Home Latest News PV Sindhu | పీవీ సింధు రన్నరప్‌తో సరి.. స్పెయిన్‌ మాస్టర్స్‌ ఫైనల్లో పరాజయం

PV Sindhu | పీవీ సింధు రన్నరప్‌తో సరి.. స్పెయిన్‌ మాస్టర్స్‌ ఫైనల్లో పరాజయం

PV Sindhu | టైమ్‌ 2 న్యూస్‌, మాడ్రిడ్‌: ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నీ ఫైనల్‌కు చేరిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. రెండుసార్లు ఒలింపిక్‌ పతకం నెగ్గిన ఏకైక భారత మహిళగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. గాయం నుంచి కోలుకున్న అనంతరం లయ దొరకబుచ్చుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. నిరుడు ఆగస్టులో బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన అనంతరం సింధు.. మరో మేజర్‌ టైటిల్‌ గెలువలేకపోయింది. వరుస టోర్నీలో విఫలమవుతున్న సింధు.. ఇటీవల బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో చోటు కోల్పోయింది. వచ్చే ఏడాది పారిస్‌ వేదికగా జరుగున్న ఒలింపిక్స్‌ పతకం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేస్తుందనే అంచనాల నేపథ్యంలో సింధుపై భారీ ఆశలు ఉన్న విషయం తెలిసిందే.

గత వారం స్విస్‌ ఓపెన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన సింధు.. త్వరగానే నిష్క్రమించినా.. స్పెయిన్‌ మాస్టర్స్‌ టోర్నీలో సత్తాచాటింది. మాడ్రిడ్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో వరుస విజయాలు సాధించిన తెలుగమ్మాయి నేరుగా ఫైనల్‌కు చేరింది. భారత స్టార్‌ షట్లర్లంతా ఒకరి వెంట ఒకరు వెనుదిరిగిన చోట సింధు చక్కటి ఆటతీరు కనబర్చింది. కిడాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, లక్ష్యసేన్‌ సహా ఇతర ఆటగాళ్లంతా సెమీస్‌కు చేరకుండానే ఇంటి బాటపట్టగా.. సింధు మాత్రం తనదైన శైలిలో దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో సత్తాచాటిన సింధు.. ఫైనల్లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది.

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఆదివారం రెండో సీడ్‌ సింధు 8-21, 8-21తో గ్రెగోరియా మారిస్కా (ఇండోనేషియా) చేతిలో ఓటమి పాలైంది. టోర్నీ ఆసాంతం రాణించిన తెలుగమ్మాయి.. తుదిపోరులో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రత్యర్థికి కనీస పోటీనివ్వలేక వరుస గేమ్‌ల్లో పరాజయం పాలైంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న సింధు.. తుదిపోరులో మరీ ఇబ్బందికరంగా కనిపించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్‌ టూర్‌ చివరి సారిగా నిరుడు జూలైలో సింగపూర్‌ ఓపెన్‌ నెగ్గిన అనంతరం సింధుకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం. 27 ఏండ్ల హైదరాబాదీ.. ప్రస్తుతం విధి చౌదరీ వద్ద శిక్షణ తీసుకుంటోంది. మరోవైపు జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన గ్రెగోరియా.. సీనియర్‌ స్థాయిలో అదే జోరు కొనసాగిస్తూ సింధు చిత్తుచేసింది. తొలి గేమ్‌ ఆరంభంలోనే 5-1తో ఆధిక్యంలోకి వెళ్లిన గ్రెగోరియా.. ఆ తర్వాత ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సింధుకు కనిస అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లు నెగ్గుతూ ఆధిక్యం అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. సునాయాసంగా తొలి గేమ్‌ను గెలుచుకున్న ఇండోనేషియా షట్లర్‌.. రెండో గేమ్‌లో అదే జోరు కొనసాగించింది. చివర్లోనైనా తెలుగమ్మాయి పుంజుకుంటుందనుకుంటే.. అది అత్యాశే అయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Costumes Krishna | కాస్ట్యూమ్స్‌ కృష్ణ తీసిన సినిమా సూపర్‌ హిట్టయినా ఇండస్ట్రీని ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చింది? ఆ స్టార్‌ హీరోను నమ్మడమే కారణమా?

Costumes Krishna | ఆయన వల్లే కాస్ట్యూమర్‌గా బిజీగా ఉన్న కృష్ణ.. నటుడిగా మారాల్సి వచ్చింది!

Kajal Aggarwal | బాలీవుడ్‌లో ఎక్కడ తప్పు జరుగుతుందో చెప్పిన టాలీవుడ్ చందమామ కాజల్

Costume Krishna | ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్‌ కృష్ణ మృతి

IPL 2023 | అట్టహాసంగా ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు.. సందడి చేసిన తమన్నా, రష్మిక మందానా.. హోరెత్తిన తెలుగు పాటలు

Sai Pallavi | మేకప్ ఎందుకు వేసుకోదో అసలు సీక్రెట్ బయటపెట్టిన సాయిపల్లవి

Exit mobile version