Kim Jong Un | చాలా రోజులుగా కనిపించకుండా పోయిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మళ్లీ కనిపించారు. దాదాపు 40 రోజుల తర్వాత ఆయన బాహ్య ప్రపంచం ముందుకొచ్చారు. తన కూతురితో కలిసి కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. దీంతో తన అనారోగ్యంపై వస్తున్న వార్తలకు కిమ్ చెక్ పెట్టారు.
దాదాపు 40 రోజులుగా కిమ్ బహిరంగంగా కనిపించడం లేదని ఇటీవల స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాదు ఇటీవల జరిగిన పొలిట్ బ్యూరో సమావేశానికి కూడా హాజరు కాలేదు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. అందుకే ఇన్నిరోజులుగా బయటకు కనిపించడం లేదని కథనాలు వచ్చాయి. 2014లో కూడా ఇలాగే 40 రోజుల పాటు కిమ్ కనిపించకుండా వెళ్లిపోయారు. అప్పుడు కూడా ఇదేరకమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ తర్వాత కిమ్ మీడియా ముందుకొచ్చారు. ఇప్పుడు కూడా దాదాపు 40 రోజుల తర్వాత కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చారు. కూతురితో కలిసి ఆర్మీ మీటింగ్‌కు వచ్చిన ఫొటోలను స్థానిక రోడాంగ్ సిన్‌మున్ పత్రిక ప్రచురించింది.అయితే ఈసారి తన కూతురితో కలిసి ఈ సమావేశానికి రావడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

భవిష్యత్తు వారసురాలు ఆమేనా?
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు. వీరిలో తొమ్మిదేళ్ల వయసున్న తన రెండో కూతురు జూ యే ( Kim Ju ae ) అంటే కిమ్‌కు చాలా ఇష్టం. ఇలా తన రెండో కూతురితో కలిసి ఇలా కనిపించడం ఇది నాలుగోసారి. ఇటీవల ఓ మిస్సైల్ పరీక్ష సమయంలోనూ జూ యేను కిమ్ అక్కడికి తీసుకెళ్లారు. పదే పదే కిమ్ ఈమెను వెంటబెట్టుకుని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతుండటం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తర కొరియా దేశ పగ్గాలు తమ వారసులకే దక్కుతాయని.. రాజరిక పాలన సంకేతాలను కిమ్ ఇస్తున్నారని అంతా అభిప్రాయపడుతున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter