Home Latest News Shubman Gill | విరుచుకుపడుతున్న శుభ్‌మన్‌ గిల్‌.. విరాట్‌ కోహ్లీ రికార్డు బ్రేక్‌

Shubman Gill | విరుచుకుపడుతున్న శుభ్‌మన్‌ గిల్‌.. విరాట్‌ కోహ్లీ రికార్డు బ్రేక్‌

Shubman Gill | టైమ్‌ 2 న్యూస్‌, అహ్మదాబాద్‌: అండర్‌-19 స్థాయిలో మెరుపులు మెరిపించి భారత జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మరోసారి విశ్వరూపం కనబర్చాడు. ఇటీవల ఉప్పల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన గిల్‌.. అహ్మదాబాద్‌లో అరాచకానికి అర్థం మార్చుతూ సునామీలా ముంచెత్తాడు. బంతి తన పరిధిలోఉంటే చాలు దాన్ని ప్రేక్షకుల్లో పడేయడమే లక్ష్యంగా వీర బాదుడు బాదిన ఈ పంజాబ్‌ కా పుత్తర్‌ టీ20ల్లో తొలి శతకం తన పేరిట రాసుకున్నాడు. తద్వారా టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో మూడంకెల స్కోరు చేసిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ ముందున్నారు. ఈ క్రమంలో టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగానూ శుభ్‌మన్‌ (126) రికార్డుల్లోకెక్కాడు. విరాట్‌ కోహ్లీ (122) రెండో స్థానంలో ఉన్నాడు. గిల్‌ దెబ్బకు భారత్‌ టీ20 క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

పర్ఫెక్ట్‌ క్లాస్‌ అండ్‌ మాస్‌..

కండ్లు చెదిరే కవర్‌ డ్రైవ్‌లతో పాటు బౌలర్‌ తల మీద నుంచి దూసుకెళ్లే స్ట్రయిట్‌ షాట్‌లు, బౌన్సర్లకు పుల్‌ షాట్లు, యార్కర్లకు కట్‌ షాట్లు ఇలా క్రికెట్‌ పుస్తకాల్లోని ప్రతి షాట్‌ను అహ్మదాబాద్‌లో అక్షరాలా సాక్యాత్కరించిన గిల్‌.. పరిస్థితులకు తగ్గట్లు గేర్లు మార్చడం ఎలాగో నిరూపించాడు. క్రీజులో నిలదొక్కుకుంటే చాలు.. తనను ఔట్‌ చేయడం అంత సులువు కాదని మరోసారి చాటుతూ మైదానం నలువైపులా బౌండ్రీలతో విరుచుకుపడ్డాడు. సుమారు లక్ష్యమందితో కిక్కిరిసిన అహ్మదాబాద్‌ మైదానంలో పరుగులు సునామీ సృష్టించాడు. తానెదుర్కొన్న తొలి 20 బంతుల్లో 34 పరుగులు చేసిన గిల్‌.. మధ్యలో రాహుల్‌ త్రిపాఠి దంచికొడుతుండటంతో కాస్త వెనక్కి తగ్గి ఆ తర్వాతి 25 బంతుల్లో 33 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. ఇక చివర్లో మరింతలా రెచ్చిపోయిన ఈ పంజాబీ 18 బంతుల్లో 59 పరుగులు రాబట్టాడు. దీన్ని బట్టి ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలో.. యాంకర్‌ రోల్‌ ఎలా పోషించాలో.. అవసరమైన సమయంలో గేర్లు మార్చుతూ రాకెట్‌ స్పీడ్‌ ఎలా అందుకోవాలో యువ ఆటగాళ్లకు చూపెట్టాడు.

మేలిమి ముత్యమే!

