Home Entertainment Rashmika Mandanna |రష్మికకు కాంతారా సినిమాకు సంబంధమేంటి? ఎందుకు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు?

Rashmika Mandanna |రష్మికకు కాంతారా సినిమాకు సంబంధమేంటి? ఎందుకు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు?

Rashmika Mandanna | నేషనల్‌ క్రష్‌ రష్మిక మంధనపై ఈ మధ్య ట్రోల్స్‌ ఎక్కువైపోయాయి. అవి ఎంతలా పెరిగిపోయాయంటే.. తనపై వస్తున్న విమర్శలను తట్టుకోలేక ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించింది. ట్రోల్స్‌ వల్ల ఎంతగా బాధపడాల్సి వస్తుందో బాధతో తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల రష్మికపై ట్రోల్స్‌ ఎందుకు ఎక్కువయ్యాయి. ఆమెను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారంటే.. కాంతారా సినిమానే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇంతకీ రష్మికకు కాంతార సినిమాకు సంబంధమేంటి? ఎందుకు ఆమెను అంతలా ఆడుకుంటున్నారనే కదా అనుమానం..

అసలేమైందంటే.. కన్నడ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చిన కాంతార పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ప్రశంసలు అందుతున్నాయి. నిర్మాతలకు కోట్లను కుమ్మరిస్తున్నాయి. కన్నడ ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమా అంటూ కాంతార సినిమాకు కితాబులిస్తున్నారు. ఈ క్రమంలో కాంతార సినిమాను చూశారా అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. ఇంకా లేదని రష్మిక సమాధానమిచ్చింది. ఇంకా కాంతార సినిమాను చూడలేదని చెప్పడం వల్లనే ట్రోలర్స్‌ ఆమెను టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. సినిమా చూడకపోతే టార్గెట్‌ చేయడం ఏంటని అనుకుంటున్నారా? దీని వెనుక ఒక కారణం ఉంది.

అదేంటంటే రష్మిక.. కన్నడ అమ్మాయి. కూర్గ్‌లో పుట్టి పెరిగింది. రష్మికకు హీరోయిన్‌గా తొలి అవకాశం వచ్చింది కూడా కన్నడ ఇండస్ట్రీలోనే. కిర్రిక్‌ పార్టీ సినిమాతో రష్మిక హీరోయిన్‌గా మారింది. అన్నట్టు ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా.. రిషబ్‌ శెట్టి. కాంతార సినిమాకు హీరో కమ్‌ దర్శకుడు రెండూ ఈయనే. ఒక కన్నడ అమ్మాయి అయ్యి ఉండి.. కన్నడ ఇండస్ట్రీ గర్వించదగ్గ సినిమా వస్తే చూడవా? అది కూడా నిన్ను హీరోయిన్‌గా మార్చిన దర్శకుడి సినిమానే కదా? ఎందుకు చూడలేదు? కన్నడ సినిమాపై ఎందుకంత చిన్నచూపు ? అనే ఉద్దేశంలో ట్రోలర్స్‌ ఆడుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ట్రోల్స్‌ మధ్యలో కొంతమంది రష్మికను కూడా సపోర్ట్‌ చేస్తున్నారు. రష్మిక కాంతార సినిమా ఎందుకు చూడాలి? షూటింగ్స్‌ బిజీగా ఉండటం వల్ల సినిమా చూసి ఉండకపోవచ్చు? అంతేతప్ప ఆమె సినిమా చూడనని ఎక్కడా చెప్పలేదు కదా అంటూ రష్మికకు మద్దతు పలుకుతున్నారు.

Exit mobile version