Medical Student Preethi | సీనియర్ వేధింపులు భరించలేకనే వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమెను సీనియర్ విద్యార్థి సైఫ్ టార్గెట్ చేయడమే కాకుండా.. అందరి ముందు అవమానించాడని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. ఎంజీఎంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి సంబందించిన వివరాలను శుక్రవారం ఆయన మీడియా ముందు వివరించారు.
ప్రీతి చాలా తెలివైన, ధైర్యం గల అమ్మాయి అయినప్పటికీ తనది చాలా సున్నితమైన మనస్తత్వమని సీపీ రంగనాథ్ పేర్కొన్నారు. అయితే నాలుగు నెలలుగా ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధిస్తున్నాడని.. రీసెంట్‌గా కేస్ షీట్ విషయంలో తనను అవమానించేలా మాట్లాడడని తెలిపారు. దీనిపై ఈ నెల 18న వాట్సాప్ గ్రూప్‌లో ప్రీతిని కించపరిచేలా సైఫ్ పోస్టులు పెట్టాడని.. వీటిపై పర్సనల్‌గా ప్రీతి ప్రశ్నించిందని పేర్కొన్నారు. తన గురించి గ్రూప్‌లో చాట్ చేయడం సరికాదని.. తనతో ఏదైనా సమస్య ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకెళ్లాలని చూసిందని తెలిపారు. అయినపన్పటికీ సైఫ్ తనపై ఆధిపత్యం చలాయించాలని యత్నించాడని చెప్పారు. సైఫ్ తనను వేధిస్తున్నాడని ఫ్రెండ్స్‌తో చేసిన చాటింగ్‌లో ప్రీతి పేర్కొందన్న విషయాన్ని కూడా సీపీ బయటపెట్టారు. బ్రెయిన్ లేదంటూ సైఫ్ తనను హేళన చేసిన మాట్లాడుతున్నారని స్నేహితుల దగ్గర ఆవేదన చెందిందని చెప్పారు. ఒకవ్యక్తి ఇన్‌సల్ట్‌గా ఫీలైతే అది ర్యాగింగ్ కిందకే వస్తుందని సీపీ స్పష్టం చేశారు.

మొదట్నుంచి ప్రీతినే లక్ష్యంగా చేసుకుని సైఫ్ అవహేళన చేసినట్లు చాటింగ్‌లో వెల్లడైందని సీపీ రంగనాథ్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన రెండు మూడుసార్లు చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయని.. సీనియర్లును జూనియర్లు సార్ అని పిలవాలనే కల్చర్ అక్కడ ఉందని తెలిపారు. ఈ వేధింపుల గురించి ఈ నెల 20వ తేదీన తన తల్లిదండ్రులకు చెప్పుకుని ప్రీతి బాధపడిందని చెప్పారు. ఈ నెల 21వ తేదీన కాలేజీ యాజమాన్యం కూడా సైఫ్‌ను పిలిచి విచారణ చేపట్టిందని.. అయినా అతని తీరు మారలేదని తెలిపారు. ఈ క్రమంలోనే వేధింపులు తాళలేక ప్రీతి మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుందని వివరించారు. విచారణలో సేకరించిన వివరాల ఆధారంగా సైఫ్‌ను అరెస్టు చేశామని వెల్లడించారు. కేసును పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల్లో నిజం లేదని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల విచారణపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
Follow Us : Google News, Facebook, Twitte