Home Latest News MI vs KKR | నీలి వర్ణంలో ముంబై వీర విహారం.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గ్రాండ్‌...

MI vs KKR | నీలి వర్ణంలో ముంబై వీర విహారం.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గ్రాండ్‌ విక్టరీ

MI vs KKR | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం వాంఖడే స్టేడియం మొత్తం నీలి రంగుమయం కాగా.. కొత్త జెర్సీతో బరిలోకి దిగిన ముంబై మోత మోగించింది. ఆదివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చిత్తు చేసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. వెంకటేశ్‌ (51 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించగా.. అతడికి సహచరుల నుంచి సహకారం దక్కలేదు. ఈ సీజన్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ది రెండో శతకం కాగా.. ఐపీఎల్లో అతడికిదే అత్యధిక స్కోరు. రహ్మానుల్లా (8), జగదీశన్‌ (0), కెప్టెన్‌ నితీశ్‌ రాణా (5), రింకూ సింగ్‌ (18), శార్దూల్‌ (13) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో హృతిక్‌ షోకీన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అరంగేట్రంలో కొత్త బంతితో రెండు ఓవర్లు వేసిన అర్జున్‌ 17 పరుగులు ఇచ్చి వికెట్‌ పడగొట్టలేకపోయాడు.

ఫామ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌

రోహిత్‌ శర్మకు కడుపు నొప్పి కారణంగా ఈ మ్యాచ్‌లో ముంబై జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహించాడు. లక్ష్యఛేదనలో ముంబై 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (25 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం సాధించగా.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (20; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. స్టాండిన్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (25 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎట్టకేలకు ఫామ్‌లోకి రాగా.. తెలంగాణ కుర్రాడు తిలక్‌ వర్మ (30), టిమ్‌ డేవిడ్‌ (24 నాటౌట్‌) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో సుయాశ్‌ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. వెంకటేశ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ముంబై స్టాండిన్‌ కెప్టెన్‌ సూర్యకు రూ.12 లక్షల జరిమానా పడింది. లీగ్‌లో భాగంగా సోమవారం జరుగనున్న పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది.

అర్జున్‌ టెండూల్కర్‌ అరంగేట్రం

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. గత రెండు సీజన్లుగా ముంబై ఇండియన్స్‌ జట్టుతో కొనసాగుతున్న ఈ లెఫ్టార్మ్‌ ఆల్‌రౌండర్‌ ఎట్టకేలకు తొలి మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. టాస్‌ గెలిచి మొదట బౌలింగ్‌ ఎంచుకున్న ముంబై కొత్త బంతిని ఈ 23 ఏండ్ల ఆల్‌రౌండర్‌ చేతిలో పెట్టింది. తొలి స్పెల్‌లో రెండు ఓవర్లు వేసిన అర్జున్‌ లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు అర్జున్‌కు రోహిత్‌ శర్మ జట్టు క్యాప్‌ అందించాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

DC vs RCB | ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదో ‘సారీ’.. మళ్లీ ఓడిన వార్నర్‌ సేన.. బెంగళూరుకు రెండో విజయం

PBKS vs LSG | రాహుల్‌ రాణించినా.. లక్నోకు తప్పని పరాజయం.. పంజాబ్‌ కింగ్స్‌ మూడో గెలుపు

Exit mobile version