Home Latest News Sarfaraz Khan | అర్జున్‌ టెండూల్కర్‌ కంటే అదృష్టవంతుడిని నాన్నా.. తండ్రితో సర్ఫరాజ్‌ఖాన్‌ భావోద్వేగం

Sarfaraz Khan | అర్జున్‌ టెండూల్కర్‌ కంటే అదృష్టవంతుడిని నాన్నా.. తండ్రితో సర్ఫరాజ్‌ఖాన్‌ భావోద్వేగం

బ్యాట్‌ పట్టుకుంటే చాలు.. పూనకం వచ్చినట్లు చెలరేగిపోయే చిచ్చరపిడుగు!

బరిలోకి దిగాడంటే చాలు.. ప్రత్యర్థి ఎవరనేది లెక్కచేయకుండా విరుచుకుపడే వీరుడు!

ఆడుతున్న మ్యాచ్‌ ఏదైనా కానీ.. కడదాక నిలిచి పరుగుల వరద పారించాలనుకునే పోరాట యోధుడు!!

దేశవాళీల్లో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ దుమ్మురేపుతున్న యువ కెరటం!!

ఈ ఉపోద్ఘాతమంతా ముంబై యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ( Sarfaraz Khan ) గురించే! జాతీయ జట్టుకు ఆడటమే అంతిమ లక్ష్యంగా పెట్టుకొని రంజీ ట్రోఫీలో అదరగొడుతున్న సర్ఫరాజ్‌పై సెలెక్షన్‌ కమిటీ శీతకన్ను కొనసాగుతోంది. తాజా సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలతో 556 పరుగులు చేసి సహచరులకు అందనంత ఎత్తులో నిలిచిన సర్ఫరాజ్‌ను సెలెక్టర్లు ప్రతిసారి మొండిచేయి చూపిస్తూనే వస్తున్నారు. ఏది ఏమైనా.. ఏదో ఒక రోజు టీమిండియాకు ప్రాతనిధ్యం వహిస్తానని నమ్మకంతో ఉన్న సర్ఫరాజ్‌పై టైమ్‌2న్యూస్‌ ప్రత్యేక కథనం..

టైమ్‌2న్యూస్‌, ముంబై: అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లు హడలెత్తిపోవాల్సిందే. గంటలకు గంటలు క్రీజులో పాతుకుపోవడమే కాకుండా.. స్పిన్‌, పేస్‌ అనే దాంతో సంబంధం లేకుండా సత్తాచాటుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌.. జాతీయ జట్టులో చోటు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడటం తనకు ఉగ్గుపాలతో పెట్టిన విధ్య అన్నట్లు విజృంభిస్తున్న 25 ఏండ్ల సర్ఫరాజ్‌.. గత 24 ఇన్నింగ్స్‌ల్లో 71, 36, 301, 226, 25, 78, 177, 6, 275, 63, 48, 165, 153, 40, 59, 134, 45, 5, 75, 20, 162, 125, 0తో విశ్వరూపం కనబర్చాడు. ఇదే గణాంకాలు మరో ఆటగాడు నమోదు చేసుంటే.. అతడికి ఈ పాటికి టీమిండియాలో చోటు దక్కేదే. కానీ.. సర్ఫరాజ్‌ విషయంలో మాత్రం విధి అతడితో ఆటాడుకుంటోంది. దిగువ మధ్య తరగతిలో పుట్టి.. ప్రతిభే పెట్టుబడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడి వరకు వచ్చిన సర్ఫరాజ్‌కు ఫిట్‌నెస్‌ లేమి, గాయాల బెడద తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ప్రతి రంజీ సీజన్‌ అనంతరం ఈ సారి సర్ఫరాజ్‌కు చోటు దక్కినట్లే అనుకుంటే.. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకితో అతడి సెలెక్షన్‌ జరగడం లేదు.

రంజీలు ప్రామాణికం కాదా!

జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీల్లో సత్తాచాటాలనేది ప్రాథమిక సూత్రం. భారత సెలెక్టర్లు దశబ్దాలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే గత కొంతకాలంగా.. పరిమిత ఓవర్ల ప్రదర్శన, ఐపీఎల్‌ ఆటతీరును ఆధారంగా చేసుకొని టీమ్‌ సెలెక్షన్‌ జరుగుతోంది. తాజాగా ఆస్ట్రేలియాతో ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టును పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టమవుతుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకోవడంతో పాటు.. అద్వితీయమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌కు టెస్టు జట్టు నుంచి పిలుపువచ్చింది. బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్‌ సెంచరీ నమోదు చేసిన ఇషాన్‌ కిషన్‌ కూడా సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపికయ్యాడు. సూర్యకుమార్‌కు లిస్ట్‌-‘ఏ’ క్రికెట్‌లోనూ మెరుగైన రికార్డే ఉన్నప్పటికీ.. ఇషాన్‌ విషయంలో మాత్రం పరిమిత ఓవర్ల ఫామ్‌నే పరిగణలోకి తీసుకున్నారన్నది సుస్పష్టం. మరి ఇలా వైట్‌ బాల్‌ క్రికెట్‌నే పరమావధిగా చూసుకుంటే.. రంజీలనే నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి పనేది జవాబు లేని ప్రశ్నగా మిగిలపోతోంది.

