Home Latest News KCR | ఏపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సంచలన...

KCR | ఏపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

KCR | బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా దళితబంధు, రైతులకు ఉచిత విద్యుత్తు అందిస్తామని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దేశంలో రెండేళ్లలో దేశంలో కరెంటు కష్టాలు లేకుండా చేస్తామన్నారు. ఏటా 25 లక్షల మంది దళితబిడ్డలకు దళితబందు అమలు చేస్తామని ప్రకటించారు. కేంద్రంలో ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వానిది ప్రైవేటైజేషన్‌ అయితే.. మాది నేషనలైజేషన్‌ అంటూ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును అమ్మినా తాము అధికారంలోకి వచ్చాక జాతీయం చేస్తామంటూ ప్రకటించారు. ఎల్‌ఐసీని అమ్మేసినా.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు, మాజీ ఐఏఎస్‌ తోట చంద్రశేఖర్‌, మాజీ ఐఆర్‌ఎస్‌ చింతల పార్థసారథి కేసీఆర్‌ సమక్షంలో సోమవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్‌ ఆహ్వానించారు. వీరితో పాటు పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కూడా బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది ఫోన్లు కూడా చేశారని వ్యాఖ్యానించారు. మీరు సిట్టింగ్ క‌దా అని అడిగితే మేం ఫిట్టింగ్ లేమ‌ని చెబుతున్నారని కేసీఆర్‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌ అంటే తమాషా కోసమో.. చక్కిలిగింతల కోసమో, దేశంలో ఒక మూల కోసమో, ఒక రాష్ట్రం కోసమో కాదన్న కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ ఈజ్‌ ఫర్‌ ఇండియా అని ప్రకటించారు. లక్ష కిలోమీటర్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుందన్నారు. లక్ష్య శుద్ధి, సంకల్ప శుద్ది ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ వ్యాఖ్యానించారు. ఇది చాలాసార్లు రుజువైందన్నారు.

బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌

అనుకున్నట్లుగానే బీఆర్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. రావెల కిషోర్‌ బాబు జాతీయ స్థాయిలో పనిచేయాల్సిన వ్యక్తి అంటూ కొనియాడారు. పార్థ సారథి సేవలను ఉపయోగించుకుంటామన్నారు. తోట చంద్రశేఖర్‌ కర్తవ్య నిర్వహణలో పూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Exit mobile version