Home Latest News Rishabh Pant | గుజరాత్‌, ఢిల్లీ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథి.. స్టాండ్స్‌లో సందడి చేసిన రిషబ్‌...

Rishabh Pant | గుజరాత్‌, ఢిల్లీ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథి.. స్టాండ్స్‌లో సందడి చేసిన రిషబ్‌ పంత్‌

Rishabh Pant | టైమ్‌ 2 న్యూస్‌, ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో గుజరాత్‌, ఢిల్లీ మధ్య జరిగిన పోరుకు ఓ ప్రత్యేక అతిథి విచ్చేశాడు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించిన టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ ఈ మ్యాచ్‌ను వీక్షించాడు. గతేడాది ఆఖర్లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్‌ పంత్‌.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు డెహ్రాడూన్‌లోని తన ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతుండగా.. ఐపీఎల్‌ ఆరంభం కావడంతో తన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌లో జోష్‌ నింపేందుకు పంత్‌.. మంగళవారం మ్యాచ్‌కు విచ్చేశాడు. బీసీసీఐ అనుమతితో ఫ్రాంచైజీ సహకారంతో పంత్‌ మైదానానికి విచ్చేశాడు. అయితే ప్లేయర్లు కూర్చునే డగౌట్‌లో కాకుండా.. ఫ్రాంచైజీ ఓనర్లకు సంబంధించిన ప్రత్యేకమైన స్టాండ్‌ నుంచి పంత్‌ మ్యాచ్‌ చూశాడు.

గత మ్యాచ్‌లో పంత్‌ను గుర్తు చేసుకుంటూ.. ఢిల్లీ డగౌట్‌లో అతడి జెర్సీని వేలాడదీసిన విషయం తెలిసిందే. క్యాపిటల్స్‌ తరఫున పంత్‌ వినియోగించే జెర్సీని డగౌట్‌లో ఉంచడంపై బీసీసీఐ సహా.. పలువురు విమర్శించారు. కోలుకుంటున్న పంత్‌ విషయంలో ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు సరైనవి కావని మందలించింది. దీంతో తప్పు దిద్దుకున్న ఢిల్లీ యాజమాన్యం మంగళవారం మ్యాచ్‌కు అతడినే రప్పించింది. ప్రత్యేక ఏర్పాట్లతో పంత్‌ను మైదానానికి తీసుకురాగా.. మాజీ కెప్టెన్‌ స్టాండ్స్‌ నుంచి మ్యాచ్‌ చూస్తూ అభిమానుల్లో జోష్‌ నింపాడు. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షాతో పాటు.. ఇతర బోర్డు పెద్దలు పంత్‌ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు కుటుంబ సభ్యుల వద్దకు చేరుకుంటున్న సమయంలో పంత్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌ను కొందరు హస్పిటల్‌కు తరలించగా.. బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అతడికి చికిత్సి అందించింది. మోకాలికి శస్త్రచికిత్స జరగడంతో పంత్‌ కాలుకు పట్టి వేసుకొని కనిపించాడు.

అయితే పంత్‌ జట్టు సభ్యుల్లో జోష్‌ నింపినా.. సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ పరాజయం పాలైంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆకట్టుకోలేక వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. గత మ్యాచ్‌లో లక్నో చేతిలో ఓడిన ఢిల్లీ తాజా పోరులో గుజరాత్‌ చేతిలో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (37; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ (30), అభిషేక్‌ పొరెల్‌ (20), అక్షర్‌ పటేల్‌ (22 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో మహమ్మద్‌ షమీ, రషీద్‌ ఖాన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగాట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ (48 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధశతకం సాధించగా.. విజయ్‌ శంకర్‌ (29), డేవిడ్‌ మిల్లర్‌ (16 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

SSC Exam Paper Leak | పదో తరగతి పరీక్షల్లో రెండో రోజూ అదే సీన్‌.. అరగంటలోనే వాట్సాప్‌లోకి వచ్చేసిన హిందీ పేపర్‌

Siddipet | సిద్దిపేట అడిషనల్‌ కలెక్టర్‌పై వీధికుక్క దాడి.. వాకింగ్‌ చేస్తుండగా పిక్కపట్టి కొరికేసిన శునకం

Nikhat Zareen | బాక్సింగ్‌ అకాడమీ ఏర్పాటుకు నిఖత్‌ జరీన్‌ ప్లాన్‌?

Exit mobile version