Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యంపై కొద్దిరోజులుగా రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని.. ఎక్కువకాలం బతకడని తరుచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో రష్యా ఫెడరల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ ఇలియా పొనోమరేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఏడాది కంటే ఎక్కువ బతకడని పేర్కొన్నారు. వచ్చే బర్త్ డే అంటే అక్టోబర్ 7 దాకా ఆయన ప్రాణాలతో ఉండటం కష్టమేనని చెప్పారు. బ్రిటన్ వార్తా సంస్థ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియా పొనోమరేవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఇప్పుడు జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ గెలుస్తుందని ఆయన అన్నారు. అంతేకాదు రష్యాతో విలీనమైన క్రిమియాను తిరిగి ఉక్రెయిన్ హస్తగతం చేసుకుంటుందని ఆయన తెలిపారు. అప్పటి నుంచే పుతిన్ పతనం ప్రారంభమవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, రష్యాలో క్రిమియా విలీనానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక డిప్యూటీ ఇలియా పోనోమరేవే. ఆ సమయంలో పుతిన్ రిగ్గింగ్ చేసి క్రిమియాను కలిపేసుకున్నారని కూడా ఆరోపించారు. దీంతో విధులు సరిగ్గా నిర్వహించడం లేదనే సాకు చూపించి ఇలియాపై అభిశంసన తీర్మానం పెట్టారు. ఆ తర్వాత రష్యాను నుంచి బహిష్కరించారు. దీంతో 2016 నుంచి ఆయన ఉక్రెయిన్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌కు అనుకూలంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఓడిపోతున్నట్లు పుతిన్‌కు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తుందని, ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని చాలా రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది తన పుట్టిన రోజు దాకా కూడా పుతిన్ బతికి ఉండరని ఉక్రెయిన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిలో బుడనోవ్ గత నెలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పుతిన్ ఆరోగ్యంపై వచ్చిన వదంతులను రష్యా వర్గాలు కొట్టిపారేశాయి. ఇలాంటి సమయంలో ఇలియా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Follow Us : Google News, Facebook, Twitter