Home Latest News Virat Kohli | ఆ భావనే నన్ను తినేసింది.. అంచనాల భారంతో సమస్యలు పెంచుకున్నా.. విరాట్‌...

Virat Kohli | ఆ భావనే నన్ను తినేసింది.. అంచనాల భారంతో సమస్యలు పెంచుకున్నా.. విరాట్‌ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

Virat Kohli | టైమ్‌ 2 న్యూస్‌, అహ్మదాబాద్‌: జట్టు కోసం పరుగులు చేయలేకపోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని.. భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. తన సొంత తప్పిదాల వల్లే చాలా కాలం శతకానికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చిందని విరాట్‌ అన్నాడు. ఇటీవల ముగిసిన ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌ నాలుగో టెస్టులో విరాట్‌ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన డే అండ్‌ నైట్‌ టెస్టు అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లీకి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. దాదాపు మూడున్నరేళ్లు మూడంకెల స్కోరుకు దూరంగా ఉన్న కోహ్లీ.. ఎట్టకేలకు అహ్మదాబాద్‌ టెస్టులో శతక్కొట్టాడు. కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో చివరి మ్యాచ్‌ ‘డ్రా’గా ముగియగా.. టీమిండియా 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

ఆఖరి మ్యాచ అనంతరం భారత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. విరాట్‌తో స్పెషల్‌ చిట్‌చాట్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా మూడేళ్ల పాటు టెస్టుల్లో సెంచరీ చేయకపోవడం ఎలా అనిపించింది అని ద్రవిడ్‌ అడిగిన ప్రశ్నకు విరాట్‌ స్పందించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ‘నా సొంత తప్పిదాల వల్లే ఇది జరిగింది. క్రీజులో దిగిన ప్రతి ఆటగాడికి మూడంకెల స్కోరు చేయాలని ఉంటుంది. మనందరం ఏదో ఒక స్థాయిలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం. అది నా విషయంలో ఎక్కువ కాలం పాటు కొనసాగింది. నేను 40-50 పరుగులతో సంతృప్తి పడే ఆటగాడిని కాదు. ఒక మ్యాచ్‌లో నేను 40 పరుగులు చేయగలిగానంటే.. సునాయాసంగా 150 చేయగనని నమ్ముతాను. ఆ రన్స్‌ నా జట్టుకు ఉపయోగపడుతాయని ఆలోచిస్తాను. అలాంటిది చాన్నాళ్ల పాటు జట్టుకు ఉపయోగ పడలేకపోతున్నానేమో అనే భావన నన్ను తినేసింది. క్లిష్ట పరిస్థితుల్లో మెరుగైన ప్రదర్శన చేసినప్పుడల్లా గర్వపడుతా’ అని విరాట్‌ అన్నాడు.

సుదీర్ఘ కెరీర్‌లో తానెప్పుడూ రికార్డుల కోసం ఆడలేదని.. మైలురాళ్లు కెరీర్‌లో భాగమే కానీ వాటి కోసం వెంపర్లాడే వ్యక్తిని కాదని విరాట్‌ మరోసారి స్పష్టం చేశాడు. ‘మూడేళ్ల పాటు టెస్టుల్లో శతంక చేయకపోవడం నన్ను బాధించింది. అయితే, నేనెప్పుడు రికార్డులు, మైలురాళ్ల కోసం ఆడలేదు. అసలు వాటి గురించి ఆలోచించను కూడా లేదు. కానీ అందరూ సెంచరీ గురించే మాట్లాడుతున్నారు. వాళ్లందరికీ చెప్పేది ఒక్కటే. జట్టు కోసం వీలైనంత సేపు బ్యాటింగ్‌ చేయడమే నా బాధ్యత. ఎక్కువ పరుగుల చేయడమే నా ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే సెంచరీలైనా, డబుల్‌ సెంచరీలైనా. హోటల్‌ బాయ్‌ నుంచి లిఫ్ట్‌లో ఉన్న వ్యక్తి వరకు ప్రతీ ఒక్కరూ సెంచరీ గురించే అడిగేవారు. అది నాకు కాస్త ఇబ్బంది కలిగించింది’ అని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. అహ్మదాబాద్‌ టెస్టులో ఎనిమిదిన్నర గంటల పాటు క్రీజులో పాతుకుపోయిన కోహ్లీ.. 186 పరుగులతో టీమిండియాకు భారీ స్కోరు అందించాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

TSPSC Paper Leak | ఏఈ పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ మొబైల్‌లో యువతుల ఫోన్ నంబర్లు, నగ్న చిత్రాలు

Mohammed Siraj | గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడిని: సిరాజ్‌

Exit mobile version