Home Latest News LSG vs DC | సొంతగడ్డపై లక్నో తొలి విజయం.. 50 పరుగుల తేడాతో ఢిల్లీ...

LSG vs DC | సొంతగడ్డపై లక్నో తొలి విజయం.. 50 పరుగుల తేడాతో ఢిల్లీ ఓటమి

LSG vs DC | టైమ్‌ 2 న్యూస్‌, లక్నో: లక్నో సూపర్‌ జెయింట్స్‌.. సొంతగడ్డపై ఆడిన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లో దుమ్మురేపింది. శనివారం జరిగిన రెండో పోరులో లక్నో 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. మొదట లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. కైల్‌ మయేర్స్‌ (38 బంతుల్లో 73; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. ఆఖర్లో నికోలస్‌ పూరన్‌ (21 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆయుష్‌ బదోని (7 బంతుల్లో 18; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) దంచికొట్టారు. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా క్రీజులోకి అడుగుపెట్టిన కృష్ణప్ప గౌతమ్‌ భారీ సిక్సర్‌తో అలరించాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, చేతన్‌ సకారియా చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులకు పరిమితమైంది. మార్క్‌ వుడ్‌ (5/14) ధాటికి పృథ్వీ షా (12), మిషెల్‌ మార్ష్‌ (0), సర్ఫరాజ్‌ ఖాన్‌ (4) విఫలంకాగా.. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (48 బంతుల్లో 56; 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. రిలీ రొసో (30) రాణించాడు. లక్నో బౌలర్లలో వుడ్‌ 5 వికెట్లతో అదుర్స్‌ అనిపించుకోగా.. రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లీగ్‌లో ఆదివారం కూడా డబుల్‌ హెడర్‌ జరుగనుండగా.. తొలి పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రెండో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ముంబై ఇండియన్స్‌ తలపడనున్నాయి.

మయేర్స్‌ విజృంభణ

గేల్‌, పొలార్డ్‌, బ్రావో, హెట్‌మైర్‌ వంటి విండీస్‌ వీరుల బాటలోనే మయేర్స్‌ ఐపీఎల్లో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. మెగా లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే మయేర్స్‌ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. సిక్సర్లు కొట్టడమే ఏకైక లక్ష్యంగా బరిలోకి దిగినట్లు బౌలర్‌తో సంబంధం లేకుండా దంచుడు కొనసాగించాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు మయేర్స్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ఖలీల్‌ అహ్మద్‌ నేల పాలు చేయగా.. దానికి ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. డికాక్‌ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఈ కరీబియన్‌ వీరుడు.. తన ఎంపికకు న్యాయం చేశాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (8) ఎక్కువసేపు నిలువలేకపోగా.. దీపక్‌ హుడా (17)తో కలిసి రెండో వికెట్‌కు 42 బంతుల్లోనే 79 పరుగులు జతచేశాడు. ఈ క్రమంలో 28 బంతుల్లో మయేర్స్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరితో పాటు మార్కస్‌ స్టోయినిస్‌ (12) వెంట వెంటనే ఔట్‌ కాగా.. ఆఖర్లో పూరన్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. పూరన్‌ భారీ షాట్లతో విరుచుకుపడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టగా.. కృనాల్‌ పాండ్యా (15 నాటౌట్‌; ఒక సిక్సర్‌) అజేయంగా నిలిచాడుఉ. గత సీజన్‌లో కొన్ని మెరుపులు నమోదు చేసుకున్న ఆయుష్‌ బదోనీ క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఇన్నింగ్స్‌ చివరి బంతి ఎదుర్కొన్న స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కృష్ణప్ప గౌతమ్‌ సిక్సర్‌తో స్కోరును మరింత పెంచాడు. చివరి ఐదు ఓవర్లలో లక్నో 66 పరుగులు పిండుకుంది.

Exit mobile version