Home Latest News DC vs GT | చక్రం తిప్పిన సుదర్శన్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసిన గుజరాత్‌ టైటాన్స్‌

DC vs GT | చక్రం తిప్పిన సుదర్శన్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసిన గుజరాత్‌ టైటాన్స్‌

DC vs GT | టైమ్‌ 2 న్యూస్‌, న్యూఢిల్లీ: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో రెండో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (37; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ (30), అభిషేక్‌ పొరెల్‌ (20) పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (22 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో ఢిల్లీ పోరాడే స్కోరు చేయగలిగింది. గుజరాత్‌ బౌలర్లలో మహమ్మద్‌ షమీ, రషీద్‌ ఖాన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. అల్జారీ జోసెఫ్‌ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ (48 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధశతకం సాధించగా.. విజయ్‌ శంకర్‌ (29), డేవిడ్‌ మిల్లర్‌ (16 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.

పేస్‌తో షమీ.. స్పిన్‌తో రషీద్‌

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. యువ ఓపెనర్‌ పృథ్వీషా (7) మూడో ఓవర్‌లోనే పెవిలియన్‌ చేరగా.. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన మిషెల్‌ మార్ష్‌ (4) అతడిని అనుసరించాడు. ఈ రెండు వికెట్లు షమీ ఖాతాలో చేరాయి. ఈ దశలో సర్ఫరాజ్‌ ఖాన్‌ అండతో కెప్టెన్‌ వార్నర్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేస్తుండటంతో.. పరుగుల రాక కష్టమైంది. వార్నర్‌ అడపా దడపా బౌండ్రీలు కొట్టినా.. సర్ఫరాజ్‌ రన్స్‌ రాబట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇక కుదురుకున్నట్లే అనుకుంటున్న దశలో అల్జారీ జోసెఫ్‌ ఢిల్లీని దెబ్బతీశాడు. వరుస బంతుల్లో వార్నర్‌తో పాటు రొసో (0)ను ఔట్‌ చేశాడు. డేవిడ్‌ భాయ్‌ క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. రాహుల్‌ తెవాటియా పట్టిన కండ్లు చెదిరే క్యాచ్‌కు రొసో పెవిలియన్‌ బాటపట్టాడు. మిడిల్‌ ఓవర్స్‌లో రషీద్‌ ఖాన్‌ ధాటికి ఢిల్లీ పరుగులు చేయలేకపోయింది. ఆఖర్లో అక్షర్‌ బ్యాట్‌కు పనిచెప్పడంతో ఢిల్లీ ఓ మాదిరి స్కోరు చేయగలిగింది.

సూపర్‌ సుదర్శన్‌..

ఛేదనలో గుజరాత్‌కు కూడా మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్‌ చెరో 14 పరుగులు చేసి పెవిలియన్‌ చేరగా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (5) నిరాశ పరిచాడు. దక్షిణాఫ్రికా పేస్‌ గన్‌ అన్రిచ్‌ నోర్జే నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సాయి సుదర్శన్‌ చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు దిగిన విజయ్‌ శంకర్‌తో కలిసి సుదర్శన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. టార్గెట్‌ పెద్దది కాకపోవడంతో ఈ జోడీ ఒక్కో పరుగు జోడిస్తూ ముందుకుసాగింది. కొన్ని షాట్లు ఆడిన విజయ్‌ శంకర్‌ ఔటైనా.. డేవిడ్‌ మిల్లర్‌ రాకతో మ్యాచ్‌ స్వరూపం మారిపోయింది. అప్పటి వరకు కాస్త కష్టంగా కనిపించిన లక్ష్యాన్ని మిల్లర్‌ తన వీరబాదుడుతో సునాయాసం చేసేశాడు. ఈ క్రమంలో సుదర్శన్‌ 44 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో వీరిద్దరూ విజృంభించడంతో గుజరాత్‌ గెలుపు తీరాలకు చేరింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

SSC Exam Paper Leak | పదో తరగతి పరీక్షల్లో రెండో రోజూ అదే సీన్‌.. అరగంటలోనే వాట్సాప్‌లోకి వచ్చేసిన హిందీ పేపర్‌

Siddipet | సిద్దిపేట అడిషనల్‌ కలెక్టర్‌పై వీధికుక్క దాడి.. వాకింగ్‌ చేస్తుండగా పిక్కపట్టి కొరికేసిన శునకం

Nikhat Zareen | బాక్సింగ్‌ అకాడమీ ఏర్పాటుకు నిఖత్‌ జరీన్‌ ప్లాన్‌?

Exit mobile version