Home Latest News Sunrisers Hyderabad | పరాజయంతో రైజర్స్‌ ప్రయాణం ప్రారంభం.. రాజస్థాన్‌ చేతిలో హైదరాబాద్‌ ఓటమి

Sunrisers Hyderabad | పరాజయంతో రైజర్స్‌ ప్రయాణం ప్రారంభం.. రాజస్థాన్‌ చేతిలో హైదరాబాద్‌ ఓటమి

Sunrisers Hyderabad | టైమ్‌ 2 న్యూస్‌, హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌కు భంగపాటు ఎదురైంది. ఆదివారం ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియంలో పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 72 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత ఇరవై ఓవర్లలో 203/5 స్కోరు చేసింది. కెప్టెన్‌ శాంసన్‌ (32 బంతుల్లో 55, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), బట్లర్‌ (22 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్‌ (37 బంతుల్లో 54; 9 ఫోర్లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. బట్లర్‌ ఆది నుంచే రైజర్స్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. బౌండరీలతో విరుచుకుపడుతూ రాయల్స్‌ భారీ స్కోరుకు కారణమయ్యాడు. ఇన్ని సీజన్లు తమ భీకర బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టిన రైజర్స్‌ సొంత ఇలాఖాలో చేష్టలుడిగిపోయింది. లక్ష్యఛేదనకు దిగిన రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. బౌల్ట్‌ ఆదిలోనే దెబ్బతీస్తే.. చాహల్‌ మిగతా పనిని పూర్తి చేశాడు. మొత్తంగా పెవిలియన్‌ వెళ్లేందుకు పోటీపడ్డ రైజర్స్‌ మూల్యం చెల్లించుకుంది. అబ్దుల్‌ సమద్‌ (32) టాప్‌స్కోరర్‌గా నిలువగా, మిగతా వారు ఘోరంగా నిరాశపరిచారు. ధనాధన్‌ అర్ధసెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించిన బట్లర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

కలిసిరాని సెంటిమెంట్‌

సొంతగడ్డపై భారీ విజయంతో బోణీ కొడుదామనుకున్న హైదరాబాద్‌ తొలి మ్యాచ్‌లో ఘోరంగా కంగుతిన్నది. పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి ప్రత్యర్థి రాజస్థాన్‌ రాయల్స్‌ ముందు సాగిలపడిపోయింది. రాజస్థాన్‌ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్‌.. 131/8కే పరిమితమైంది. ట్రెంట్‌ బౌల్ట్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే అభిషేక్‌శర్మ, రాహుల్‌ త్రిపాఠిని డకౌట్‌గా పెవిలియన్‌ పంపి కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆ తర్వాత అబ్దుల్‌ సమద్‌, మయాంక్‌ అగర్వాల్‌(27) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. చాహల్‌ నాలుగు వికెట్లతో రైజర్స్‌ పతనాన్ని శాసించాడు. పిచ్‌ను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ రైజర్స్‌ బ్యాటర్ల పనిపట్టాడు. కనీసం కుదురుకునేందుకు ప్రయత్నించని హైదరాబాద్‌ బ్యాటర్లు పెవిలియన్‌లో ఏదో పని ఉన్నట్లు క్యూ కట్టిన తీరు స్థానిక అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మ్యాచ్‌ పూర్తికాక ముందే ఫ్యాన్స్‌ స్టేడియం వీడటం మ్యాచ్‌ తీరుకు అద్దం పట్టింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన హైదరాబాద్‌ తమ తొలి మ్యాచ్‌లోనే అభిమానులను ఉసూరుమనిపించింది. తమ తదుపరి పోరులో ఈ నెల ఏడున లక్నో సూపర్‌జెయింట్స్‌తో హైదరాబాద్‌ తలపడుతుంది.

బట్లర్‌ బాదుడే బాదుడు:

తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తాత్కాలిక కెప్టెన్‌ భువనేశ్వర్‌కుమార్‌కు తాను తీసుకున్న నిర్ణయం తప్పని కొద్దిసేపట్లోనే అర్థమైంది. సూపర్‌ ఫామ్‌మీదున్న జోస్‌ బట్లర్‌ ఆది నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రైజర్స్‌ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ బౌండరీలతో దుమ్మురేపాడు. బౌలర్‌ ఎవరన్నది లెక్కచేయకుండా బ్యాటు ఝులిపిస్తూ స్కోరుబోర్డును పరిగెత్తించాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన భువీని ఒక రకంగా కనుకరించిన బట్లర్‌.. వాషింగ్టన్‌ సుందర్‌ను ఉతికి ఆరేశాడు. మరో ఎండ్‌లో తానేం తక్కువ కాదన్నట్లు యశస్వి జైస్వాల్‌కు కూడా జతకలువడంతో రాయల్స్‌ స్కోరు రాకెట్‌ వేగాన్ని తలపించింది.

సుందర్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో తొలి రెండు బంతులను భారీ సిక్స్‌లుగా మలిచిన బట్లర్‌ తన ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత బౌలింగ్‌కు దిగిన నటరాజన్‌ను అయితే బట్లర్‌ ఉతికి ఆరేశాడు. నాలుగు ఫోర్లతో తన బ్యాటింగ్‌ పవర్‌ ఏంటో రుచిచూపించాడు. బట్లర్‌ కొట్టిన కొట్టుడుకు స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఒకానొక దశలో కెప్టెన్‌ భువీకి ఏం చేయాలో అర్థం కాక బౌలర్‌ను మార్చే ప్రయత్నం చేశాడు. అదీ కూడా ఫలించలేదు. నటరాజన్‌ స్థానంలో బౌలింగ్‌కు వచ్చిన ఫజుల్లాక్‌ ఫారుఖీకి బట్లర్‌ పట్టపగలే చుక్కలు చూపించాడు. పొట్టి ఫార్మాట్‌ మజాను చూపిస్తూ మూడు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఇరవై బంతుల్లోనే ఈ హార్డ్‌ హిట్టర్‌ అర్ధసెంచరీ మార్క్‌ అందుకున్నాడు. అయితే అదే దూకుడు కనబరిచే క్రమంలో బట్లర్‌ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి రాజస్థాన్‌ వికెట్‌ నష్టానికి 85 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఐపీఎల్‌ చరిత్రలోనే రాజస్థాన్‌కు పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు కావడం విశేషం. మొత్తంగా పవర్‌ప్లేలో రాయల్స్‌కు బౌండరీల రూపంలో 70 పరుగులు వచ్చాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

PV Sindhu | పీవీ సింధు రన్నరప్‌తో సరి.. స్పెయిన్‌ మాస్టర్స్‌ ఫైనల్లో పరాజయం

LSG vs DC | సొంతగడ్డపై లక్నో తొలి విజయం.. 50 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి

Costumes Krishna | కాస్ట్యూమ్స్‌ కృష్ణ తీసిన సినిమా సూపర్‌ హిట్టయినా ఇండస్ట్రీని ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చింది? ఆ స్టార్‌ హీరోను నమ్మడమే కారణమా?

Costumes Krishna | ఆయన వల్లే కాస్ట్యూమర్‌గా బిజీగా ఉన్న కృష్ణ.. నటుడిగా మారాల్సి వచ్చింది!

Exit mobile version