Home Latest News Medical Student Preethi | ఉద్రిక్త పరిస్థితుల నడుమ గిర్నితండాకు ప్రీతి మృతదేహం.. నా కూతుర్ని...

Medical Student Preethi | ఉద్రిక్త పరిస్థితుల నడుమ గిర్నితండాకు ప్రీతి మృతదేహం.. నా కూతుర్ని చంపేశారంటూ గుండెలవిసేలా రోదిస్తున్న తండ్రి

Medical Student Preethi | ర్యాగింగ్‌ భూతానికి బలైన పీజీ వైద్య విద్యార్థి ప్రీతి అంత్యక్రియలు కాసేపట్లో నిర్వహించనున్నారు. నిమ్స్‌ ఆస్పత్రి నుంచి తొలుత ప్రీతి స్వగ్రామమైన జనగామ జిల్లా గిర్నీతండాకు ఉత్కంఠ పరిస్థితుల నడుమ తరలించారు. మొర్నాయి గిర్నీతండా గ్రామాల నుంచి డాక్టర్‌ అయిన మొదటి అమ్మాయి ప్రీతి.. ఇలా ఉన్నత విద్యను అభ్యసిస్తూ కన్నుమూయడంతో ఇరు గ్రామాల ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ఆమెకు కన్నీటి వీడ్కోలు పలుకుతూ కడసారి చూపునకు వచ్చారు.
అక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల బందోబస్తు మధ్యే అంత్యక్రియలు నిర్వహిస్తారు.

అసలేం జరిగింది?

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో పీజీ అనస్థీషియా చదవుతున్న ప్రీతిని సీనియర్‌ సైఫ్‌ వేధించేవాడు. అతని వేధింపులను భరించలేక తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడింది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌ దృష్టికి కూడా తీసుకెళ్లింది. దీంతో ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాలని.. ప్రిన్సిపల్‌ దగ్గరకు ఎందుకు వెళ్లారని హెచ్‌వోడీ సీరియస్‌ అయ్యాడు. కానీ సైఫ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో సైఫ్‌ నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఈ నెల 22న ఆత్మహత్యకు యత్నించింది. అనస్థీషియా ఓవర్‌ డోస్‌ ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ప్రీతిని తొలుత వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చారు. ముందు వెంటిలేటర్‌పై.. ఆ తర్వాత ఎక్మోపై ఉంచి చికిత్స అందించారు. అక్కడ ఐదు రోజుల పాటు చికిత్స అందించినా లాభం లేకపోయింది. చివరకు ఆదివారం రాత్రి 9గంటల ప్రాంతంలో ప్రీతి మరణించినట్లు నిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

నిమ్స్‌ వద్ద అర్ధరాత్రి దాకా హైడ్రామా

ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే క్రమంలో నిమ్స్‌ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు అడ్డగించాయి. దీంతో వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే తప్ప ప్రీతి డెడ్‌ బాడీని తీసుకెళ్లమని ఆమె తండ్రి నరేందర్‌ స్పష్టం చేశారు. దీనిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని.. హెచ్‌వోడీ, ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తమ కూతురు ఎలా చనిపోయింది? ఆ రోజు ఏం జరిగిందో చెప్పాలని కోరారు. లేదంటే ఆస్పత్రి వద్దే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఆయనకు పలు గిరిజన సంఘాలు మద్దతుగా నిలిచాయి.

ప్రభుత్వం హామీతో పోస్టుమార్టం పూర్తి

నిమ్స్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ప్రీతి తండ్రితో మంత్రి ఎర్రబెల్లి చర్చలు జరిపారు. దీంతో పోస్టుమార్టం కోసం ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఆయన అంగీకరించారు.నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ప్రీతి తండ్రి ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం రూ.10 లక్షలు, మంత్రి ఎర్రబెల్లి రూ.20 లక్షల పరిహారం ప్రకటించారని చెప్పారు. తమ కుటుంబంలో ఒకరికి పంచాయతీరాజ్‌ శాఖలో గెజిటెడ్‌ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారన్నారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారని ప్రీతి తండ్రి నరేందర్‌ మీడియాకు తెలిపారు. నిందితులకు శిక్ష పడేలా చూస్తామని మంత్రి హరీశ్‌రావు సైతం హామీ ఇచ్చారన్నారు.

శవపరీక్ష తర్వాత గిర్నీతండాకు ప్రీతి మృతదేహం

ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో ప్రీతి మృతదేహానికి శవ పరీక్ష చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో ప్రత్యేక అంబులెన్స్‌లో ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీతి కుటుంబసభ్యులు ఆస్పత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు శవ పరీక్ష పూర్తయిన తర్వాత పోలీసు భద్రత మధ్య ప్రీతి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని నేరుగా ప్రీతి స్వస్థలమైన జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నీ తండాకు తరలించారు. సోమవారం తెల్లవారుజామున మొర్నాయి గిర్నితండాకు ప్రీతి మృతదేహం చేరుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల బందోబస్తు నడుమనే ప్రీతి అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.

నా కూతుర్ని చంపేశారు.. ప్రీతి తండ్రి ఆవేదన

తన కూతుర్ని వేధించి చంపేశారని అంత్యక్రియలకు ముందు ప్రీతి తండ్రి నరేందర్‌ మీడియాతో అన్నారు. ఫిర్యాదు ఇచ్చినప్పుడు అధికారులు పట్టించుకోలేదని ఆయన వాపోయారు. అప్పుడు పట్టించుకుని ఉంటే తన కూతురు బతికేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Medical Student Preethi | ఉద్రిక్త పరిస్థితుల నడుమ గిర్నితండాకు ప్రీతి మృతదేహం.. నా కూతుర్ని చంపేశారంటూ గుండెలవిసేలా రోదిస్తున్న తండ్రి

Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్‌ చేసి బాధపడ్డ ప్రీతి

Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు

Hyderabad | ఫ్రెండ్ గుండె, మర్మాంగం కోసి ప్రేయసికి వాట్సాప్‌లో పంపిన బీటెక్ విద్యార్థి.. అమ్మాయిపైనా కేసు.. ట్రైయాంగిల్ లవ్‌‌స్టోరీలో కొత్త ట్విస్ట్..

Medical Student Preethi | ప్రీతిది ఆత్మహత్య కాదు.. పీజీ వైద్య విద్యార్థిని మరణంపై పలు అనుమానాలు.. నిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి

Medical Student Preethi | మెడికల్ విద్యార్థి ప్రీతి కన్నుమూత.. ప్రకటించిన నిమ్స్ ఆస్పత్రి వైద్యులు

Exit mobile version