Home Latest News Novak Djokovic | జొకో జైత్రయాత్ర.. 22వ గ్రాండ్‌స్లామ్‌తో అగ్రస్థానానికి చేరిన సెర్బియా వీరుడు

Novak Djokovic | జొకో జైత్రయాత్ర.. 22వ గ్రాండ్‌స్లామ్‌తో అగ్రస్థానానికి చేరిన సెర్బియా వీరుడు

Novak Djokovic | ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22! జొకోవిచ్‌ నెగ్గిన గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సంఖ్య ఇది. ఓపెన్‌ ఎరాలో రఫేల్‌ నాదల్‌, రోజర్‌ ఫెదరర్‌, ఆండీ ముర్రే హవా కొనసాగుతున్న కాలంలోనే ప్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించిన నొవాక్‌ జొకోవిచ్‌ ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ఇప్పుడు అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా నాదల్‌తో కలిసి అగ్రస్థానానికి చేరాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ అంటే చాలు పూనకం వచ్చినట్లు చెలరేగిపోయే జొకో.. పదోసారి ఈ టైటిల్‌ ఖాతాలో వేసుకోవడం విశేషం. ఈ దెబ్బతో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌లో అగ్రస్థానానికి చేరడంతో ర్యాకింగ్స్‌లోనూ టాస్‌కు దూసుకెళ్లాడు.

టైమ్‌ 2 న్యూస్‌, మెల్‌బోర్న్‌: ఎదురులేని ఆటతీరుతో విజృంభిస్తున్న సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌.. పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ ఖాతాలో వేసుకున్నాడు. కరోనా వ్యాక్సిన్‌ సమాచారం ఇవ్వనందుకు గానూ గతేడాది ఈ టోర్నీకి దూరమైన నొవాక్‌.. ఈసారి తనకు అచ్చొచ్చిన మైదానంలో అదరగొట్టాడు. రాడ్‌ లీవర్‌ ఎరీనా అంటేనే చెలరేగిపోయే నొవాక్‌.. పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ ముద్దాడాడు. ఓవరాల్‌గా 22వ టైటిల్‌తో పురుషుల సింగిల్స్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌ నెగ్గిన రఫేల్‌ నాదల్‌ (22)తో కలిసి అగ్రస్థానానికి చేరాడంతో పాటు ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌ ప్లేస్‌కు దూసుకెళ్లాడు.

ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ జొకోవిచ్‌ 6-3, 7-6 (7/4), 7-6 (7/5)తో గ్రీస్‌ వీరుడు స్టిఫానోస్‌ సిట్సిపాస్‌పై విజయం సాధించాడు. తొలి సెట్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్న జొకోకు.. ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా.. ఏమాత్రం వెనక్కి తగ్గని ‘జోకర్‌’ తనదైన శైలిలో విజృంభించి వరుస సెట్లలో గెలుపొందాడు. చివరి రెండు సెట్‌లు టై బ్రేకర్స్‌ ద్వారా ఫలితం తేలగా.. కీలక సమయాల్లో పైచేయి సాధించిన జొకో.. పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకున్నాడు.

ఎదురులేని వీరుడు

రోజర్‌ ఫెదరర్‌, రఫేల్‌ నాదల్‌.. ఈ ఇద్దరూ టెన్నిస్‌ ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలోనే వెలుగులోకి వచ్చిన జొకోవిచ్‌.. వారిద్దరితో పోల్చితే తానేం తక్కువ కాదన్న చందంగా చెలరేగిపోతున్నాడు. రోజర్‌ ఇప్పటికే కెరీర్‌కు గుడ్‌బై చెప్పేయగా.. నాదల్‌ గాయాలతో సతమతమవుతున్నాడు. ఇక మరో ఆటగాడు ఆండీ ముర్రే దారిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో ఇప్పుడున్న ఫిట్‌నెస్‌, ఫామ్‌ కొనసాగిస్తే.. జొకో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదగడం ఖాయంగా కనిపిస్తున్నది.

2008లో తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ నెగ్గిన సమయంలో జోకర్‌గా ప్రపంచానికి పరిచయమైన జొకోవిచ్‌.. పదిహేనేళ్లలో వరుస టైటిల్స్‌తో టెన్నిస్‌ జగత్తుకు రారాజుగా ఎదిగాడు. 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023లో ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్స్‌ గెలిచిన జొకో.. వింబుల్డన్‌లో 7, యూఎస్‌ ఓపెన్‌లో 3, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 2 టైటిల్స్‌ గెలిచాడు. పాత తరం ఇప్పటికే దూరమవుతుండగా.. యువ ఆటగాళ్లలోనూ జొకోవిచ్‌కు పోటీనిచ్చే వాళ్లు కనిపించడం లేదు. జ్వెరెవ్‌, సిట్సిపాస్‌, థీమ్‌, మెద్వెదెవ్‌ వంటి వాళ్లు అడపా దడపా మెరుపులు మెరిపించడం తప్ప ఫెదరర్‌, నాదల్‌లా నిలకడ కొనసాగించలేకపోతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Australian Open | సంచలనం సృష్టించిన నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డును సమం చేసిన సెర్బియా దిగ్గజం

India Vs New Zealand | ఉత్కంఠ పోరులో రెండో టీ20లో కివీస్‌పై భారత్ విజయం.. సిరీస్‌పై ఆశలు

Exit mobile version