అండర్‌-19 స్థాయిలో అదరగొట్టి ఎందరో ఆటగాళ్లు జాతీయ జట్టులోకి వచ్చారు. అయితే అందులో కొంతమంది మాత్రమే భారత జట్టులో స్థానం సుస్థిరం చేసుకోగలిగారు. ఒకటీ అరా మెరుపులు మెరిపించిన వాళ్లు వచ్చిన దారిలోనే వెళ్లిపోయారు. విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి కొద్ది మంది మాత్రమే సుదీర్ఘ కాలంగా జాతీయ జట్టుకు సేవలందిస్తున్నారు. ఇప్పుడా కోవలోకి శుభ్‌మన్‌ గిల్‌ కూడా చేరేలా కనిపిస్తున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు గిల్‌ను ఓపెనర్‌గా ఎంచుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో డబుల్‌ సెంచరీ చేసిన ఇషాన్‌ కిషన్‌ను కాదని తుది జట్టులో గిల్‌కు చోటివ్వడంపై మాజీలు మండిపడ్డారు. అయితే లంకతో సిరీస్‌లో చితక్కొట్టిన శుభ్‌మన్‌ తన ఎంపిక తప్పుకాదని నిరూపించాడు. ఆ వెంటనే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో తన ఆటను మరో స్థాయికి తీసుకెళ్లిన ఈ పంజాబ్‌ కా పుత్తర్‌ ఒక సెంచరీ, ఒక డబుల్‌ సెంచరీతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

టెస్టు, వన్డే జట్లలో ఇప్పటికే నిరూపించుకున్న గిల్‌.. తాజాగా పొట్టి ఫార్మాట్లలోనూ తాను దంచికొట్టగలనని ప్రపంచానికి చాటాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో తొలి ఓవర్‌లో క్రీజులో అడుగుపెట్టిన శుభ్‌మన్‌.. చివరి వరకు నిలిచి భారత్‌కు చక్కటి విజయాన్నందించాడు. ఆరంభంలో రాహుల్‌ త్రిపాఠి దంచికొడుతున్న సమయంలో కాస్త సంయమనం పాటించిన గిల్‌.. ఆ తర్వాత బాదే బాధ్యత భూజానెత్తుకొని ఇరగదీశాడు. 200 స్ట్రయిక్‌ రేట్‌తో సెంచరీ బాదిన శుభ్‌మన్‌.. టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అతిడిదే జోరు కొనసాగిస్తే ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు తిరుగుండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు బాదిన ఐదో భారత ఆటగాడిగా గిల్‌ రికార్డుల్లోకెక్కాడు. సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ ముందున్నారు. భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా శుభ్‌మన్‌ గిల్‌ (126) నిలిచాడు. విరాట్‌ (122) రెండో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్‌పై ఓ ప్లేయర్‌ చేసిన అత్యదిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం.

*టీ20ల్లో భారత్‌కు పరుగుల పరంగా ఇదే (168) అతిపెద్ద విజయం. 2018లో ఐర్లాండ్‌పై సాధించిన (143 పరుగుల తేడాతో) గెలుపు రెండో స్థానంలో ఉంది.
*అత్యంత పినన్న వయసులో (23 ఏండ్లా 146 రోజులు) టీ20 సెంచరీ నమోదు చేసిన భారత ప్లేయర్‌గా గిల్‌ నిలిచాడు. సురేశ్‌ రైనా (23 ఏండ్లా 156 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rishab Pant | రిషబ్‌ పంత్‌ సర్జరీ సక్సెస్‌.. తొందరలోనే డిశ్చార్జి.. కానీ అదొక్కటే సమస్య

Novak Djokovic | జొకో జైత్రయాత్ర.. 22వ గ్రాండ్‌స్లామ్‌తో అగ్రస్థానానికి చేరిన సెర్బియా వీరుడు

India Vs New Zealand | ఉత్కంఠ పోరులో రెండో టీ20లో కివీస్‌పై భారత్ విజయం.. సిరీస్‌పై ఆశలు

India Vs New Zealand | రెండో టీ20లో చేతులెత్తేసిన న్యూజిలాండ్.. భారత్ విజయ లక్ష్యం 100 పరుగులే

Australian Open | సంచలనం సృష్టించిన నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డును సమం చేసిన సెర్బియా దిగ్గజం

Exit mobile version