Home Latest News Rishab pant health update | పంత్‌ కోలుకునేందుకు ఆరు నెలలు పట్టొచ్చు.. టీమిండియా క్రికెటర్‌...

Rishab pant health update | పంత్‌ కోలుకునేందుకు ఆరు నెలలు పట్టొచ్చు.. టీమిండియా క్రికెటర్‌ హెల్త్‌పై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన వైద్యులు

Image Source : www.bcci.tv

Rishab pant health update | యాక్సిడెంట్‌కు గురైన టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ ఆరోగ్యం గురించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. మెదడు, వెన్నెముక ఎంఆర్‌ఐ స్కానింగ్‌ రిపోర్టులు సాధారణంగా వచ్చాయని డెహ్రూడూన్‌ మ్యాక్స్‌ హాస్పిటల్‌ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పంత్‌ ఆరోగ్యం స్థిరంగా ఉందని.. అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ముఖం, శరీరంపై, ఇతర పగిలిన గాయాలకు ప్లాస్టిక్‌ సర్జరీ నిర్వహించినట్టు పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం పంత్‌ను ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడటంతో పంత్‌ కోలుకునేందుకు కనీసం ఆరు నెలలు సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో క్రికెట్‌కు పంత్ ఏడాది దూరం కాకతప్పదని తెలుస్తోంది.

ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ ఎప్పటికప్పుడు పంత్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పంత్‌ ఆరోగ్యం గురించి బీసీసీఐ కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నది. పంత్‌ నుదురు భాగం చిట్లినట్టయ్యిందనీ.. రెండు చోట్ల చర్మం తెగిందని, వీపుపై కాలిన గాయాలు ఉన్నాయని.. అలాగే కుడి మోకాలి లిగ్మెంట్‌ కదిలినట్లు అయ్యిందని బీసీసీఐ కార్యదర్శి జై షా శుక్రవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు.

సర్‌ప్రైజ్‌ చేద్దామని వెళ్లి.. యాక్సిడెంట్‌కు గురై..

వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లకు పంత్‌ సెలెక్ట్‌ అవ్వలేదు. దీంతో దొరికిన గ్యాప్‌ను ఫ్యామిలీతో గడుపుదామని అనుకున్నాడు. క్రిస్మస్‌కు దుబాయ్‌లో ధోనీ కుటుంబంతో సరదాగా గడిపిన పంత్‌.. వెంటనే ఇండియా వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి తన స్వగ్రామం రూర్కీకి తన బీఎండబ్ల్యూ కారులో బయల్దేరాడు. అయితే ఢిల్లీ – డెహ్రాడూన్‌ హైవేపై హరిద్వార్‌ జిల్లా మంగ్లూర్‌ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కారు అద్దాలు పగులగొట్టుకుని పంత్‌ బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స కొనసాగుతోంది. వైద్యానికి అయ్యే ఖర్చులన్నింటినీ తమ ప్రభుత్వమే భరిస్తుందని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ షింగ్‌ వెల్లడించారు.

Exit mobile version