ్గలేదని ప్రపంచానికి చాటాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆడటమే సారథి ప్రధాన కర్తవ్యమని హార్దిక్‌ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌పై 2-1తో సిరీస్‌ కైవసం చేసుకున్న అనంతరం హార్దిక్‌ మాట్లాడుతూ.. ‘సిక్స్‌లు కొట్టడాన్ని బాగా ఆస్వాదిస్తాను. అదే సమయంలో భాగస్వామ్యాలే జట్టును గెలిపిస్తాయని బలంగా నమ్ముతా’ అని అన్నాడు.

క్రీజులో ఉన్న సమయంలో సహచరులకు భరోసా కల్పించడమే తన బాధ్యత అని హార్దిక్‌ పేర్కొన్నాడు. గతంలో ధోనీ కూడా ఇలాగే చేశేవాడనే ప్రశ్నకు పాండ్యా బదులిస్తూ.. బాధ్యతలో పాటు ఆటతీరులో మార్పు వస్తుందని అన్నాడు. ‘జట్టులో మిగిలిన ఆటగాళ్లతో పోల్చితే నాకు ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. అలాంటప్పుడు ఒత్తిడిని తట్టుకొని నిలబడటం ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్లు ముందుకు సాగాలి. అలాంటప్పుడు స్ట్రయిక్‌ రేట్‌ కాస్త తగ్గుతుంది. కొత్త బాధ్యతలు తీసుకున్నప్పుడు ఇవన్నీ గమనించాలి. గతంలో ధోనీ భాయ్‌ నిర్వర్తించిన పాత్ర పోషించేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. కెరీర్‌ ఆరంభంలో మైదానం నలువైపులా బంతిని పరుగులు పెట్టించేవాడిని. ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి. దీంతో కాస్త నెమ్మదించా. అయినా వాటిని నేను బరువుగా భావించడంలేదు. మంచి ఫలితాలు వచ్చినంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని హార్దిక్‌ చెప్పుకొచ్చాడు.

సీనియర్‌ బౌలర్లు అందుబాటులో లేకపోవడంతో తానే బౌలింగ్‌ దాడిని ప్రారంభించాలనుకున్నట్లు పాండ్యా చెప్పాడు. ‘కొత్త ఆటగాళ్లతో పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయిస్తే.. వారి లయ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ఆ బాధ్యత నేనే తీసుకున్నా. ఎందుకంటే అది మొత్తం మ్యాచ్‌ మీద ప్రభావం చూపుతుంది. అందుకే కొత్త బంతితో బౌలింగ్‌ చేయడంపై దృష్టి పెడుతున్నా’ అని పాండ్యా అన్నాడు.

గిల్‌ మూడు ఫార్మాట్ల ప్లేయర్‌..

న్యూజిలాండ్‌తో చివరి టీ20లో శతక్కొట్టిన శుభ్‌మన్‌ గిల్‌పై హార్దిక్‌ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తొణకకుండా బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం గిల్‌ సొంతం అని పేర్కొన్నాడు. అతడి బ్యాటింగ్‌ శైలి మూడు ఫార్మాట్లకు నప్పుతుందని అన్నాడు. ‘అతడి స్టైల్, టెక్నిక్‌ ఏ ఫార్మాట్‌కైనా సెట్‌ అవుతుంది. అతడు మూడు ఫార్మాట్లు ఆడటం నాకు ఆశ్చర్యం అనిపించడం లేదు. గిల్‌ వంటి యువ ఆటగాళ్లు ఈ రేంజ్‌లో చెలరేగితే జట్టుకు మరింత ప్రయోజనం చేకూరుతుంది’ అని పాండ్యా అన్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rishab Pant | రిషబ్‌ పంత్‌ సర్జరీ సక్సెస్‌.. తొందరలోనే డిశ్చార్జి.. కానీ అదొక్కటే సమస్య

Novak Djokovic | జొకో జైత్రయాత్ర.. 22వ గ్రాండ్‌స్లామ్‌తో అగ్రస్థానానికి చేరిన సెర్బియా వీరుడు

Exit mobile version