Home News International ICC Rankings | అగ్రస్థానానికి అడుగుదూరంలో భారత్‌ .. మూడో వన్డే నెగ్గితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో...

ICC Rankings | అగ్రస్థానానికి అడుగుదూరంలో భారత్‌ .. మూడో వన్డే నెగ్గితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ మనదే

ICC Rankings | దుబాయ్‌: స్వదేశంలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న టీమిండియా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకెళ్తోంది. ఇటీవల శ్రీలంకను క్లీన్‌స్వీప్‌ చేసిన రోహిత్‌ సేన.. తాజాగా న్యూజిలాండ్‌పైనే అదే జోరు కనబరుస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి రెండు వన్డేలు నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్‌.. నామమాత్రమైన మూడో పోరులోనూ నెగ్గితే.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరనుంది.

ప్రస్తుతం 113 పాయింట్లతో ఇంగ్లండ్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్‌, భారత్‌ కూడా సమాన పాయింట్లతోనే ఉన్నా.. స్వల్పతేడాతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. దీంతో ఈ చివరి వన్డేలో న్యూజిలాండ్‌పై నెగ్గితే.. భారత్‌ అగ్రస్థానానికి దూసుకెళ్లనుంది. ఇప్పటికే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ టాప్‌లో ఉన్న భారత్‌.. మూడో మ్యాచ్‌లో నెగ్గితే ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోనుంది.

టెస్టు ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా ప్రస్తుతం 115 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా 126 పాయింట్లతో టాప్‌లో ఉంది. త్వరలో స్వదేశంలో ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌ల ‘బోర్డర్‌ గవాస్కర్‌’ టెస్టు సిరీస్‌ జరుగనున్న నేపథ్యంలో భారత జట్టు మూడు ఫార్మాట్లలో అగ్రస్థానానికి చేరే అరుదైన అవకాశం ఊరిస్తున్నది. కంగరూలపై టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేస్తే.. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ భారత్‌ అగ్రస్థానాన్ని చేజిక్కించుకోనుంది.

ప్రయోగాలకు చాన్స్‌..

ఇప్పటికే సిరీస్‌ చేజిక్కడంతో న్యూజిలాండ్‌తో మంగళవారం జరుగనున్న మూడో వన్డేలో భారత జట్టు ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుండటంతో సీనియర్లకు విశ్రాంతినిచ్చి.. వారి స్థానాల్లో యువ ఆటగాళ్లను పరీక్షించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ వంటి వాళ్లు మంగళవారం మ్యాచ్‌కు దూరమై.. రంజీ మ్యాచ్‌లు ఆడితే మంచిదని ఇప్పటికే పలువురు మాజీలు సూచిస్తున్నారు.

న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్‌ బలంతో నెగ్గిన టీమిండియా.. రాయ్‌పూర్‌ పోరులో బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. సీనియర్లు కేన్‌ విలియమ్సన్‌, టిమ్‌ సౌథీ లేకుండానే భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ తొలి పోరులో చక్కటి పోరాట పటిమ చూపినా.. రెండో మ్యాచ్‌కు వచ్చేసరికి పూర్తిగా నిరాశ పరిచారు.

షమీ ప్లేస్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ ?

తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన రాయ్‌పూర్‌ మైదానం బౌలర్లకు ఇతోధిక సాయం చేయగా.. పరిస్థితులను అనువుగా మలుచుకుంటూ మన పేసర్లు విజృంభించారు. ఇక ఇండోర్‌లో జరుగనున్న మూడో వన్డేలో పరుగుల వరద ఖాయమే కాగా.. భారత జట్టు యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షించనుంది. గత వన్డేలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచి సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ ప్లేస్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెట్స్‌లో షమీ అతడికి పలు చిట్కాలు చెప్తూ కనిపించడం ఇందుకు బలాన్నిస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Umesh Yadav | క్రికెటర్ ఉమేశ్‌ యాదవ్‌‌ని ముంచేసిన స్నేహితుడు.. మేనేజర్‌గా పెట్టుకుంటే లక్షలు కొట్టేశాడు!

India Vs New Zealand | రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 2-0 తేడాతో సిరీస్ కైవసం

Wrestlers Protest | డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి నుంచి ప్రాణహాని ఉందన్న యువ రెజ్లర్లు.. కమిటీ ఏర్పాటు చేసిన భారత ఒలింపిక్‌ సంఘం

Hockey World Cup | హాకీ ప్రపంచకప్‌లో వేల్స్‌పై భారత్‌ ఘన విజయం.. క్వార్టర్స్‌ చేరాలంటే క్రాస్‌ ఓవర్‌ తప్పనిసరి.

Rohit Sharma Interview | ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు డబుల్ సెంచరీ వీరులు.. వైరల్‌ అవుతున్న రోహిత్‌ శర్మ ఇంటర్వ్యూ వీడియో

Exit mobile version