Double Decker Bus | హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్.. ఎప్పుడో కనుమరుగైపోయిన డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ భాగ్యనగర వీధుల్లోకి వచ్చేశాయి. హైదరాబాద్ నగర వీధుల్లో రయ్ రయ్‌మంటూ పరుగులు తీయడం మొదలు పెట్టేశాయి. ఈ విషయాన్ని తెలుపుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.
హైదరాబాద్‌లో ఒకప్పుడు పాపులర్ అయిన డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ తీసుకురావాలని గతంలో ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా కోరారు. 2020 నవంబర్‌లో ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ.. ఎవరైనా ఈ డబుల్ డెక్కర్ బస్సు గుర్తుందా? జూ పార్కు నుంచి ఆప్జల్‌గంజ్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లేదని… దీన్ని మళ్లీ ప్రారంభించండి అని రిక్వెస్ట్ చేశాడు. దీనికి స్పందించిన కేటీఆర్ త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తామని మాటిచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు డబుల్ డెక్కర్ బస్సులను హైదరాబాద్‌లో మళ్లీ తీసుకొచ్చినట్టు తాజాగా ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళవారం నాడు మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎస్ శాంతికుమారి, ఎంపీ రంజిత్ రెడ్డి, మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి అందులో ప్రయాణించారు.

ప్రస్తుతం ఫార్ములా ఈ రేసు జరగనున్న ట్యాంక్‌బండ్ ప్రాంతంలో టూరిజం బస్సులుగా డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. ఆ తర్వాత టూరిజం బస్సులుగా హైదరాబాద్ వీధుల్లో తిరగనున్నాయి. ఫార్ములా ఈ రేసు జరిగే ఫిబ్రవరి 11న ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, ప్యారడైజ్, నిజాం కాలేజీ రూట్‌లో ఈ బస్సు తిరగనుంది. ప్రస్తుతానికి పర్యాటక రంగానికే పరిమితం చేసిన ఈ బస్సులను తొందరలోనే సాధారణ ప్రయాణికులకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ డబుల్ డెక్కర్ బస్సు స్పెషాలిటీ ఏంటి?
డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ హైదరాబాద్‌లోకి తీసుకొచ్చేందుకు అశోక్ లేల్యాండ్ అనుబంధ సంస్థ అయిన స్విచ్ మొబిలిటీతో హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 500 ఎలక్ట్రిక్ బస్సులను వచ్చే ఆరు నెలల్లోగా హైదరాబాద్ రోడ్లపైకి తీసుకొస్తారు. ఒక్కో బస్సును రూ.2.16 కోట్లకు స్విచ్ మొబిలిటీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ఈ బస్సులు పూర్తిగా ఎయిర్ కండీషన్‌తో ఉంటాయి. బస్సు ముందు, వెనక వైపు ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. వెనుక తలుపు వద్ద నుంచి పై భాగంలోకి వెళ్లేందుకు మెట్ల మార్గం ఉంటుంది. పైన కూర్చొని హాయిగా భాగ్యనగర అందాలను తిలకించవచ్చు. పర్యాటక రంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బస్సులు తీసుకురావడంతో బయట ప్రాంతాలు స్పష్టంగా కనిపించేందుకు చాలావరకు అద్దాలతోనే కవర్ చేశారు. ఇందులో బస్సు డ్రైవర్ కాకుండా 65 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. ఈ బస్సును ఒక్కసారి ఛార్జి చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ బస్సును ఫుల్ ఛార్జింగ్ చేయడానికి రెండు గంటల నుంచి రెండున్నర గంటల సమయం పడుతుంది.

ఏ రూట్లలో నడుస్తాయి?
ప్రస్తుతం పర్యాటకులకు మాత్రమే ఈ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులో ఉంటాయి. తొందరలోనే సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఒకవేళ సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినప్పటికీ పరిమిత రూట్లలోనే వీటిని తిప్పనున్నట్టు సమాచారం. సికింద్రాబాద్ – పటాన్ చెరు, కోఠి – పటాన్ చెరు, సీబీఎస్ – జీడిమెట్ల, ఆఫ్జల్‌గంజ్ – మెహిదీపట్నం, సికింద్రాబాద్ – మేడ్చల్, సికింద్రాబాద్ – లింగంపల్లి, జీడిమెట్ల – సీబీఎస్, పటాన్ చెరు – కోఠి రూట్లలో ఈ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పే అవకాశం ఉంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Teachers | టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బదిలీ ప్రక్రియలో వాళ్లకూ ఛాన్స్
Turkey Earthquake | ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన భారీ భూకంపాలు ఇవే..
Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా
BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు!