Home Lifestyle Do you know Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.....

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

Pic credit: Facebook, secunderabad club website

Secunderabad Club | తిరుమలగిరి నుంచి వస్తుంటే జేబీఎస్‌ పక్కనే సికింద్రాబాద్‌ క్లబ్‌ ఉంది తెలుసా? అక్కడ బోర్డు చూడగానే సిన్స్‌ 1878 అని రాసి ఉంటుంది. ఆ బోర్డును బట్టే ఈ క్లబ్‌ చాలా పురాతనమైనదని తెలిసిపోతుంది. కానీ దీని గురించి చాలామందికి తెలియని విశేషాలున్నాయి. అవేంటో ఓ సారి లుక్కేయండి.

భారత్‌లోని అత్యంత పురాతన క్లబ్‌లలో సికింద్రాబాద్‌ క్లబ్‌ ఒకటి. 22 ఎకరాల్లో బ్రిటీష్‌ హయాంలో మిలటరీ అధికారుల కోసం 1878లో నిర్మించారు. ఆ టైంలో దీని పేరు సికింద్రాబాద్‌ పబ్లిక్‌ రూమ్స్‌గా పిలిచేవారు. కానీ తర్వాత సికింద్రాబాద్‌ గ్యారిసన్‌ క్లబ్‌గా.. సికింద్రాబాద్‌ జిమ్‌ఖానా క్లబ్‌, యునైటెడ్‌ సర్వీస్‌ క్లబ్‌ వంటి పేర్లతో పిలిచారు. 1903 నుంచి దీన్ని సికింద్రాబాద్‌ క్లబ్‌గా పిలుస్తున్నారు.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేదాక సికింద్రాబాద్‌ క్లబ్‌కు అధ్యక్షుడిగా ఉండేందుకు కేవలం బ్రిటన్‌ పౌరులనే అనుమతించేవారు. ఎందుకంటే అప్పటివరకు ఈ క్లబ్‌లోని సభ్యులంతా బ్రిటీష్‌ అధికారులే ఉండేవారు. కానీ ప్రస్తుతం అలాంటి నిబంధనలేం లేవు. ఇప్పుడు ఈ క్లబ్‌లో దాదాపు 8వేల మంది శాశ్వత సభ్యలు, 30 వేల మంది క్రియాశీలక సభ్యులున్నారు. ఓటింగ్‌ ద్వారా కమిటీని ఎన్నుకుంటారు. ఇందులో ఇప్పుడు ఆర్మీ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు, పోలీసు అధికారులు, శాస్త్రవేత్తలు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.

రూ.10 లక్షలు చెల్లిస్తే పదేళ్ల సభ్యత్వం.. అదీ రూ.5 కోట్ల ఆస్తి ఉంటేనే

సాధారణంగా ఏ క్లబ్బులోనైనా సభ్యత్వం కావాలంటే డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. మరీ ఫేమస్ అయితే నాలుగైదేళ్లు నిరీక్షించాలి. కానీ ఇక్కడ సభ్యత్వం కావాలంటే 20 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సిందేనట. అయినా సభ్యత్వం లభిస్తుందన్న గ్యారెంటీ మాత్రం లేదు. గత పదేళ్లుగా సభ్యత్వాల జోలికి కూడా కమిటీ పోలేదు. సికింద్రాబాద్‌ క్లబ్‌లో సభ్యుల సంఖ్య 8 వేలు దాటిపోవడంతో కొత్తగా సభ్యత్వాలు ఇవ్వట్లేదు. కానీ ప్రత్యామ్నాయంగా కార్పొరేట్‌ సభ్యత్వాలకు అవకాశం ఇచ్చారు. ఇందుకోసం రూ.10 లక్షలు నాన్‌ రీఫండబుల్‌ రుసుముతో పదేళ్ల కాలపరిమితి ఉండే సభ్యత్వాన్ని అందజేస్తున్నారు. అది కూడా కనీసం రూ.2 కోట్ల టర్నోవర్‌, రూ.5 కోట్లకు మించి నెట్‌వర్త్‌ కలిగిన హైదరాబాద్‌లోని వ్యాపారులకు మాత్రమే. అదికూడా 250 మందికి మించి ఇవ్వరు కూడా. సికింద్రాబాద్‌ పరిధిలో ఉన్న మిలిటరీ అధికారులకు మాత్రం నేరుగా 1100 మందికి సభ్యత్వం ఇస్తున్నారు.

భారత్‌లోని వివిధ నగరాల్లో ఉన్న 71 ప్రముఖ క్లబ్బులు, అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని టాప్‌ 100 క్లబ్‌లతో అనుబంధంగా సికింద్రాబాద్‌ క్లబ్‌ కొనసాగుతోంది. అంటే ఈ క్లబ్‌ సభ్యత్వం ఉన్న వాళ్లు ఆయా క్లబ్బుల్లోకి అతిథులుగా అనుమతిస్తారు. అందుకే దీంట్లో సభ్యత్వం కోసం పోటీ పడుతుంటారు.

➣ దేశంలో సొంతంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ కలిగిన ఒకే ఒక్క క్లబ్‌ ఇది. ఇందులో ఓ పెట్రోల్‌ బంకు కూడా ఉంది.

➣ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో ఉండే వసతులన్నీ సికింద్రాబాద్ క్లబ్‌లో ఉంటాయి. క్రికెట్‌ మైదానం, ఇండోర్, ఔట్‌డోర్‌ గేమ్స్‌కు సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలుంటాయి.

➣ బార్‌లు, డైనింగ్‌ హాల్స్‌తో పాటు పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాదు ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ కూడా ఉంది.

➣ ఇక్కడి ఫుడ్‌ కోర్టులో కాంటినెంటల్‌ నుంచి మొఘల్‌, చైనీస్‌ నుంచి ఇటాలియన్‌, ఉత్తరాది నుంచి దక్షిణ భారత వంటకాల వరకూ అన్ని రకాల వంటకాలు ఇందులో దొరుకుతాయి.

➣ కొత్త సంవత్సర వేడుకలను ఇందులో ఘనంగా నిర్వహిస్తారు. ఏటా వెయ్యి మంది వరకు సికింద్రాబాద్‌ క్లబ్‌లో నిర్వహించే తంబోలాలో పాల్గొంటారు.

➣ ఒకప్పుడు సభ్యత్వం లేని వారిని ఎవరినీ ఇందులోకి అనుమతించే వారు కాదు. కానీ ఇప్పుడు స్పాన్సర్‌షిప్‌ వేడుకలు నిర్వహించేందుకు అనుమతిస్తున్నారు.

➣ ఇందులో దాదాపు 300 మంది పనిచేస్తున్నారు.

➣ ఈ క్లబ్‌కు అనుబంధంగా బొల్లారంలోని గోల్ఫ్‌ క్లబ్‌, బోట్‌ క్లబ్‌, గ్రంథాలయం నిర్మించారు.

➣ సికింద్రాబాద్ క్లబ్‌ను భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sircilla Rajeswari |దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత

Corona cases | రాబోయే 40 రోజులు కీలకం.. భారత్‌లో భారీగా కరోనా కేసులు పెరిగే ఛాన్స్!

SSC Exams | 9,10 తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల విధానంలో మార్పులు

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

Exit mobile version