మోడల్స్‌ తెచ్చుకోండి: సన్నీ

చిన్నతనం నుంచి సర్ఫరాజ్‌ను దగ్గరి నుంచి గమనిస్తూ వస్తున్న లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ కూడా అతడిని ఎంపిక చేయకపోవడంపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. స్లిమ్‌గా ఉన్నవాళ్లే కావాలంటే ఫ్యాషన్‌ షోలకు వెళ్లి మోడల్స్‌ను వెతుక్కొని వారితో క్రికెట్‌ ఆడించండని సెలెక్టర్లకు చురకలంటించాడు. ప్రతిభను మాత్రమే కోలమానంగా తీసుకుంటే.. సర్ఫరాజ్‌ను తప్పక ఎంపిక చేయాల్సిందని అన్నాడు. ఆటగాళ్లందరి సామర్థ్యాలు సమానంగా ఉండవని.. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ దాగి ఉంటుందని పేర్కొన్నాడు. తనకు రన్నింగ్‌ టెస్టు పెట్టి ఎంపిక చేసి ఉంటే.. జీవితంలో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయేవాడనని చెప్పుకొచ్చాడు. యోయో టెస్టు తప్పనిసరి అయినప్పటికీ అత్యుత్తమ బ్యాటింగ్‌ నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను దూరం చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు.

‘సచిన్‌ కొడుకు కావడం కన్నా’..

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు జట్టు ఎంపిక జరిగిన రోజు రాత్రంతా నిద్రపోలేకపోయిన సర్ఫరాజ్‌.. తన తదుపరి రంజీ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిపోయాడు. తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయిన అతడిలో నూతన జవసత్వాలు నింపిన ఘనత సర్ఫరాజ్‌ తండ్రి నౌషద్‌ ఖాన్‌దే! చిన్నప్పటి నుంచి సర్ఫరాజ్‌ వెన్నంట నిలుస్తూ.. కష్ట సుఖాల్లో అతడికి అండగా నిలిచిన కొడుకు గురించి నౌషద్‌ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ముంబై క్రికెట్‌ సర్కిల్స్‌ మంచి పేరు సంపాదించుకున్న సర్ఫరాజ్‌.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌తో కలిసి ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు.

ఈ సందర్భంగా అర్జున్‌ను దగ్గరి నుంచి పరిశీలించిన సర్ఫరాజ్‌.. ఒక రోజు తండ్రితో ‘అబ్బూ అర్జున్‌ కిత్నా నసీబ్‌ వాలా హైనా’ (నాన్నా.. అర్జున్‌ ఎంత అదృష్టవంతుడు కదా) అని అన్నాడట. సచిన్‌ కొడుకు కావడంతో అతడి వద్ద కార్లు, బైక్‌లు, ఐపాడ్‌ లాంటి విలాస వంతమైన వస్తువులకు కొదవలేదని చెప్తూ కాస్త నిర్వేదానికి లోనయ్యాడని తండ్రి నౌషద్‌ పేర్కొన్నాడు. దీనికి ఎలా బదులు చెప్పాలో తోచక తటపటాయిస్తున్న తండ్రి వైపు చూసిన సర్ఫరాజ్‌.. ‘అయినా.. నా దగ్గర నువ్వు ఉన్నావు నాన్నా. అర్జున్‌ ఎక్కువ సమయం వాళ్ల నాన్నతో గడపలేదు. కానీ, నువ్వు మాత్రం నా వెన్నంటే ఉంటావు. ఇంతకు మించి ఏం కావాలి నాన్నా’ అని చెప్పడంతో నౌషద్‌ ఆనందంతో ఉప్పొంగిపోయినట్లు చెప్పుకొచ్చాడు. చిన్నతనం నుంచే పరిణతితో ఆలోచించే సర్ఫరాజ్‌.. త్వరలోనే భారత జట్టులోకి రావాలని మనమూ ఆశిద్దాం. ఆల్‌ ది బెస్ట్‌ సర్ఫరాజ్‌

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

ICC Rankings | అగ్రస్థానానికి అడుగుదూరంలో భారత్‌ .. మూడో వన్డే నెగ్గితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ మనదే

Umesh Yadav | క్రికెటర్ ఉమేశ్‌ యాదవ్‌‌ని ముంచేసిన స్నేహితుడు.. మేనేజర్‌గా పెట్టుకుంటే లక్షలు కొట్టేశాడు!

Junior NTR | యంగ్‌ టైగర్‌ని కలిసిన టీమిండియా ఆటగాళ్లు..ఎక్కడంటే!

Hanmakonda | లేడీస్‌ హాస్టల్‌లో అర్ధరాత్రి దొంగతనం చేసి బావిలో పడ్డ దొంగ.. తెల్లారి బయటకుతీస్తే అసలు విషయం తెలిసింది!

Singer Mangli | సింగర్ మంగ్లీ కారుపై బళ్లారిలో రాళ్ల దాడి.. దాడికి కారణం అదేనా!

Exit mobile version