Home Entertainment K Vishwanath | టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే. విశ్వనాథ్‌...

K Vishwanath | టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే. విశ్వనాథ్‌ కన్నుమూత

K Vishwanath | కళాతపస్వి కె. విశ్వనాథ్‌ (92) ఇకలేరు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా ఇంటికే పరిమితమైన కళాతపస్వి.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కె.విశ్వనాథ్‌ మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెద్దపులివర్రులో కె.విశ్వనాథ్ జన్మించారు. ఆయన అసలు పేరు కాశీనాథుని విశ్వనాథ్‌. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశాడు. తర్వాత తండ్రి సూచన మేరకు తను మేనేజర్‌గా పనిచేస్తున్న వాహిని స్టూడియోస్‌లో సౌండ్‌ ఇంజనీర్‌గా పనిలోకి చేరాడు. 1957లో వచ్చిన తోడికోడళ్లు సినిమాతో సౌండ్ ఇంజనీర్‌గా కె.విశ్వనాథ్ కెరీర్‌ మొదలైంది. అలా మద్రాసు చిత్ర పరిశ్రమతో ఏర్పడిన పరిచయంతో దిగ్గజ దర్శకులు బీఎన్‌ రెడ్డి, కేవీరెడ్డి, దుక్కిపాటి మధుసూదనరావు, తాపినేని ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, భానుమతితో కలిసి పనిచేశారు. ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి వంటి అక్కినేని సినిమాలకు ఆదుర్తి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ పరిచయంతోనే విశ్వనాథ్‌కు ఏఎన్నార్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు.

1965లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో కె.విశ్వనాథ్‌ దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే ఆయన నంది అవార్డు అందుకున్నాడు. తొలి సినిమా సక్సెస్‌ తర్వాత పలు కమర్షియల్‌ సినిమాలు చేశాడు. తర్వాత సోగ్గాడు శోభన్‌ బాబుతో చెల్లెలు కాపురం సినిమాను తీశాడు. అప్పటివరకు అందాల నటుడిగా ఉన్న శోభన్‌ బాబును డీగ్లామరస్‌ రోల్‌లో చూపించి విమర్శకులను మెప్పించాడు. ఈ సినిమాతో మరో నంది అవార్డు అందుకున్నాడు. శంకరాభరణం సినిమాతో పాశ్చాత్య మ్యూజిక్‌లో కొట్టుకుపోతున్న జనాలను శాస్త్రీయ సంగీతం వైపు మళ్లించారు. ఈ సినిమా స్ఫూర్తితో ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు శాస్త్రీయ సంగీతాన్ని నేర్పించారంటే అతిశయోక్తి కాదు. ఇవి మాత్రమే కాదు.. సిరిసిరిమువ్వ, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, స్వాతికిరణం వంటి 50కి పైగా ఆణిముత్యాలను అందించారు. వీటిలో కమల్‌ హాసన్‌తో తీసిన స్వాతిముత్యం సినిమా అప్పట్లోనే ఆస్కార్‌కు ఇండియా తరఫున నామినేట్‌ అయ్యింది. చివరగా 2010లో వచ్చిన శుభప్రదం సినిమాకు కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సత్తా చాటాడు. సర్గమ్‌, కామ్‌చోర్‌, సుర్‌ సంగమ్‌ సినిమాలతో హిట్స్‌ అందుకున్నాడు.

డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శుభసంకల్పం సినిమాతో నటుడిగా మారాడు. కలిసుందాం రా నరసింహనాయుడు, సీమ సింహం, నువ్వు లేక నేను లేను, సంతోసం, లాహిరి లాహిరి లాహిరిలో, ప్రేమతో, ఠాగూర్‌, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి పలు చిత్రాలతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు.

దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీకి సేవలందించిన కె.విశ్వనాథ్ ఎన్నో అవార్డులను అందుకున్నాడు. 1992లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు అందుకున్నాడు. 2016లో సినీ ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుతో కేంద్రం సత్కరించింది. 2017లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vijay Antony | బిచ్చగాడు హీరో లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్.. విజయ్ ఆంటోనీకి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందంటే..

Kiara Advani | పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైన హీరోయిన్.. వారం రోజుల్లోనే వివాహం

Tollywood | టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నమూత

SSMB28 | అమ్మో.. మహేశ్, త్రివిక్రమ్ మూవీ ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా?

Movies of The Week | ఈ వారం ఓటీటీ, థియేటర్లలో ఇన్ని సినిమాలు వస్తున్నాయా?

Exit mobile version