Home Latest News GT vs RR | శాంసన్‌, హెట్‌మైర్‌ దంచుడే దంచుడు.. గుజరాత్‌పై రాజస్థాన్‌ గ్రాండ్‌విక్టరీ

GT vs RR | శాంసన్‌, హెట్‌మైర్‌ దంచుడే దంచుడు.. గుజరాత్‌పై రాజస్థాన్‌ గ్రాండ్‌విక్టరీ

GT vs RR | టైమ్‌ 2 న్యూస్‌, అహ్మదాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జోరు కొనసాగుతోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న రాయల్స్‌ వరుసగా మూడో విజయం ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్ట పరుచుకుంది. ఆదివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో రాజస్థాన్‌ 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌పై విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (34 బంతుల్లో 45; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), మిల్లర్‌ (30 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (19 బంతుల్లో 28; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌), సాయి సుదర్శన్‌ (20) పర్వాలేదనిపించగా.. అభినవ్‌ మనోహర్‌ (13 బంతుల్లో 27; 3 సిక్సర్లు) ఆఖర్లో వేగంగా ఆడాడు. రాజస్థాన్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ 2, ట్రెంట్‌ బౌల్ట్‌, ఆడమ్‌ జంపా, యుజ్వేంద్ర చాహల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

రషీద్‌కు హ్యాట్రిక్‌ సిక్సర్లు

ఓ మోస్తారు లక్ష్యఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్‌కు శుభారంభం దక్కలేదు. హార్దిక్‌ పాండ్యా వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (1) స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ కాగా.. మహమ్మద్‌ షమీ మరుసటి ఓవర్‌లో జోస్‌ బట్లర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. షమీ వేగానికి వికెట్లు గాల్లో గింగిరాలు కొట్టిన తీరు చూసి తీరాల్సిందే. పేలవ ఆరంభం లభించినా.. మిడిలార్డర్‌ రాణించడంతో రాజస్థాన్‌ సులువుగా విజయం సాధించగలిగింది. దేవదత్‌ పడిక్కల్‌ (26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు వేగంగా ఆడగా.. సంజూ శాంసన్‌ (32 బంతుల్లో 60; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

మొదట్లో కాస్త ఆచితూచి ఆడిన రాయల్స్‌ సారథి.. మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పూనకం వచ్చినవాడిలా చెలరేగిపోయాడు. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లు రషీద్‌ను ఎదుర్కొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. అతడి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదిన సంజూ మైదానాన్ని ఉర్రూతలూగించాడు. ఫలితంగా ఛేదనలో రాజస్థాన్‌ 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 179 రన్స్‌ చేసింది. శాంసన్‌ మిడిల్‌ ఓవర్స్‌లో మంచి పునాది వేస్తే.. ఆఖర్లో హెట్‌మైర్‌ (26 బంతుల్లో 56 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో రాజస్థాన్‌ మరో నాలుగు బంతులు మిగిలుండగానే గెలుపు గీత దాటింది. ధ్రువ్‌ జురేల్‌ (18; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌ (3 బంతుల్లో 10; ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌) ఆఖర్లో విలువైన పరుగులు జోడించారు. గుజరాత్‌ బౌలర్లలో షమీ 3, రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లు పడగొట్టారు. హెట్‌మైర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

DC vs RCB | ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదో ‘సారీ’.. మళ్లీ ఓడిన వార్నర్‌ సేన.. బెంగళూరుకు రెండో విజయం

PBKS vs LSG | రాహుల్‌ రాణించినా.. లక్నోకు తప్పని పరాజయం.. పంజాబ్‌ కింగ్స్‌ మూడో గెలుపు

Exit mobile version