Home Latest News CESS Elections | సెస్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ విజయం.. ప్రజాస్వామ్యాన్ని బీఆర్‌ఎస్‌ అపహాస్యం చేస్తోందన్న బండి...

CESS Elections | సెస్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ విజయం.. ప్రజాస్వామ్యాన్ని బీఆర్‌ఎస్‌ అపహాస్యం చేస్తోందన్న బండి సంజయ్‌

CESS Elections | సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. మొత్తం 15 డైరెక్టర్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 14 స్థానాల్లో బీఆర్ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత జరిగిన తొలి సెస్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసింది. మంత్రి కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీ కేవలం ఒక్కస్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్‌ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. అయితే ఒక స్థానంలో ఐదు ఓట్లతో బీజేపీ విజయం సాధించడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ ఓట్లు లెక్కింపు జరపాలని డిమాండ్ చేసింది. దీంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సెస్‌ ఎన్నికల్లో 15 స్థానాలకు గానూ 75 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సెస్‌ పరిధిలో మొత్తం 87,130 మంది ఓటర్లు ఉండగా 73,189 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో అత్యధికంగా 84 శాతం పోలింగ్‌ నమోదైంది. గతంలో 2007, 2010, 2016 లో జరిగిన సెస్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కించుకున్నారు. ఈసారి కూడా భారీ విజయం దక్కడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

ఈ మాత్రం దానికి ఎన్నికలు ఎందుకు: బండి సంజయ్‌

సెస్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఎన్నికల్లో ఐదు స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచినా ఫలితాలు తారుమారు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మాత్రం దానికి ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఆటలు చెల్లవన్న బండి సంజయ్‌.. కేసీఆర్‌ చెంప చెల్లుమనిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Exit mobile version