Home Latest News IND vs AUS | వన్డే వార్‌కు ప్రాక్టీస్‌ షురూ.. వాంఖడేలో చెమటోడుస్తున్న టీమిండియా

IND vs AUS | వన్డే వార్‌కు ప్రాక్టీస్‌ షురూ.. వాంఖడేలో చెమటోడుస్తున్న టీమిండియా

IND vs AUS | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: చక్కటి ప్రదర్శనతో ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌ను వరుసగా నాలుగోసారి చేజిక్కించుకున్న టీమిండియా ఇక వన్డే సమరానికి సిద్ధమవుతున్నది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకోవడంతో పాటు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించిన రోహిత్‌ సేన.. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఇందులో భాగంగా శుక్రవారం వాంఖడే వేదికగా తొలి వన్డే జరుగనుంది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి వన్డేకు కెప్టన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులో లేకుండాపోగా.. వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అహ్మదాబాద్‌ టెస్టు అనంతరం నేరుగా ముంబై చేరుకున్న టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్‌ ప్రారంభించింది. బుధవారం కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు ప్లేయర్లంతా వాంఖడేలో ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు.

కుల్చా జోడీపైనే కన్ను..

ఒకానొక దశలో సీనియర్‌ స్పిన్నర్లను కాదని కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌కు విరివిగా అవకాశాలు ఇచ్చిన మేనేజ్‌మెంట్‌ ఇటీవలి కాలంలో పునరాలోచనలో పడింది. గాయం కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమైన కుల్దీప్‌ ఈ సిరీస్‌పైనే ఆశలు పెట్టుకోగా.. చాహల్‌ కూడా నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. ఈ ఏడాది ఆఖర్లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో జట్టులో సుస్థిర స్థానం సాధించాలంటే వీరిద్దరూ ఈ సిరీస్‌లో రాణించక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. వీరితో పాటు ప్రస్తుత జట్టులో సభ్యులైన వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా శిక్షణ కొనసాగిస్తున్నారు.

సిరాజ్‌పైనే ఆశలు..

భారత ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటుండగా.. ప్రస్తుతం భారత జట్టు హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌పైనే ఆశలు పెట్టుకుంది. జూన్‌ 7 నుంచి ఇంగ్లండ్‌లోని ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు.. ఈ ఏడాది ఆఖర్లో సొంతగడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో సిరాజ్‌ కీలకం కానున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి ఆసీస్‌తో నాలుగో టెస్టులో విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఇక టెస్టు ఫార్మాట్‌ను పక్కనపెట్టి.. బౌలర్లంతా తెల్లబంతితో స్వింగ్‌ రాబట్టే పనిలోపడ్డారు. బుధవారం వాంఖడే స్టేడియంలో సిరాజ్‌తో పాటు జైదేవ్‌ ఉనాద్కట్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌ చేస్తూ కనిపించారు.

సూర్య, ఇషాన్‌ ఫుల్‌ స్వింగ్‌లో

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రమాదకర ఆటగాడిగా పరిణమించిన సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించారు. హర్దిక్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ భారీషాట్లు ఆడేందుకు సాధన చేయగా.. సూర్యకుమార్‌ గ్రౌండ్‌ నలువైపులా షాట్లు ఆడాడు. వీరిద్దరితో పాటు పాండ్యా కూడా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయగా.. స్పిన్నర్లు సుదీర్ఘ స్పెల్స్‌ వేస్తూ కనిపించారు.

ద్రవిడ్‌ పర్యవేక్షణలో..

బుధవారం ప్రాక్టీస్‌ సందర్భంగా టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ దిలిప్‌ ఆటగాళ్లను పర్యవేక్షించారు. బౌలింగ్‌ కోచ్‌ పారస్‌ మాంబ్రే స్పిన్నర్లు, పేసర్లు బంతులు వేస్తున్న సమయంలో వారికి తగిన సూచనలు ఇవ్వగా.. త్రోడౌన్‌ స్పెషిలిస్ట్‌లు రాఘవేంద్ర, నువాన్‌ కూడా ఆటగాళ్లకు సహయపడ్డారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌ అగ్రస్థానంలో అశ్విన్‌.. ఏడు స్థానాలు ఎగబాకిన విరాట్‌ కోహ్లీ

Virat Kohli | ఆ భావనే నన్ను తినేసింది.. అంచనాల భారంతో సమస్యలు పెంచుకున్నా.. విరాట్‌ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

Hardik Pandya | ఈ మ్యాచ్‌ నెగ్గితే అతడే భావి భారత సారథి.. హార్దిక్‌ పాండ్యాపై ప్రశంసలు కురిపించిన సునీల్‌ గవాస్కర్‌

Mohammed Siraj | గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడిని: సిరాజ్‌

IND vs AUS | బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ మనదే.. ‘డ్రా’గా ముగిసిన చివరి టెస్టు.. కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు

Exit mobile version