Home Latest News World Test Championship | డబ్ల్యూటీసీ ఫైనల్‌ తేదీ ఖరారు.. ఓవల్‌ వేదికగా జూన్‌...

World Test Championship | డబ్ల్యూటీసీ ఫైనల్‌ తేదీ ఖరారు.. ఓవల్‌ వేదికగా జూన్‌ 7 నుంచి బిగ్‌ మ్యాచ్‌

Image Source: www.icc-cricket.com

World Test Championship | దుబాయ్‌: వన్డే, టీ20 ఫార్మాట్లలో వరల్డ్‌కప్‌లు నిర్వహిస్తున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ( ICC ).. టెస్టు క్రికెట్‌లో నూతనొత్తేజం తెచ్చేందుకు రెండేళ్లకోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌ నిర్వహించాలని నిర్ణయించింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో రెండేళ్ల పాటు నిలకడగా రాణించి అత్యధిక పాయింట్లు సాధించిన రెండు జట్ల మధ్య ఈ తుదిపోరు జరుగుతుంది.

తొలిసారి జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌పై నెగ్గిన న్యూజిలాండ్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఇక రెండో డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఐసీసీ తేదీ ఖరారు చేసింది. జూన్‌ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో ఈ మ్యాచ్‌ నిర్వహించనున్నట్లు ఐసీసీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. జూన్‌ 12ను రిజర్వ్‌డే గా ప్రకటించింది. వందకు పైగా టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన ఘనచరిత్ర ఉన్న ఓవల్‌లో ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగనుంది.

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ కీలకం

ఐసీసీ టెస్టు హోదా కలిగిన సభ్య దేశాల మధ్య ఈ రెండేళ్లలో 24 సిరీస్‌లు 61 టెస్టు మ్యాచ్‌లు జరగగా.. అందులో ప్రస్తుతం ఆస్ట్రేలియా 136 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో 14 మ్యాచ్‌లాడి వాటిలో ఎనిమిదింట గెలిచి రెండో స్థానంలో ఉన్న టీమిండియా 99 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

కాగా.. గురువారం నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్‌-గవాస్కర్‌’ టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుండగా.. ఇందులో నెగ్గిన జట్టు నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 లేదా అంతకంటే మెరుగైన ఫలితంతో భారత్‌ గెలిస్తే.. వరుసగా రెండోసారి తుదిపోరు ఆడే చాన్స్‌ దక్కించుకోనుంది.

ఇతర జట్లలో శ్రీలంక, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ కూడా ఫైనల్‌ బెర్త్‌ కోసం శ్రమిస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరుగనున్న సిరీస్‌ అనంతరం ఫైనలిస్ట్‌లు ఎవరో తేలనుంది.

తటస్థ వేదిక..

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను మొదట లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో నిర్వహించాలని ఐసీసీ భావించినా.. చివరకు ఓవల్‌ను ఖరారు చేసింది. ఈ స్టేడియంలో 1845 నుంచి మ్యాచ్‌లు జరుగుతుండగా.. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో తొలి టెస్టు (1880) ఇక్కడే నిర్వహించారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న తటస్థ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగనుండటం మంచి పరిణామమని ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ పేర్కొన్నాడు.

‘ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వంటి పెద్ద మ్యాచ్‌ తటస్థ వేదికపై జరగడం మంచిదే. అప్పుడే ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉంటాయి. చాన్నాళ్లు మా జట్టు నిలకడగా రాణిస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ దక్కితే సంతోషం. అది మా జట్టులో మరింత స్ఫూర్తి పెంచుతుంది. నావరకైతే ఫైనల్లో చోటు దక్కుతుందనే భావిస్తున్నా. భారత్‌పై సిరీస్‌ నెగ్గి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలనుకుంటున్నాం. భారత్‌లో భారత్‌ను ఓడించడం ఎప్పుడూ కష్టమైన పనే.. కానీ మా కుర్రాళ్లలో ఆ సత్తా ఉంది. జట్టుగా ఆడుతూ మెరుగైన ఫలితాలు రాబడతాం’ అని కమిన్స్‌ పేర్కొన్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rohit Sharma | మాటల్లో కాదు చేతల్లో పోటీపడండి.. కంగరూలకు రోహిత్‌శర్మ చురక

Border Gavaskar Trophy | బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ.. ఆసీస్‌తో తొలి టెస్టులో అక్షర్‌ పటేల్‌కు షాకిచ్చిన రవిశాస్త్రి

Rahul Dravid on Border Gavaskar Trophy| టెస్టు క్రికెట్‌లో అదే ముఖ్యం.. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

Transgender Pregnant | పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అబ్బాయి.. సోషల్‌ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్న అతని భార్య

KA Paul | సీఎం క్యాంప్‌ ఆఫీసును తగలబెట్టాలన్న రేవంత్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు.. కేఏ పాల్‌ ఫైర్‌!

Exit mobile version