Turkey Earthquake | టైమ్2న్యూస్, అంకారా : ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియా కంపించిపోయాయి. కొద్దిగంటల్లోనే వరుస భూకంపాలు సంభవించడంతో రెండు దేశాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఎక్కడ చూసినా పేకమేడల్లా కూలిపోయిన భవనాల శిథిలాలు, వాటికింద చిక్కుకున్న వారి ఆర్తనాదాలతో భీతిగొల్పాయి. 7.8, 7.6 తీవ్రతలతోనే భూకంపాలు సంభవించినప్పటికీ భూకంప కేంద్రం కేవలం 18 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో నష్టం ఎక్కువగా జరిగింది. రెండు దేశాల్లో 3800 మందికి పైగా మరణించారు. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకునే ఉన్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను తరలించడంతో స్థానిక ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆస్పత్రులన్నీ మార్మోగిపోయాయి.

ఎలా మొదలైంది?
తుర్కియే, సిరియా సరిహద్దు ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామన 4.17 గంటల సమయంలో 7.8 తీవ్రతతో మొదట భూకంపం సంభవించింది. ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో ఇది ఏర్పడింది. భూమికి కేవలం 18 కిలోమీటర్ల లోతునే భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మధ్యాహ్నం 1.24 గంటల సమయంలో 7.6 తీవ్రతతో రెండో భూకంపం వచ్చింది. తొలి భూకంప కేంద్రానికి సమీపంలోని ఎకినజు పట్టణంలో ఈ రెండో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సాయంత్రం ఆరుగంటల సమయంలో 6.0 తీవ్రతతో మూడోసారి భూకంపం వచ్చింది. ఇది కాకుండా చాలాసార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఇవి ఈజిప్టు రాజధాని కైరో, లెబనన్ రాజధాని బీరూట్ దాకా పాకాయి.

పేకమేడల్లా కూలిన భవనాలు
శక్తిమంతమైన ఈ భూకంపాల ధాటికి ఇరుదేశాల్లో వేలాది భవనాలు కూలిపోయాయి. ఒక్క తుర్కియేలోనే 3 వేలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. తుర్కియేలోని ఆదానా, దియర్‌బకిర్, గాజింటెప్ నగరాలతో పాటు, సిరియాలోని అలెప్పో, హామా సహా పలునగరాల్లో భవనాలు క్షణాల్లోనే పేకమేడల్లా కూలిపోయాయి. ఈ భవనాల శిథిలాల కింద చిక్కుకుని 3800 మందికి పైగా మరణించారు. 10వేలకు పైగా జనాలు తీవ్రంగా గాయపడ్డారు.

మిన్నంటిన ఆర్తనాదాలు.. రోడ్లపై బిక్కుబిక్కుమంటూ గడిపిన జనం
శిథిలాల కింద చిక్కుక్కున్న క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆయా ప్రాంతాలు కంపించిపోయాయి. భూకంప తీవ్రతకు భవనాలు ఊగుతుండటంతో చాలామంది ప్రజలు రోడ్ల మీదనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. రోడ్లపైకి వచ్చిన జనాలతో భారీగా ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. దీనివల్ల సహాయక చర్యలు చేపట్టడంతో ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో జనాలు రోడ్ల మీదకు రావద్దని, ప్రయాణాలు చేయవద్దని ప్రజలను అధికారులు విజ్ఞప్తి చేశారు. మసీదుల వద్ద తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు.

భారత్ సహా ప్రపంచ దేశాల ఆపన్నహస్తం
తుర్కియే, సిరియా దేశాల్లో ప్రకృతి సృష్టించిన విలయాన్ని చూసి ప్రపంచ దేశాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇరు దేశాలకు సహాయం అందించేందుకు దాదాపు 45 దేశాలు ముందుకొచ్చాయి. సహాయక చర్యలు కోసం బృందాలను, వైద్య సామగ్రిని పంపిస్తామని ప్రకటించాయి. రెండు దేశాలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్, వైద్య బృందాలను భూకంప ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరి వెళ్లారు. భారత్‌తో పాటు అమెరికా, రష్యా, జర్మనీ, తైవాన్ దేశాలతో పాటు నాటో, యూరప్ సంఘాలు కూడా సహాయక చర్యలు అందించేందుకు ముందుకొచ్చాయి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Budget | సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్