Home Latest News PBKS vs LSG | రాహుల్‌ రాణించినా.. లక్నోకు తప్పని పరాజయం.. పంజాబ్‌ కింగ్స్‌ మూడో...

PBKS vs LSG | రాహుల్‌ రాణించినా.. లక్నోకు తప్పని పరాజయం.. పంజాబ్‌ కింగ్స్‌ మూడో గెలుపు

PBKS vs LSG | టైమ్‌ 2 న్యూస్‌, లక్నో: ఐపీఎల్‌ 16వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ మూడో విజయం నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు రుచి చూసిన పంజాబ్‌.. శనివారం జరిగిన రెండో పోరులో 2 వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో షారుక్‌ ఖాన్‌ పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు.

మొదట బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (56 బంతుల్లో 74; 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకం సాధించగా.. కైల్‌ మయేర్స్‌ (29; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) రాణించాడు. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌ కరన్‌ 3, కగిసో రబడ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్‌ 19.3 ఓవర్లలో 8 వికెట్లకు 161పరుగులు చేసింది. సికందర్‌ రజా (41 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మాథ్యూ షార్ట్‌ (34; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) పోరాడగా.. ఆఖర్లో షారుక్‌ ఖాన్‌ (10 బంతుల్లో 23 నాటౌట్‌; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) కీలక పరుగులు సాధించాడు. లక్నో బౌలర్లలో యుధ్‌వీర్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌, మార్క్‌ వుడ్‌ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఆఖరి ఓవర్‌ స్పిన్నర్‌తో వేయించాలనుకున్న కేఎల్‌ రాహుల్‌ ఎత్తుగడ పారలేదు.

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ఫామ్‌ లేమితో సతమతమవుతున్న కేఎల్‌ రాహుల్‌ ఆకట్టుకోవడంతో లక్నోకు శుభారంభం దక్కింది. తాజా సీజన్‌లో తొలి అర్ధశతకం నమోదు చేసుకోవడంతో పాటు ఐపీఎల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. ఒక వైపు మయేర్స్‌ సిక్సర్లు బాదుతుంటే.. రాహుల్‌ బౌండ్రీలతో పనికానిచ్చాడు. తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించిన అనంతరం మయేర్స్‌ ఔట్‌ కాగా.. దీపక్‌ హుడా (2) నిరాశ పరిచాడు. కృనాల్‌ పాండ్యా (18) కాసేపు పోరాడగా.. పూరన్‌ (0) గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. మార్కస్‌ స్టొయినిస్‌ (15, 2 సిక్సర్లు) రెండు భారీ సిక్సర్లతో అలరించినా.. ఎక్కువసేపు నిలువలేకపోగా.. స్కోరు పెంచే క్రమంలో రాహుల్‌ వెనుదిరిగాడు. ఆయుష్‌ బదానీ (5 నాటౌట్‌) ప్రభావం చూపలేకపోగా.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా అడుగుపెట్టిన కృష్ణప్ప గౌతమ్‌ (1) ఆకట్టుకోలేకపోయాడు.

ఒత్తిడిని చిత్తుచేస్తూ

స్వల్ప లక్ష్యఛేదనలో ఉత్కంఠ నెలకొన్నా.. ఆఖర్లో షారుక్‌ ఖాన్‌ మెరువడంతో పంజాబ్‌ గెలుపు గీత దాటింది. శిఖర్‌ ధవన్‌ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అథర్వ (0) డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (4) విపలమయ్యాడు. మధ్యలో మాథ్యూ షార్ట్‌ (34), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (22) రాణించడంతో పంజాబ్‌ పోటీలోకి రాగా.. సికందర్‌ రజా అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ధవన్‌ స్థానంలో ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బంతితో మూడు వికెట్లు పడగొట్టినా.. బ్యాటింగ్‌లో రాణించలేకపోయాడు. కేఎల్‌ రాహుల్‌ పట్టిన కండ్లు చెదిరే క్యాచ్‌కు జితేశ్‌ శర్మ (2) ఔట్‌ కాగా.. చివర్లో షారుక్‌ ఖాన్‌ చక్కటి షాట్లతో లక్నోకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తమ జట్టుకు మూడో విజయాన్ని అందించాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

DC vs RCB | ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదో ‘సారీ’.. మళ్లీ ఓడిన వార్నర్‌ సేన.. బెంగళూరుకు రెండో విజయం

Exit mobile version