Home Entertainment Kaikala Satyanarayana | చిరంజీవిని కైకాల సత్యనారాయణ కోరిన చివరి కోరిక అదే.. ఎమోషన్ అయిన...

Kaikala Satyanarayana | చిరంజీవిని కైకాల సత్యనారాయణ కోరిన చివరి కోరిక అదే.. ఎమోషన్ అయిన మెగాస్టార్

Kaikala Satyanarayana | సినీ ఇండస్ట్రీలో కైకాల సత్యనారాయణ, చిరంజీవి మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఒకరు హీరోగా సినిమాల్లోకి వచ్చి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకుంటే.. మరొకరు విలన్ పాత్రలతో సినిమాల్లోకి వచ్చి హీరోగా ఎదిగాడు. అందుకే ఇద్దరి మధ్య తొందరగానే స్నేహం కుదిరింది. ఏళ్లు గడిచినా ఆ అనుబంధం మరింత పెరుగుతూ వచ్చింది. కైకాల కూడా చిరును తమ్ముడూ అంటూ సొంత తోబుట్టువులా చూసుకునేవాడు.చిరంజీవి కూడా అంతే ఆప్యాయత చూపించేవాడు. అందుకే కైకాల గత ఏడాది అనారోగ్యంతో మంచానికే పరిమితమైతే.. చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి మరి బర్త్ డే వేడుకలు జరిపించాడు. బెడ్‌పైనే కేక్ కట్ చేయించి ఆనందించాడు. కానీ అదే కైకాలకు చివరి బర్త్ డే అవుతుందని ఊహించలేకపోయాడు చిరంజీవి. ఇప్పుడు అదే తలచుకుని కుమిలిపోతున్నాడు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో ఎమోషన్‌తో తన బాధనంతా రాసుకొచ్చాడు.

తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మృతిచెందడం తనను కలిచివేసిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపాడు. కైకాల తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటుడని ప్రశంసించాడు. సత్యనారాయణ పోషించిన వైవిధ్యమైన పాత్రలను దేశంలో మరెవరూ పోషించి ఉండరని అభిప్రాయపడ్డాడు. కైకాల సత్యనారాయణతో కలిసి ఎన్నో చిత్రాలను కలిసి నటించానని గుర్తు చేసుకున్నాడు. కైకాల నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం తనకు దక్కిందని తెలిపాడు. డైలాగ్ డెలివరీలో కైకాలది ప్రత్యేక పంథా అని కొనియాడారు.

కైకాల నిష్కల్మశమైన మనిషి అని.. ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే స్వభావం ఆయనది అని చిరంజీవి తెలిపార. తనను తమ్ముడూ అంటూ తోడబుట్టువులా ఆదరించేవాడని తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. కైకాలతో తనకు ఎన్నో మధుర జ్ణాపకాలు ఉన్నాయని.. ఆనందకరమైన సంఘటనలు ఉన్నాయని తెలిపాడు.

కైకాలకు నటన, రుచికరమైన భోజనం రెండూ ప్రాణమని చిరంజీవి చెప్పుకొచ్చాడు. తన శ్రీమతి సురేఖ చేతివంటను ఎంతో ఇష్టంగా తినేవాడని తెలిపాడు. కిందటి ఏడాది ఆయన బర్త్ డే సందర్భంగా కైకాల ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పిన సంతృప్తి తనకు మిగిలిందని ఈ సందర్భంగా చిరంజీవి పేర్కొన్నాడు. ఆ టైమ్‌లో సురేఖతో.. అమ్మా ఉప్పు చేప వండి పంపించు అని అన్నప్పుడు మీరు త్వరగా కోలుకోండి ఉప్పు చేపతో భోజనం చేద్దామని అన్నామంటూ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ క్షణంలో కైకాల చిన్న పిల్లాడిలా మురిసిపోయాడని తెలిపాడు. గొప్ప సినీ సంపదను అందించి కైకాల వెళ్లిపోయారని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని కోరుకుంటున్నా అని పేర్కొన్నాడు.

నిర్మాణం కూడా కలిసే..

చిరంజీవి, కైకాల కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. విజేత, కొండవీటి రాజా, మగధీరుడు, చక్రవర్తి, జేబుదొంగ, మంచి దొంగ, యముడికి మొగుడు, ఖైదీ నంబర్ 786, రుద్రవీణ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, స్టేట్ రౌడీ, కొదమ సింహం, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, మెకానిక్ అల్లుడు, బావగారు బాగున్నారా వంటి చాలా హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. అంతేకాదు చిరంజీవితో తన రమా ఫిలింస్‌పై కొదమ సింహం సినిమా నిర్మించాడు కైకాల. ఈ సినిమాతో పాటు కైకాల నిర్మించిన పలు చిత్రాలకు చిరంజీవి సహనిర్మాతగా కూడా వ్యవహరించాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Kaikala satayanarayana | టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటుడు కైకాల కన్నుమూత

Kaikala Satyanarayana | హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. ఆయన వల్లే విలన్‌గా మారిన కైకాల

Kaikala Satyanarayana | కైకాల సత్యనారాయణ కోరికతో లక్షలు పోగొట్టుకున్న రామానాయుడు

Exit mobile version